logo

దయచేసి వినండి.. ధరలు అధికం

గుంటూరు రైల్వే స్టేషన్లో దూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని గుత్తేదారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా మంచినీరు, బిస్కెట్లు, శీతల పానీయాల అమ్మకాల్లో గరిష్ఠ అమ్మకం ధర కంటే ఎక్కువకు అమ్ముతున్నారు.

Updated : 18 May 2024 06:17 IST

రైల్వేస్టేషన్లో అందినకాడికి దోపిడీ
గుంటూరు రైల్వే , న్యూస్‌టుడే

గుంటూరు రైల్వే స్టేషన్లో దూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని గుత్తేదారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా మంచినీరు, బిస్కెట్లు, శీతల పానీయాల అమ్మకాల్లో గరిష్ఠ అమ్మకం ధర కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. ప్రయాణికులు ప్రశ్నించినా ఎమ్మార్పీకి ఇవ్వలేమని తెగేసి చెబుతున్నారు. వారితో వాదనలకు దిగేందుకు సమయం లేనందున అధిక ధరలకు కొనుగోలు చేయక తప్పడంలేదు. దీనిపై పత్రికల్లో వార్తలు ప్రచురితమైతే రైల్వే అధికారులు దాడులు చేసి జరిమానా విధిస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులకు దాని గురించి మరచిపోతారు. నిరంతర పర్యవేక్షణ లేనందున కాంట్రాక్టర్లు తమకు తోచిన విధంగా ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తుం డటం సర్వసాధారణమైంది. రాత్రి సమయాల్లో ధరలు మరింత పెంచి అమ్ముతుండటం గమనార్హం. వేసవిలో ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉంటాయి. అందువల్ల నిఘా పెంచాల్సిన అవసరం ఉంది.

స్టేషన్‌లో దుకాణాలు నిత్యం వేలల్లో ప్రయాణికులు

గుంటూరు రైల్వే స్టేషన్‌ మీదుగా నిత్యం వేలాది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఎక్కువ రైళ్లు అతి కొద్ది నిమిషాలు మాత్రమే స్టేషన్లో ఆగుతాయి. ఆ సమయంలో బోగీ నుంచి దిగి స్టేషన్‌లో ఉన్న కుళాయి వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకోవడం కష్టంగానే ఉంటుంది. దీంతో ఎక్కువ మంది తాము కూర్చున్న సీటు వద్దకే వచ్చి తాగునీరు అమ్మే సీసాలనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్నే అవకాశంగా భావించిన కాంట్రాక్టర్లు ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకుని మంచినీరు, శీతల పానీయాలు అమ్మకాలు చేస్తున్నారు.

స్టేషన్లో దుకాణాలు

అనుమతులు పక్కదారి

రైల్వే స్టేషన్‌లో స్టాల్స్‌ పెట్టుకునేందుకు అనుమతి తీసుకున్న గుత్తేదారు వెండింగ్‌ పర్మిట్లను పక్కదారి పట్టిస్తున్నారు. ఆ కార్డును ఉదయం ఒకరు, సాయంత్రం ఒకరు వినియోగిస్తుండటం గమనార్హం. ఫుడ్‌ ప్లాజాలో అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలు స్టేషన్‌ ఆవరణలోనే అమ్మాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా రహదారి పక్కన తయారుచేసే పదార్థాలు స్టేషన్‌లో అమ్ముతుండటం గమనార్హం.


ఎంఆర్‌పీకి ఇవ్వలేదు 

తాగునీటి సీసాపై ధర రూ.15 ఉంది. అయినప్పటికీ రూ.20 ఇవ్వాల్సిందేనని చెప్పారు. దీంతో చేసేది లేక కొనుగోలు చేయాల్సి వచ్చింది. గుంటూరు రైల్వే స్టేషన్‌లో రైలు దిగి కుళాయి వద్దకు వెళ్లి తాగి రావాలంటే అప్పటి వరకు రైలు ఆగుతుందో లేదో అని భయం. అందువల్లే బోగీ వరకూ వచ్చి అమ్ముతున్నవారి నుంచే ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. అధిక ధరలకు అమ్మకుండా నియంత్రించాలి. 

అంకమ్మరావు, ప్రయాణికుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని