logo

కరిగిన ఆశలు

సాధారణంగా ఉప్పు పంటలకు ఎండలు అనుకూలం. ఉప్పు పంటను ఎండా కాలం పంటగా చెప్పాలి. ఎండల తీవ్రత బాగుంటే ఉప్పు దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం కురిసిన అకాల వర్షాలతో ఉప్పు రైతుకు తీరని నష్టం ఎదురైంది.

Published : 19 May 2024 05:38 IST

అకాల వర్షాలతో ఉప్పు రైతులకు రూ.కోట్లలో నష్టం

గట్టుపై పోసిన ఉప్పును కువ్వగా చేస్తున్న కూలీ

చినగంజాం, న్యూస్‌టుడే: సాధారణంగా ఉప్పు పంటలకు ఎండలు అనుకూలం. ఉప్పు పంటను ఎండా కాలం పంటగా చెప్పాలి. ఎండల తీవ్రత బాగుంటే ఉప్పు దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం కురిసిన అకాల వర్షాలతో ఉప్పు రైతుకు తీరని నష్టం ఎదురైంది. ఎకరానికి సరాసరి 25 క్వింటాళ్ల ఉప్పు వస్తుంది. పంట సీˆజన్‌ కాలంలో ఎకరానికి సుమారు 375 క్వింటాళ్ల నుంచి 450 క్వింటాళ్ల వరకు ఉప్పును తీస్తారు. పంటలు తీసే సమయంలో వర్షాలు కురిస్తే తీతలకు ఇబ్బంది ఎదురవుతుంది. ప్రస్తుతం ఉప్పు తీతలు బాగా వచ్చే మే నెల 8న వర్షం కురిసింది. గడిచిన మూడు రోజులుగా వర్షాలు కురిశాయి. వీటి కారణంగా కొన్ని రోజుల పాటు తీతలు తీయడం కష్టమే. చినగంజాం మండల పరిధిలో కేంద్ర ప్రభుత్వ పరిధిలో సుమారు మూడు వేల ఎకరాల ఉప్పు కొఠారులుండగా, ప్రైవేటుగా మరో రెండు వేల ఎకరాలు ఉప్పు కొఠారుల భూములున్నాయి. ఒక ఎకరానికి ఒకో తీతకు 25 క్వింటాళ్ల ఉప్పు లెక్కన 5 వేల ఎకరాల్లో ఒకసారి తీతకు 1.25 లక్షల క్వింటాళ్లు, 20 రోజులకు 2.50 లక్షల క్వింటాళ్ల ఉప్పు తీతలు వర్షాల వల్ల దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఒక క్వింటా ధర రూ.200 ఉంది. 2.50 క్వింటాళ్లకు ఉప్పు వల్ల రూ.5 కోట్లు నష్టపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఇలానే కొనసాగితే ఇక కొఠారు దెబ్బతిని తాము తీవ్రంగా దెబ్బతింటామని వాపోతున్నారు. గత మూడేళ్లుగా చూస్తే మే నెలలో వర్షాలు కురుస్తున్నాయి. తర్వాత ఉప్పు తీతలు రావడం చాలా కష్టంగా ఉంది. ఈ ఏడాది పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదని రైతులు విరిస్తున్నారు. తమ కష్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  గుర్తించి ప్రత్యేక దృష్టి సారించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

అకాల వర్షాలకు మడుల్లో కరిగిన ఉప్పు


30 ఎకరాల్లో పంట నష్టపోయా
- టి.సీˆతారామయ్య, రైతు, సోపిరాల

ప్రస్తుతం తీయాల్సిన ఉప్పు వర్షాల కారణంగా మడుల్లోనే కరిగింది. చాలా నష్టపోయాను. దీనిపై ఆధారపడిన సన్న, చిన్నకారు రైతులు ఎక్కువ శాతం అప్పులు తెచ్చి సాగు చేస్తారు. పంట దిగుబడుల కాలంలో కురిసిన వర్షం రైతుల నడ్డి విరిచింది. దీనివల్ల ఎకరం కొఠారులున్న రైతు కూడా రెండు తీతలు దెబ్బతిని రూ.10 వేలు నష్టపోయాడు. మిగిలిన శనగ, పత్తి, మిరప తదితర రైతులు మాదిరిగానే ప్రకృతి విపత్తులైన వర్షాలకు ఉప్పు పంట దెబ్బతిన్నప్పుడు రైతులను ప్రభుత్వాలే ఆదుకోవాలి.


మూడేళ్లుగా వర్షాలతో నష్టపోతున్నాం..
- విశ్వనాథబాబు, ఉప్పు సలహా మండలి మాజీ సభ్యులు

గడిచిన మూడేళ్లుగా మే నెలలోనే వర్షాలు కురిసి పంట కాలం ముగిసి రైతులు నష్టపోయారు. ఈ ఏడాది కూడా మే నెల మొదటి వారంలోనే వర్షం పడి కొందరు రైతులు దెబ్బతిన్నారు. ఇప్పుడు మరలా మూడు రోజులుగా వర్షాలు పడ్డాయి. ఉప్పు రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. లైసెన్సులున్న రైతులకు బ్యాంకు రుణాలు కూడా ఇవ్వరు. సాగు సమయంలో రైతులు పెట్టుబడులకు బాగా ఇబ్బంది పడుతున్నారు. అన్ని బాధలు పడి సాగు చేస్తే వర్షాల రూపంలో రైతుల ఆశలు అవిరైపోతున్నాయి. సంబంధితశాఖల అధికారులు రైతులకు న్యాయం చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని