logo

ఉపాధి కల్పన జేడీ ఇంటిపై పెట్రోలు సీసాతో దాడి

రాష్ట్ర ఉపాధి కల్పనశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ)ఇంటిపై శుక్రవారం గుర్తుతెలియని దుండగులు పెట్రోలు సీసాతో దాడిచేసి ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, ఫిర్యాదుదారుల కథనం ప్రకారం.. రాష్ట్ర ఉపాధికల్పనశాఖ కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ) డి.చైతన్య గుంటూరు ఆకులవారితోటలో నివాసం ఉంటున్నారు.

Updated : 18 May 2024 06:18 IST

ఇంట్లో నిద్రిస్తున్న అధికారి, కుటుంబ సభ్యులు
వెంటనే అప్రమత్తమవ్వడంతో తప్పిన ముప్పు

కాలిపోయిన కిటికీలు, స్విచ్‌బోర్డు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: రాష్ట్ర ఉపాధి కల్పనశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ)ఇంటిపై శుక్రవారం గుర్తుతెలియని దుండగులు పెట్రోలు సీసాతో దాడిచేసి ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, ఫిర్యాదుదారుల కథనం ప్రకారం.. రాష్ట్ర ఉపాధికల్పనశాఖ కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ) డి.చైతన్య గుంటూరు ఆకులవారితోటలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం వేకువజాము 3 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు అతని ఇంటిపై పెట్రోలుసీసాకు నిప్పుపెట్టి విసిరివేశారు. ఆ సమయంలో జేడీ చైతన్య అతని కుటుంబ సభ్యులు ఇంట్లో గాఢ నిద్రలో ఉన్నారు. పెట్రోలు సీసా పగిలిన శబ్దంరావడంతో కుటుంబ సభ్యులులేచి చూసేసరికి మంటలురావడంతో నిర్ఘాంతపోయారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆ ఇంటి కిటికీలు, కరెంట్‌ స్విచ్‌బోర్డు, దుస్తులు, ప్లాస్టిక్‌ బకెట్‌ దగ్ధమయ్యాయి. అధికారితోపాటు కుటుంబ సభ్యులందరూ అప్రమత్తమవ్వడంతో పెద్దప్రమాదం తప్పినట్లయ్యింది. అధికారి వెంటనే డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో నగరంపాలెం సీఐ మధుసూదనరావు తమ సిబ్బందితో ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. పెట్రోలు బాంబుకాదని, గుర్తుతెలియని వ్యక్తి పెట్రోలు పోసి నిప్పటించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీఐ తెలిపారు.

పెట్రోలు సీసాపెంకులు, కాలిన దుస్తులు, ప్లాస్టిక్‌ బకెట్‌

కారు ఢీకొట్టిన వ్యక్తిపై అనుమానం

కొద్ది రోజుల కిందట జాయింట్‌ డైరెక్టర్‌ చైతన్య తన ఇంటి ముందు నిలిపిన కారును అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. కారు బాగా దెబ్బతినడంతో మరమ్మతులు చేయించాలని జేడీ కోరారు. ఆ యువకుడు ద్విచక్రవాహనం అక్కడ వదిలేసి మరమ్మతులకు ఖర్చులు ఇచ్చి తీసుకువెళ్లేలా మాట్లాడుకున్నారు. ఇంతలో ఈ దాడి జరగడంతో ఆ యువకుడే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ జేడీ చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని