logo

ఓటులో పోటీ.. స్ఫూర్తిలో మేటి

ప్రజాస్వామ్యంలో ఓటే గీటురాయి. తమకు ప్రసాదించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న కసి ప్రతి ఒక్కరిలో కనిపించింది. గతంతో పోల్చితే ఈసారి ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది.

Published : 20 May 2024 05:15 IST

పోలింగ్‌ వేళ ‘పల్లె’వించిన చైతన్యం
ఓర్పుగా వచ్చి బాధ్యతగా ఓటేశారు.. 

న్యూస్‌టుడే, తెనాలిటౌన్, మంగళగిరి,  నెహ్రూనగర్, తుళ్లూరు, పెదకాకాని, పొన్నూరు,  చేబ్రోలు, మేడికొండూరు, ప్రత్తిపాడు, పట్టాభిపురం 
ప్రజాస్వామ్యంలో ఓటే గీటురాయి. తమకు ప్రసాదించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న కసి ప్రతి ఒక్కరిలో కనిపించింది. గతంతో పోల్చితే ఈసారి ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఓటేసి తీరాలన్న తపన పట్టణ వాసుల కంటే గ్రామీణుల్లోనే అధికంగా కనిపించింది. ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో పోలైన ఓట్లను పరిశీలిస్తే గ్రామాల్లోనే అధిక శాతం పోలింగ్‌ నమోదైంది. 
ఉద్యోగ, ఉపాధి నిమిత్తం రాష్ట్రాలు, దేశాలు దాటి వెళ్లిన వారు సైతం వ్యయప్రయాసలకు ఓర్చి ఓటేయడానికి వచ్చారు. ఓటు హక్కు మాత్రమే కాదని, మన బాధ్యత అని గుర్తుచేశారు. సమర్థులైన నాయకులను ఎన్నుకోకపోతే జరిగే విధ్వంసాన్ని కళ్లారా చూశామని, అందుకే విమాన ఛార్జీలకే రూ.లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చామని కొందరు ప్రవాస భారతీయులు పేర్కొన్నారు. ఆయా గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని బూత్‌లలో 94 నుంచి 100 శాతం వరకు నమోదైన పోలింగ్‌ పల్లెవించిన చైతన్యానికి నిదర్శనం.

  • జిల్లాలో తాడికొండ నియోజకవర్గంలో అత్యధికంగా 87.47శాతం, అత్యల్పంగా గుంటూరు పశ్చిమలో 66.53 శాతం పోలింగ్‌ నమోదు అయింది. మహిళలు అన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • పొన్నూరు నియోజకవర్గంలో 2019లో 82.83 శాతం ఓటేయగా 2024లో 84.92 శాతం మందికి పెరిగారు. ఇక్కడ సుమారు 2.09 శాతం మంది అదనంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
  • గుంటూరు తూర్పులో 2019లో 70.13 శాతం మంది ఓటేయగా 2024లో అది 70.46 శాతానికి పెరిగింది.
  • ప్రత్తిపాడు నియోజకవర్గంలో 2019లో 84.20 పోలింగ్‌ జరగ్గా 2024లో 85.20 కావడం విశేషం. 

పెదపరిమిలో ఓటు వేయడానికి మహిళల బారులు 

తెనాలి

  • తెనాలి నియోజకవర్గంలో గ్రామీణ ఓటర్లు ఓటు వేసే విషయంలో స్ఫూర్తిని చాటారు. ఇక్కడ 90 శాతం పైగా పోలింగ్‌ దాటిన కేంద్రాలు మొత్తం 29 ఉన్నాయి. ఈ మొత్తంలోనూ కొల్లిపర మండలానిదే పై చేయి. అక్కడ అత్యధికంగా ఓట్లు పోలైన కేంద్రాలు 19 ఉన్నాయి. ఇక తెనాలి మండలంలోని గ్రామాల్లో 10 ఉన్నాయి. పట్టణంలో ఒక్క కేంద్రంలోనూ 90 శాతానికి దగ్గరగా కూడా పోలింగ్‌ జరగలేదు.
  • తెనాలి మండలం: పెదరావూరు, చావావారిపాలెం, సంగంజాగర్లమూడి, కోపల్లె, గుడివాడ, కంచర్లపాలెం, ఖాజీపేట గ్రామాల్లోని పది పోలింగ్‌ కేంద్రాల్లో 90 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది.అత్యధికంగా కంచర్లపాలెంలోని 24వ కేంద్రంలో 94.29 శాతం నమోదైంది.
  • కొల్లిపర మండలం: చక్రాయపాలెం, చివలూరు, సిరిపురం, అత్తోట, దంతలూరు, వల్లభాపురం, పిడపర్రు, దావులూరిపాలెం, బొమ్మవానిపాలెం, అన్నవరం, అన్నవరపులంక గ్రామాల్లోని మొత్తం 19 కేంద్రాల్లో 90 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. వీటిల్లో అత్యధికంగా అన్నవరంలోని 271వ కేంద్రంలో 95.99 శాతం మంది ఓటేశారు.
  • తెనాలి పట్టణంలో ఏ ఒక్క కేంద్రంలోనూ 90 శాతానికి అటూ ఇటూ కూడా పోలింగ్‌ నమోదు కాలేదు. అత్యధికంగా పట్టణ సుల్తానాబాద్‌లోని 53వ పోలింగ్‌ కేంద్రంలో 83.46 శాతం పోలింగ్‌ జరిగింది.

పొన్నూరు

  • పొన్నూరు మండలం మునిపల్లెలోని 163 పోలింగ్‌ కేంద్రంలో 95.20 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ కేంద్రం పరిధిలో ఎక్కువగా రైతులు, రైతుకూలీలు ఉన్నారు.
  • చేబ్రోలు మండలంలో గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెరిగింది. మండలంలో అత్యధికంగా గుండవరంలోని 117 పోలింగ్‌ కేంద్రంలో 96.42 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నారాకోడూరులోని బూత్‌ నంబరు 109లో 95.91, సుద్దపల్లి ఎస్సీ కాలనీలోని బూత్‌ నం 98లో 94.5 పోలింగ్‌ శాతం నమోదైంది.
  • పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలోని 10వ పోలింగ్‌ కేంద్రంలో 96 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ మొత్తం 623 ఓట్లు ఉండగా 600 ఓట్లు నమోదయ్యాయి. ఇందులో పురుషులు 294, మహిళలు 307 మంది ఉన్నారు. ఈ కేంద్రం పరిధిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవులు ఎక్కువ మంది ఉన్నారు.

ప్రత్తిపాడు

పెదనందిపాడు మండలం గోరిజవోలుగుంటపాలెం గ్రామం జడ్పీ ఉన్నత పాఠశాలలో 205 పోలింగ్‌ కేంద్రంలో 95.20 శాతం మంది ఓటు వేశారు. ఇదే మండలం అన్నవరం గ్రామంలోని ఎస్సీ ఏరియాలో ప్రాథమిక పాఠశాలలోని 224 పోలింగ్‌ కేంద్రంలో 100శాతం పోలింగ్‌ నమోదు కావడం విశేషం. 

మంగళగిరి

 మంగళగరి నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓటింగ్‌ నమోదైంది. మంగళగరి మండలం కురగల్లు గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో 97.55 శాతం, నీరుకొండలోని 118, 119 పోలింగ్‌ కేంద్రాల్లో 97.25, 97.01 శాతంగా నమోదైంది. రెండు గ్రామాలు రాజధాని పరిధిలో ఉండడంతో అక్కడ ఓటర్లు అధికంగా ఓటును వినియోగించుకున్నారు.

తాడికొండ

  • తుళ్లూరు మండలం తాళ్ళాయపాలెంలోని బూత్‌ నెం.9లో 95 శాతం. నేలపాడు గ్రామంలోని బూత్‌ నం.31లో 94 శాతం. నెక్కల్లులోని బూత్‌ నం.46లో 95 శాతం ఓటింగ్‌ జరిగింది. పోస్టల్, హౌస్‌ ఓటింగ్‌ కలిపితే మరికొంత శాతం పెరుగుతుంది. తుళ్లూరు మండలం రాజధాని నగరంలో భాగంగా ఉండడంతో అమరావతి ఉద్యమం కీలక పాత్ర పోషించింది. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఉద్యమం తీవ్ర ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఉంటున్న వారు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఓట్లు వేశారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు, అసైన్డ్‌ రైతులకు ప్రభుత్వం రెండు ఏళ్ల నుంచి  కౌలు చెల్లించడం లేదు. రైతు కూలీలకు ఉపాధి లేదు. ఉద్యోగాల కోసం యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
  • మేడికొండూరు మండలం విశదల గ్రామంలోని 123వ పోలింగ్‌ కేంద్రంలో  94.95 పోలింగ్‌ శాతం నమోదు కాగా కొర్రపాడు 167వ కేంద్రంలో 94.72 ,  పొట్లపాడులో 94.50, మంగళగిరిపాడులో 95.47 శాతం మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.
  • ఫిరంగిపురం మండలం అమీనాబాద్‌ 187వ పోలింగ్‌ బూత్‌లో 94.99 శాతం, కండ్రిక పరిధిలోని 224 పోలింగ్‌ కేంద్రంలో 94.52 శాతం నమోదయింది. 

బేతపూడి పోలింగ్‌ బూత్‌ 239లో 97, 240లో 96.60 శాతం పోలింగ్‌ నమోదైంది.


రాత్రి 9 గంటలైనా ఓర్పుతో..

పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండల పరిధిలోని నంబూరు, పెదకాకాని, ఉప్పలపాడు, చేబ్రోలు మండల పరిధిలోని శేకూరు, శలపాడు, వేజండ్ల, పొన్నూరు మండల పరిధిలోని బ్రాహ్మణకోడూరు, పొన్నూరు పట్టణ పరిధిలోని 178, 179, 180, 185 తదితర పోలింగ్‌ కేంద్రాల్లో రాత్రి 9 గంటల వరకు ఓటర్లు వరస క్రమంలో నిలబడి ఓర్పుతో ఓటు వేశారు.


గెలుపు ఓటములను కేవలం ఒక్క ఓటు శాసించనున్న తరుణంలో పెరిగిన ఓట్ల శాతంపై ఎవరికి వారు తమదే విజయం అన్న ధీమాతో ఉన్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని