logo

వర్షం పలకరింపు.. పుడమి పులకరింపు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. ఖరీఫ్‌ సీజన్‌ జూన్‌ నెల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి. మూడు నెలలుగా మండుటెండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వర్షం రాకతో ఉపశమనం కలిగింది.

Published : 18 May 2024 05:37 IST

ఈనాడు-అమరావతి

వడ్డమాను గ్రామంలో దుక్కిదున్ని సాగుకు సిద్ధం చేసిన పొలం

ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. ఖరీఫ్‌ సీజన్‌ జూన్‌ నెల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి. మూడు నెలలుగా మండుటెండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వర్షం రాకతో ఉపశమనం కలిగింది. ఉమ్మడి జిల్లాలో ఇంకా వ్యవసాయ పనులు ప్రారంభం కాలేదు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేసుకోవడానికి అత్యంత అనుకూలమని వ్యవసాయశాఖ సూచిస్తోంది. ఇప్పుడు పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేసుకుంటే ప్రధాన పంటలు సాగు చేసే సమయానికి ఏపుగా పెరిగిన వాటిని భూమిలో కలియదున్నితే బాగా ఉపయోగకరంగా ఉంటుంది.

గుంటూరులో 21.5 మి.మీ..

శుక్రవారం తెల్లవారుజాము నుంచి గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఒక మోస్తరు వర్షం పడింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు గుంటూరు జిల్లాలో సగటున 21.5 మిల్లీమీటర్లు నమోదుకాగా, బాపట్ల జిల్లాలో 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పల్నాడు జిల్లాలో చెదురుమదురుగా వర్షం పడింది. ఆకాశం మేఘావృతం కావడంతో పాటు వాతావరణ శాఖ వర్షం కొనసాగుతుందన్న సూచనలతో రైతులు పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

దుక్కులకు సిద్ధమవుతూ..

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కొందరు పొలాలు శుభ్రం చేసుకునే పనులు చేపట్టారు. కృష్ణా పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో రెండో పంట పూర్తి కావడంతో పొలాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత వర్షాలకు పొలాలు బాగా తడిస్తే దుక్కులు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ వరి సాగు ఎక్కువగా వెద పద్ధతిలో చేపడుతున్నందున దుక్కులు సిద్ధం చేసుకుంటే ప్రాజెక్టుల్లోకి నీటి చేరిక ఆధారంగా జూన్‌ చివర లేదా జులై తొలి వారంలో వరి సాగు చేపడతారు. ఇందుకు అనుగుణంగా రైతులు పొలాలకు కౌలు ధరలు మాట్లాడుకోవడం వంటి పనులు మొదలయ్యాయి.

ఉక్కపోత నుంచి ఉపశమనం

ప్రధాన కాల్వల నుంచి పొలాల్లోకి వచ్చే పిల్ల కాలువలు బాగు చేసుకోవడం వంటి పనులు చేపడుతున్నారు. మూడు జిల్లాల పరిధిలో పొలాల్లో మిరప, మొక్కజొన్న, పత్తి ఇతర పంటల వ్యర్థాలను శుభ్రం చేసుకుంటున్నారు. అడపాదడపా పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగ, పిల్లిపెసర విత్తనాలు చల్లుకుంటున్నారు. మూడు నెలలుగా మండుటెండలతో గరిష్ఠ ఉష్ణోగ్రతలతో భానుడు భగభగ మండగా ప్రజలు అల్లాడిపోయారు. ప్రస్తుతం కురుస్తున్న జల్లులతో వాతావరణం కొంత చల్లబడింది. దీంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని