logo

పట్టణాల్లోనూ ఓటరు పోటెత్తారు!

సాధారణంగా పట్టణాల్లో నివసించేవారికి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి గంటలకొద్దీ వేచి ఉండి ఓటేసే సహనం ఉండదు. అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చినవారు పట్టణాల్లో స్థిరపడతారు. ఎవరు ఓటేశారు? ఎవరు వేయలేదు? అనేది గ్రహించరని, తమను ఓటేయమని ఎవరూ అడగరని ఓటేయడానికి నిర్లక్ష్యం వహిస్తారు.

Updated : 18 May 2024 06:19 IST

75 శాతానికిపైగా నమోదైన పోలింగ్‌
2019తో పోలిస్తే  పెరిగిన వైనం
ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట

సాధారణంగా పట్టణాల్లో నివసించేవారికి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి గంటలకొద్దీ వేచి ఉండి ఓటేసే సహనం ఉండదు. అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చినవారు పట్టణాల్లో స్థిరపడతారు. ఎవరు ఓటేశారు? ఎవరు వేయలేదు? అనేది గ్రహించరని, తమను ఓటేయమని ఎవరూ అడగరని ఓటేయడానికి నిర్లక్ష్యం వహిస్తారు. అంతేకాకుండా సెలవు వచ్చిందని సినిమానో, ఇంట్లో టీవీ చూస్తూనో కాలక్షేపం చేస్తారు. అలాంటిది ఈసారి పుర ప్రజల్లోనూ ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. జిల్లాలోని నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల పట్టణాల్లో ఈసారి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులుదీరారు. దీంతో నరసరావుపేట మినహా అన్నిచోట్లా 75 శాతంపైగా నమోదైంది.

మొదటి నుంచి గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో ఓటింగ్‌ శాతం తక్కువ నమోదవుతుంది. ప్రతి ఎన్నికలోనూ ఇదే మాదిరి కనిపిస్తుంది. ఈసారి కూడా గ్రామాల కంటే పట్టణాల్లో పోలింగ్‌ శాతం తక్కువే ఉన్నా.. 2019 ఎన్నికల పోలింగ్‌తో పోలిస్తే మాత్రం పట్టణ ప్రాంతాల్లో పెరుగుదల కనిపించడం విశేషం. పట్టణాల్లో కూడా పోలింగ్‌ శాతం పెరగడంతో ఆయా పార్టీలు గెలుపోటములపై బేరీజులు వేసుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం వల్లే ఓటర్లు ఓపిగ్గా వరుసలో ఉండి తమకే ఓటేశారని కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్‌ శాతం పెరగడం తమకు లాభిస్తుందని వివరిస్తున్నారు. అన్నిచోట్లా రెండు నుంచి మూడు శాతం పోలింగ్‌ అధికంగా నమోదు కావడం చూస్తే అన్నిచోట్లా మంచి ఫలితాలు వస్తాయని కూటమి నేతలు చెబుతున్నారు.

ఒక్క నరసరావుపేటలోనే తక్కువ నమోదు

జిల్లాలో అన్ని పురపాలక సంఘాలతో పోల్చి చూస్తే నరసరావుపేటలో తక్కువ పోలింగ్‌ నమోదైంది. 73.23 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నరసరావుపేటలో మొత్తం ఓటర్లు 1,04,768 మందికి 76721 మంది మాత్రమే ఓటు వేశారు. ఇంకా ముప్పై వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. నరసరావుపేట వాసులు అధికంగా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైతో పాటు విదేశాల్లో ఉద్యోగం, చదువుల నిమిత్తం వలస వెళ్లారు. వారంతా ఓటేయడానికి రాలేదు. అందుకే పోలింగ్‌ తక్కువగా నమోదైందని రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఒక శాతం పెరుగుదల కనిపిస్తుంది. నరసరావుపేట కంటే మిగతా పట్టణాలు ఓటింగ్‌లో చాలా మెరుగ్గా ఉన్నాయి. వినుకొండ పట్టణంలో అత్యధికంగా 83 శాతం మంది ఓటర్లు ఓటేశారు. వినుకొండ తర్వాత సత్తెనపల్లిలో 81 శాతం, నరసరావుపేటలో 2019తో పోలిస్తే 1 శాతం పోలింగ్‌ పెరిగింది. చిలకలూరిపేటలో కూడా 2 శాతం ఓటింగ్‌ పెరిగింది. సత్తెనపల్లిలో ఒక శాతం, వినుకొండలో భారీగా 3 శాతం, పిడుగురాళ్లలో 3 శాతం, మాచర్ల  1 శాతం పోలింగ్‌ అధికంగా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని