logo

గుంటూరు నుంచి గుజరాత్‌.. వయా జహీరాబాద్‌!

బస్తాల ప్యాకింగ్‌ మార్చి గుంటూరు నుంచి గుజరాత్‌కు జహీరాబాద్‌ మీదుగా అక్రమ రవాణా చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌-2 హైదరాబాద్‌ అధికారులు పట్టుకున్నారు.

Published : 20 May 2024 05:22 IST

280 క్వింటాళ్ల చౌకబియ్యం పట్టుకున్న విజిలెన్స్‌ అధికారులు

పోలీసులు స్వాధీనం చేసుకున్న బియ్యం, లారీ 

న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌: బస్తాల ప్యాకింగ్‌ మార్చి గుంటూరు నుంచి గుజరాత్‌కు జహీరాబాద్‌ మీదుగా అక్రమ రవాణా చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌-2 హైదరాబాద్‌ అధికారులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం చిరాగ్‌పల్లి సమీపంలోని అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద లారీలో తరలిస్తున్న 280 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వట్టిచెెరుకూరు మండలం చమళ్లమూడి గ్రామంలోని ‘పద్మజ రైస్‌ ట్రేడర్స్‌’లో బియ్యాన్ని లోడ్‌చేసి లారీలో జహీరాబాద్‌ మీదుగా అంతర్రాష్ట్ర సరిహద్దు దాటిస్తున్నారనే పక్కా సమాచారంతో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. వివిధ బ్రాండ్ల పేర్లతో 1120 బస్తాల్లోని బియ్యం సహా లారీని జప్తు చేసిన అధికారులు అక్రమ రవాణాకు పాల్పడుతున్న లారీ డ్రైవర్‌ గుజరాత్‌ జామ్‌నగర్‌కు చెందిన మక్వాన్‌గిరిధర్‌ భాయ్‌(44), బియ్యం యజమాని గుంటూరు జిల్లా వట్టిచెెరుకూరు మండలం దామలముద్దికి చెందిన కమలపతి శ్రీనివాస్‌లపై చిరాగ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని కోహీర్‌ మండలం దిగ్వాల్‌లోని పౌర సరఫరాల గోదాములో భద్రపరిచినట్లు సంబంధిత ఉప తహసీల్దార్‌ రవి పేర్కొన్నారు. బియ్యం పట్టివేత ఘటన సమాచారాన్ని బహిర్గతం చేయడంలో పౌర సరఫరాల శాఖ, పోలీసు అధికారులు జాప్యం చేయడంపై స్థానికంగా పలు అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణ- కర్ణాటక సరిహద్దులో శనివారం మధ్యాహ్నం పట్టుకున్న రేషన్‌ బియ్యం వివరాలను ఆదివారం మధ్యాహ్నం తర్వాత చిరాగ్‌పల్లి పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. పట్టుకున్నది ఒక్క లారీనా? లేక మరికొన్ని పట్టుకుని ఒక్క లారీ వివరాలు వెల్లడించారనే ప్రచారం సాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు