logo

అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొన్న బస్సు

ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంగళగిరి గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం.

Published : 20 May 2024 05:25 IST

తప్పిన పెను ప్రమాదం
నలుగురికి స్వల్ప గాయాలు

చినకాకాని వద్ద ప్రమాదానికి గురైన బస్సు 

చినకాకాని (మంగళగిరి), న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంగళగిరి గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు నుంచి విజయవాడ బయలుదేరిన నాన్‌-స్టాప్‌ బస్సు మంగళగిరి మండలం చినకాకాని వద్ద అదుపు తప్పింది. దీంతో జాతీయ రహదారిపై నుంచి దిగువ సర్వీసు రోడ్డు దాటుకుని కల్వర్టు గోడను ఢీకొట్టింది. ఈ ఘటనతో బస్సులోని వారంతా తీవ్ర భయాందోళనలతో కేకలు వేశారు. ఆ సమయంలో సర్వీసు రోడ్డులో ఎలాంటి వాహనాలు, జన సంచారం లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పింది. వేగంగా జాతీయ రహదారిపై వెళుతున్న బస్సుకు ఒకవైపు నుంచి ద్విచక్ర వాహనదారుడు అడ్డు రావడంతో అతన్ని తప్పించే క్రమంలో కంగారు పడిన డ్రైవర్‌ ఒక్కసారిగా పక్కకు తిప్పారు. దీంతో బస్సు అదుపు తప్పి దిగువ సర్వీసు రోడ్డు నుంచి పెద్ద కల్వర్టుకు ఉన్న గోడను ఢీకొట్టి నిలిచింది. భయంతో ప్రయాణికులు అత్యవసర ద్వారం గుండా ప్రాణాలు అరచేతలో పెట్టుకుని బయటకు వచ్చారు. అప్పటికే ముగ్గురు మహిళలు, ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులు గుంటూరు వెళ్లిపోయారు. మొత్తం 40 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. మిగిలిన వారంతా విజయవాడ వెళ్లేందుకు ఇతర వాహనాలను ఆశ్రయించారు. కల్వర్టుకు గోడ లేకుండా ఉంటే పూర్తిగా బస్సు దానిలో పడిపోయేదని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని