logo

కొంతమంది పోలీసుల తీరుతోనే.. హింసాకాండ

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఈనెల 13వ తేదీ, తర్వాత రోజు పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్‌ దర్యాప్తు బృందం విచారణ చేసింది.

Published : 21 May 2024 04:02 IST

క్షేత్రస్థాయిలో విచారించిన సిట్‌  
మొక్కుబడి కేసులు.. అరెస్టులతో సరిపుచ్చారని వెల్లడి   
ఎమ్మెల్యేలకు షాడోలుగా పనిచేసిన ఎస్‌బీ ఉద్యోగులు 
ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించిన సిబ్బంది 
ఈనాడు, అమరావతి 

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఈనెల 13వ తేదీ, తర్వాత రోజు పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్‌ దర్యాప్తు బృందం విచారణ చేసింది. శని, ఆదివారం రెండురోజుల పాటు సిట్‌ అధికారులు నరసరావుపేట, రెంటచింతల, దాచేపల్లి స్టేషన్లతో పాటు పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ రోజున ఏం జరిగింది? గొడవలు, అలర్లకు కారణాలేమిటి? ఆ ఘటనల్లో నాయకుల పాత్ర ఏమిటి? పోలీసులు వాటిపై ఎన్ని కేసులు నమోదు చేశారో స్టేషన్లకు వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయా కేసులకు సంబంధించి పెట్టిన సెక్షన్లు, అరెస్టులు వంటి సమగ్ర వివరాలు సేకరించారు. ఈమేరకు సోమవారం సిట్‌ దర్యాప్తు అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ తన నివేదికను డీజీపీకి అందజేశారు. సిట్‌ విచారణలో అనేక లోపాలు వెలుగుజూశాయి. అల్లర్లు, ఘర్షణలను కట్టడి చేయటంలో పోలీసుల వైఫల్యం ఉన్నట్లు గుర్తించారు.


మ్మెల్యే పీఆర్కే సోదరుడు వెంకట్రామిరెడ్డి తన స్వగ్రామం వెల్దుర్తి మండలం కండ్లకుంటలో తెదేపా ఏజెంట్‌ను పోలింగ్‌బూత్‌ నుంచి బయటకు వెళ్లిపోవాలని తీవ్రస్థాయిలో బెదిరించాడు. తర్వాత అతని ఇంటికి వెళ్లి కుటుంబీకులను భయభ్రాంతులకు గురిచేసినా ఆది మరుసటి రోజు వరకు వెలుగుచూడలేదు. ఇలాంటి ఘోరాలు, నేరాలు పోలింగ్‌రోజున పల్నాడులో అనేకం జరిగాయి. ఎస్‌బీ కిందిస్థాయి సిబ్బంది తన స్టేషన్‌ పరిధిలోని అన్ని గ్రామాలు తిరుగుతూ ఎప్పటికప్పుడు ఏం జరిగినా చెప్పాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపితే ఎప్పటికప్పుడు ఏం  జరిగినా ఎస్పీకి సమాచారం  చేరేది. 


గీత దాటితే వేటేనని హెచ్చరించినా..

ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పోలీసుశాఖ కసరత్తు ప్రారంభించింది. మరోవైపు ఎన్నికల సంఘం ఎన్నికల వేళ అధికారులు రాజకీయ నేతలకు తొత్తులుగా మారినా.. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని గీత దాటే వారిపై చర్యలు ఉంటాయని ముందుగానే హెచ్చరించింది. ఈసీ ఆదేశాలు, హెచ్చరికలు పల్నాడులోని చాలామంది పోలీసులకు చెవికెక్కలేదు. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, నేతలతో అంటకాగారు. వైకాపాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, నేతలు పోలింగ్‌ వేళ మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీ నేతలే కాదు ఓటర్లపైనా దౌర్జన్యాలు, దాష్టీకాలు సాగించారు. దీంతో పోలింగ్‌ వేళ పల్నాడు ప్రాంతం రక్తసిక్తమైంది. దాడులను ఏ మాత్రం పోలీసులు కట్టడి చేయలేకపోయారు. ఆ మరుసటిరోజు మరింత రెచ్చిపోవటంతో పల్నాడులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాచర్ల ఎమ్మెల్యే సోదరులు కిరాయి హంతకుల చేతికి రాడ్లు, కర్రలిచ్చి పంపటంతో వారు స్వైరవిహారం చేశారు. ఈ ఘటనలు ఎన్నికల సంఘానికి ఆందోళన కలిగించాయి. వెంటనే అప్రమత్తమై ఘటనలకు పల్నాడు కలెక్టర్, ఎస్పీని బాధ్యుల్ని చేసి వారిపై వేటేసింది. ఈ పరిణామాలపై సిట్‌తో విచారణకు ఆదేశించింది. ఆ బృందం రెండు రోజుల పాటు జరిపిన క్షేత్రస్థాయి విచారణలో పెద్దఎత్తున జరిగిన హింసతో పల్నాడు అట్టుడికిపోయిందని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లిందని నివేదించింది. ఇప్పటికే ఈసీ కలెక్టర్‌పై బదిలీవేటు, ఎస్పీ సస్పెన్షన్, గురజాల, పేట డీఎస్పీలు, మరో ఇద్దరు సీఐ, మరో ఇద్దరుఎస్సైలను సస్పెండ్‌ చేసి ఝలక్‌ ఇచ్చింది. సిట్‌ విచారణ పూర్తికావటంతో ఇంకెంతమందిపై చర్యలు ఉంటాయోనని పోలీసు వర్గాలు హడలిపోతున్నాయి. 


వారిని ఎమ్మెల్యేల వెంట తిప్పుతారా?

పోలింగ్‌ రోజున కీలకమైన స్పెషల్‌ బ్రాంచి(ఎస్‌బీ) పోలీసుల్ని ఎమ్మెల్యేల వెంట షాడోలుగా తిప్పి వారిని డమ్మీలను చేశారు. వారు ఇంకెక్కడికి వెళ్లటానికి వీల్లేకుండా వ్యూహాత్మకంగా కట్టడి చేశారు. పోలింగ్‌ వేళ క్షేత్రస్థాయిలో ఏం జరిగినా ఎస్పీకి తెలిసే అవకాశం లేకుండా ఎన్నికల బందోబస్తును లోపభూయిష్టం చేశారు. ఈ విషయంలో ఎస్పీని పూర్తిగా తప్పుదోవ పట్టించారు. కొందరు జిల్లా పోలీసులు.. ఎస్పీకి సమాచారమిచ్చే కీలకమైన ప్రత్యేక పోలీసులను క్షేత్రస్థాయిలో తిరగకుండా చేసేలా వ్యవహరించారు. ఈ లోపాలే కొంపముంచాయి. పోలీసు ఉన్నతాధికారికి నేరుగా సమాచారమిచ్చే ప్రత్యేక పోలీసులను ఎమ్మెల్యేల వెంట తిప్పటంతో  ఆ రోజున మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు పైస్థాయిలో తెలియకుండా చేశారు. 


  • పోలింగ్‌ రోజున బాడీవోర్న్‌ కెమెరాలిచ్చి ఎస్‌బీ ఉద్యోగులను ఎమ్మెల్యేల వెంట పంపారు. ఒకవేళ వారికి ఏదైనా సమాచారం తెలిసినా ఎస్పీకి చెప్పటానికి వీల్లేకుండా పోయింది. వారు ఏం మాట్లాడినా బాడీవోర్న్‌ కెమెరాల్లో రికార్డు అవుతుంది. ఆపై ఎమ్మెల్యేల వెంట ఉండి వారికి వ్యతిరేకంగా చెప్పలేని పరిస్థితి. ఈ విభాగంలో కొందరు ఆ ఎమ్మెల్యేలతో అంటకాగుతూ వారికి తొత్తులుగా మారారనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యేల సిఫార్సులతోనే ఎస్‌బీ పోస్టింగ్‌లు కొందరికి దక్కాయి. దాంతోవారు ఎమ్మెల్యేల కదలికలపై నోరుమెదపలేదని వినికిడి. 
  • మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భారీ కాన్వాయ్‌తో అనుచరగణాన్ని వెంటేసుకుని పలు పోలింగ్‌ బూత్‌లకు వెళ్లారు. ఆయన వెంటే ప్రయాణిస్తున్న ఎస్‌బీ సిబ్బంది ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పలేని పరిస్థితి. ఒకవేళ చెబితే వెంటనే అనుచరగణం తనపై దాడికి పాల్పడతారని గుంభనంగా ఉండిపోయారు.
  • బొల్లాపల్లిలో పోలింగ్‌ సమయంలో తెదేపా-వైకాపా ఏజెంట్లకు మధ్య గొడవ జరిగింది. పోలింగ్‌ అనంతరం గంగులపాలేనికి చెందిన తెలుగుయువత నాయకుడొకరు వినుకొండకు వెళ్లటానికి కారులో వస్తుండగా ఆ ఊళ్లో వైకాపా వాళ్లు కారు అడ్డగించి ఉదయం జరిగిన సంఘటనపై ప్రశ్నించి నీ దిక్కున వాడికి చెప్పుకోవాలని హెచ్చరించి కారు నిలిపేశారు. దీంతో అతను స్టేషన్‌కు ఫోన్‌ చేయగా కానిస్టేబుల్‌ను పంపారు. అయినా కారు వదిలిపెట్టడానికి ససేమిరా అనడంతో చివరకు ఎస్సై చెన్నకేశవులు వచ్చి కారును విడిపించి తెదేపా నేతను పంపారు. అతను వెళ్లగానే ఎస్సైను వైకాపా నేతలు చుట్టుముట్టారు. రెండు గంటల పాటు వదల్లేదు. ఆ విషయం రెండురోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. 
     
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని