logo

ఎన్‌ఆర్‌ఐలు, ఐటీ ఉద్యోగులే లక్ష్యం

మాతృభూమిపై మమకారంతో ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలు పడి ఎన్‌ఆర్‌ఐలు, ఐటీ ఉద్యోగులు సొంతూర్లకు వచ్చారు.

Published : 19 May 2024 05:31 IST

సంబంధం లేని కేసుల్లో ఇరికించే యత్నం
తెదేపా మద్దతుదారులపై కక్ష సాధింపు

అమరావతి, న్యూస్‌టుడే: మాతృభూమిపై మమకారంతో ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలు పడి ఎన్‌ఆర్‌ఐలు, ఐటీ ఉద్యోగులు సొంతూర్లకు వచ్చారు. వారంతా తెదేపాకు అనుకూలంగా ఓటు వేశారన్న అక్కసుతో వైకాపా నేతలు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. సంబంధం లేని గొడవల్లో ఇరికించి, కేసులు నమోదు చేయిస్తున్నారు. గ్రామాల్లో పోలింగ్, ఆతర్వాత రోజు జరిగిన వివాదాలు, ఘర్షణలకు సాకుగా చూపి, ఎన్‌ఆర్‌ఐలు, ఐటీ ఉద్యోగులపై పోలీసులకు  ఫిర్యాదులు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్‌ఆర్‌లు ఈసారి ఓటు వేయడానికి తరలివచ్చారు. కొందరు రాష్ట్ర అభివృధ్ధి కాంక్షిస్తూ కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో వైకాపా నాయకులు కక్ష కట్టి ఇబ్బందులు పెడుతున్నారు.

  • క్రోసూరు మండలం అనంతవరంలో ఎన్‌ఆర్‌ఐ మాగులూరి భానుప్రకాష్‌ తెదేపా తరపున ప్రచారం నిర్వహిస్తుండగా అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే సతీమణి తన అనుచరులతో గొడవ సృష్టించారు. ఆ గొడవను చూపి భానుప్రకాష్‌పై క్రోసూరు స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు. పెదకూరపాడు మండలం హుస్సేన్‌నగరం గ్రామానికి చెందిన భానుప్రకాష్‌ కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
  • అమరావతి మండలం ఉంగుటూరుకు చెందిన గుండవరపు అనిల్‌కుమార్‌ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. తండ్రి వెంకట్రావు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనను చూసేందుకు, అలాగే ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చారు. తండ్రితో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. గ్రామంలో జరిగిన గొడవతో అతనికి సంబంధం లేకపోయినా వైకాపా నేతల ఫిర్యాదులో కేసు నమోదు చేశారు.
  • పెదకూరపాడు మండలం హుస్సేన్‌నగరంలో ఓ వైకాపా నేతపై దాడి ఘటనలో ఐటీ ఉద్యోగులపై కేసు నమోదు చేయడానికి పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారు. ఆ గొడవకు సంబంధం లేకపోయినా ఐటీ ఉద్యోగులు తెదేపా తరపున ప్రచారం చేశారని కక్ష పెంచుకున్నారు. 

గొడవలో ఇరికించారు
- అనిల్‌కుమార్, ఎన్‌ఆర్‌ఐ 

ఎంతో ఖర్చు పెట్టుకుని ఓటు వేయడానికి సొంత ఊరికి వస్తే సంబంధంలేని గొడవలో ఇరికించారు. జన్మభూమి కోసం రావడమే మేం చేసినా తప్పా. కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరైన పద్ధతి కాదు. ఎన్‌ఆర్‌ఐలను మూల స్తంభాలుగా గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలే తప్ప.. ఇబ్బందులకు గురిచేయొద్దు.


సేవ చేసేందుకు వచ్చా
- మాగులూరి భానుప్రకాష్, ఎన్‌ఆర్‌ఐ

మాతృభూమికి సేవ చేద్దామని అంత దూరం నుంచి వచ్చాం. ఇప్పటికే 500 సేవా కార్యక్రమాలు చేశా. గొడవలతో సంబంధం లేకపోయినా కావాలనే కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని యువత భవిష్యత్తు కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రచారం చేశాం. ఎక్కడా వివాదాల జోలికి వెళ్లలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని