logo

దేవుడి భూమి.. సమర్పయామి

దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు.

Published : 21 May 2024 03:58 IST

ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నవగ్రహాలయ సర్వీసు మాన్యం 
విక్రయించి సొమ్ము చేసుకున్న అర్చకులు
నిలిచిపోయిన ధూపదీప నైవేద్యాలు
అమరేశ్వరాలయంలో ఇదీ సంగతి
ఈనాడు, న్యూస్‌టుడే, అమరావతి

దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు. ఇదీ అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయంలోని నవగ్రహాలయం భూముల వ్యవహారం. భక్తులు టిక్కెట్‌ కొనుగోలు చేయగా వచ్చిన ఆదాయంతోనే పూజలు చేయాల్సిన పరిస్థితి. 

పంచారామాలలో ప్రథమారామం అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయం. 1940లో గుబ్బా శ్రీరాములు అనే భక్తుడు వెంకటాద్రినాయుడి మండపంలో నవగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆలయ కైంకర్యాలకయ్యే మొత్తాన్ని అర్చకులకు ఇచ్చి నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారు. తన తదనంతరం కూడా ధూపదీప నైవేద్యాలకు ఇబ్బందుల్లేకుండా ఉండాలన్న సదాశయంతో నవగ్రహాలయానికి అమరావతి రెవెన్యూ పరిధిలో రెండెకరాల భూమిని 1955లో అప్పటి అర్చకులైన శంకరమంచి చినపుల్లయ్యకు దానపత్రం ద్వారా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆ భూమి ద్వారా వచ్చే ఫలసాయంతో నవగ్రహ మండపంలోని స్వాములకు నిత్యనైవేద్య ధూపదీప కైంకర్యాలు నిర్వహించగా మిగిలిన సొమ్మును అర్చకస్వాములు అనుభవించాలని దానపత్రంలో పేర్కొన్నారు. ఒకవేళ కైంకర్యాలు నిర్వహించకపోతే ఆ భూమిని తిరిగి తీసుకునే హక్కును తన వారసులకు ఇస్తున్నట్టు కూడా దాత స్పష్టంగా రాశారు. తాకట్టుపెట్టడంగానీ, విక్రయించడానికిగానీ ఎలాంటి హక్కులు లేవని కూడా పేర్కొన్నారు. నవగ్రహాలను 1980 పుష్కరాల సమయంలో ఆలయంలోని రెండవ ప్రాకారంలో ఆంజనేయస్వామి    ఉపాలయం వద్ద ప్రతిష్ఠించారు. అర్చకుల వారసులు కైంకర్యాలను చేస్తూ వచ్చారు.


దాత ఆశయం మరిచి విక్రయం

వ్యాంధ్ర రాజధానిని తుళ్లూరు మండలంలో ఏర్పాటు చేయడంతో పక్కనే ఉన్న అమరావతిలో భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి. దీంతో దాత ఇచ్చిన భూమిని విక్రయించేందుకు ప్రయత్నించిన అర్చకులు గుట్టుచప్పుడు కాకుండా 2020 జులైలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేశారు. అప్పట్లో ఇక్కడ బహిరంగ మార్కెట్‌లో ఎకరం ధర రూ. కోటి వరకు ఉంది. అర్చకులు మాత్రం లక్షల రూపాయలకే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి వచ్చిన డబ్బును పంచేసుకున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆ భూమి విలువ రూ. 29 లక్షలుగా ఉంది. గత నాలుగేళ్లుగా నవగ్రహాలకు ధూపదీప నైవేద్యాలు నిలిచిపోయాయి. శనివారం రోజున ఎవరైనా శని పూజ చేయించుకుంటే తప్ప గేట్లు కూడా తెరవని పరిస్థితి నెలకొంది. 


అధికారులు ఏం చేశారు? 

వగ్రహాల కైంకర్యాల కోసం దాత ఇచ్చిన భూమిని దేవాదాయశాఖ రికార్డుల్లో నమోదు చేసి కాపాడాల్సిన ఆలయ అధికారులు నిర్లక్ష్యం చేశారు. ఆలయాల భూములను నిషేధిత జాబితాలో పెట్టి విక్రయాలు జరగకుండా చూడాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా అమలు చేయడంలో విఫలమయ్యారు. సర్వీసు మాన్యం, ఇతర భూములు, ఆస్తులను పర్యవేక్షిస్తూ రికార్డుల్లో  ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సిన ఈవోల అలసత్వం వల్ల రూ. కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతమైంది. నాలుగేళ్ల కిందట విక్రయం జరిగినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆలయ ఈవో వేమూరి గోపిని వివరణ కోరగా భూములను  విక్రయించిన విషయం తమ దృష్టికి రావడంతో విచారణ చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఆ భూమిని నిషేధిత జాబితో పెట్టి ఆలయ ఆస్తుల జాబితాలో నమోదు చేశామని చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు