logo

ఎవరిపై వేటు పడుతుందో..

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు, మరుసటి రోజు చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్‌, ఎస్పీతోపాటు పలువురిపై వేటు వేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో విఫలమైన అధికారులను సస్పెండ్‌ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.

Published : 18 May 2024 05:19 IST

ఎన్నికల సంఘం చర్యలతో అధికారుల్లో కలవరం
సిట్‌ ఏర్పాటుతో సమగ్ర దర్యాప్తు
ఈనాడు-నరసరావుపేట

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు, మరుసటి రోజు చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్‌, ఎస్పీతోపాటు పలువురిపై వేటు వేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో విఫలమైన అధికారులను సస్పెండ్‌ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. మరోవైపు సిట్‌ ఏర్పాటు చేసి ప్రతి సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులను గుర్తించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలింగ్‌ రోజు జరిగిన దాడులు, అనంతరం చోటుచేసుకున్న ఘటనలపై దర్యాప్తు చేస్తే మరింత మంది పోలీసు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేయడం, ఎస్పీతోపాటు ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలపై వేటు పడింది. ఒక్క జిల్లాలోనే ఎనిమిది మందిపై ఎన్నికల సంఘం ఒకేసారి చర్యలు తీసుకోవడంతోపాటు విచారణకు ఆదేశించడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవడానికి గల కారణాలు, పోలింగ్‌ రోజు జరిగిన ఘటనలపై చర్చ మొదలైంది. జిల్లా యంత్రాంగంలో శుక్రవారం అధికారుల వేటుపైనే చర్చ జరిగింది. ఇంకా ఎవరెవరిపై చర్యలు తీసుకుంటారోనన్న ఆందోళన కూడా వ్యక్తమైంది. శుక్రవారం సిట్‌ ఏర్పాటు చేయడంతోపాటు శనివారం సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో ఆయా ఉద్యోగుల్లో కలవరపాటు మొదలైంది.

పల్నాట కట్టుదిట్టమైన భద్రత

పల్నాడు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామాల్లో తనిఖీలు చేసి అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడంతోపాటు బయటి వ్యక్తులు జిల్లాలో లేకుండా జల్లెడ పట్టారు. గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి ఆధ్వర్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసుల వరుస తనిఖీలు, బలగాల కవాతు, నిరంతరం గస్తీతో పల్నాడు జిల్లాలో ప్రస్తుతం ప్రశాంతత నెలకొంది. నివురు గప్పిన నిప్పులా ఉన్న పట్టణాల్లో మాత్రం కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది. అయితే సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరింత సమయం పట్టనుంది. మరోవైపు జిల్లా యంత్రాంగం ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ప్రక్రియపై కసరత్తు మొదలెట్టింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని లెక్కింపు రోజు మరింత అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి ఘటనలు చోటుచేసుకుండా చూడాలన్నా లక్ష్యంతో భద్రతకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉంటూ సహకరించాలని అధికారులు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. పోలింగ్‌ సందర్భంగా జరిగిన గొడవలకు సంబంధించి బాధ్యులను గుర్తించి వారిని అరెస్టు చేస్తున్నారు. శాంతిభద్రతలు అదుపులోకి రావడంతో ఇతర అంశాలపై పోలీసుశాఖ దృష్టిసారించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని