logo

ఓట్ల లెక్కింపునకు భద్రత కట్టుదిట్టం

ఓట్ల లెక్కింపునకు సంబంధించి జూన్‌ 4న  ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్‌ దూడి తెలిపారు.

Published : 20 May 2024 05:17 IST

144 సెక్షన్, 30 పోలీసు చట్టం అమలు
ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతిలేదు
బాటిళ్లలో పెట్రోలు విడిగా పోయడం నిషేధం
ఎస్పీ తుషార్‌ దూడి

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : ఓట్ల లెక్కింపునకు సంబంధించి జూన్‌ 4న  ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్‌ దూడి తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. పెట్రోలు బంకుల్లో విడిగా బాటిళ్లలో పెట్రోలు, డీజిల్‌ పోయడం నిషేధమన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలో ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతిలేదని చెప్పారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బాణసంచా నిల్వ కేంద్రాలపై పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించామని పేర్కొన్నారు. అనుమతులులేకుండా బాణసంచా కాల్చినా, ఇతర పార్టీల అభ్యర్థులు, కార్యకర్తల ఇంటి ముందు కవ్వించే విధంగా బాణసంచా కాల్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లెక్కింపు సందర్భంగా సమస్యాత్మక గ్రామాలు, ప్రధాన కూడళ్లల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఎన్నికలకోడ్‌తోపాటు సెక్షన్‌ 144, 30 పోలీసు చట్టం అమలులో ఉందని, ఏ ప్రాంతంలోనైనా నలుగురు కన్నా ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడి ఉండకూడదని, బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూదన్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి పార్టీలవారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం, వదంతులు ప్రచారం చేసినా నేరమని వివరించారు. యువకులు బైక్‌ సైలెన్సర్లు తీసి అధిక శబ్దాలు చేస్తూ నడిపితే వారిపై కేసు నమోదు చేసి వాహనాలను జప్తు చేస్తామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని