logo

కేసుల్లో ఇరికించి.. చితకబాదారు

మాచవరం మండలంలో పోలింగ్‌ అనంతరం మరుసటి రోజు జరిగిన గొడవల్లో తమను పోలీసులు కేసులు ఇరికించారని, దారుణంగా కొట్టారని తెదేపా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 14న మాచవరం ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా గాయపరిచారు.

Published : 18 May 2024 05:18 IST

జీజీహెచ్‌లో మాచవరం తెదేపా కార్యకర్తల ఆవేదన
ఈనాడు-అమరావతి

మాచవరం మండలంలో పోలింగ్‌ అనంతరం మరుసటి రోజు జరిగిన గొడవల్లో తమను పోలీసులు కేసులు ఇరికించారని, దారుణంగా కొట్టారని తెదేపా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 14న మాచవరం ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా గాయపరిచారు. నిందితుల్ని శుక్రవారం సత్తెనపల్లి కోర్టులో హాజరుపరచగా పోలీసులు తమను కొట్టారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారికి వైద్య పరీక్షలు చేయించి నివేదిక అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించడంతో బాధితులను జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. తమను అన్యాయంగా కేసుల్లో ఇరికించి చితకబాదారని బాధితులు శుక్రవారం జీజీహెచ్‌లో మీడియాతో వాపోయారు.


ఓటేయడానికి హైదరాబాద్‌ నుంచి వచ్చా..

కొత్తగణేషునిపాడులో రాజకీయ పార్టీల మధ్య గొడవ జరిగిందని కుటుంబ సభ్యులు తెలుసుకుని స్వగ్రామంలో ఉంటే రక్షణ ఉండదని, సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించారు. దీంతో ద్విచక్రవాహనంపై బయటకు వెళుతుంటే బైపాస్‌ రోడ్డులో నిర్బంధించి పోలీసులు కొట్టారు.

పి.నిఖిల్‌, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, మోర్జంపాడు


దారుణంగా హింసించారు

తెదేపా సానుభూతిపరుడిని అనే ఏకైక ఉద్దేశంతోనే పోలీసులు నన్ను అదుపులోకి తీసుకుని దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. ఈనెల 14న మాచవరంలో జరిగిన గొడవల్లో పాల్గొనలేదు. అయినా నన్ను పోలీసులు పట్టుకెళ్లి చితకబాదారు. రెండు కాళ్లు పంగచీల్చి తొడలపై మరో కానిస్టేబుల్‌ నిలబడగా ఇంకో కానిస్టేబుల్‌ తీవ్రంగా కొట్టడంతో దెబ్బలకు తాళలేకపోయా. మమ్మల్ని ఆసుపత్రికి తీసుకొచ్చిన పోలీసులు వైద్యులపై గాయాలు కాలేదని నివేదిక ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చారు.

శ్రీకాంత్‌, రైతు, మోర్జంపాడు


ఆసుపత్రికి వెళుతుంటే లాక్కెళ్లారు

మా పెద్దనాన్న మోహన్‌రావుకు అనారోగ్యంగా ఉంటే 14న ఆసుపత్రికి తీసుకువెళ్తున్నా. అదే సమయంలో పోలీసులు జాతీయ రహదారిలో నన్ను అడ్డగించి వారి వెంట తీసుకెళ్లారు. దీంతో మా పెద్దనాన్న ఒక్కరే అనారోగ్యంతో ఉండి బైకు మీద ఇంటికి వెళ్లిపోయారు. పెద్దనాన్నకు గుండెనొప్పిగా ఉందని ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగివస్తానని చెప్పినా వినిపించుకోలేదు. పోలీసులు కొట్టిన దెబ్బలకు నడవలేకపోయాను.

టి.రమేష్‌, మోర్జంపాడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని