logo

ఆ దారి.. మృత్యు వారధి

కనిపించని సూచిక బోర్డులు.. ప్రమాదకర మలుపులు.. చోదకుల మితిమీరిన వేగం.. వాహనదారుల నిర్లక్ష్యం.. రోడ్డుపై నిలుపుతున్న వాహనాలు.. కారణం ఏదైనా.. వాడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలు నిండు ప్రాణాలను హరిస్తున్నాయి.

Updated : 21 May 2024 05:43 IST

ప్రమాదాలకు నిలయంగా వాడరేవు- పిడుగురాళ్ల రోడ్డు
హైవే విస్తరణ  జరుగుతున్నా.. కనిపించని సూచిక బోర్డులు 
పర్చూరు (మార్టూరు), న్యూస్‌టుడే

నిపించని సూచిక బోర్డులు.. ప్రమాదకర మలుపులు.. చోదకుల మితిమీరిన వేగం.. వాహనదారుల నిర్లక్ష్యం.. రోడ్డుపై నిలుపుతున్న వాహనాలు.. కారణం ఏదైనా.. వాడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలు నిండు ప్రాణాలను హరిస్తున్నాయి. ఇటీవల ఈ జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. కనీసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడమే వాహన చోదకులకు శాపంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా జిల్లా సరిహద్దులోని అన్నంబొట్లవారిపాలెం నుంచి కారంచేడు శివారు వరకు ప్రధాన మార్గంలో తరచూ చోటుచేసుకున్న ప్రమాదాలతో ప్రాణాలు గాలిలో కలిసిపోగా పలువురు క్షతగాత్రులుగా మిగులుతున్నారు. ఇటీవల ఈ మార్గంలో ట్రావెల్స్‌ బస్సు టిప్పర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం కావడంతో రహదారిపై ప్రయాణించేందుకు జనం వణికిపోతున్నారు.


ముద్ర తీరంలో విహరించేందుకు చీరాల, బాపట్ల ప్రాంతంలో బీచ్‌లకు హైదరాబాద్‌ నుంచి వారాంతంలో వందల సంఖ్యలో పర్యాటకులు ఈ రహదారి మీదుగా రవాణా సాగిస్తారు. రద్దీని తలపించే మార్గంలో నెలకొంటున్న ప్రమాదాలు చోదకులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు విస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సూచిక బోర్డులు, రోడ్డు వెంట బారికేడ్లు, ఇనుప రైలింగ్, రాత్రిళ్లు కనిపించేలా రేడియం స్టిక్కరింగ్‌ వంటి జాగ్రత్తలు చేపట్టకపోవడం ప్రమాదాలకు కారణమవుతుంది. వివిధ ప్రాంతాల్లో బీటీ రోడ్డు కుంగిపోవడంతో వాటిని తప్పించే క్రమంలో రాత్రివేళ వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. పర్చూరు-కారంచేడు మార్గంలో ఇరువైపులా పర్చూరు వాగు, కాలువ ఉన్నాయి. వీటిల్లో కాలువ వైపు విస్తరణ సాగుతోంది. ఈక్రమంలో రోడ్డు విస్తరణ జరిగే కాలువ వైపు ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులతో పాటు సిమెంటు దిమ్మెలను ఏర్పాటు చేయాలి. కాని చేయకపోవడంతో గుత్తేదారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయిలా..

  • పర్చూరు- పసుమర్రు మార్గంలో బస్సు - టిప్పర్‌ ఢీకొని కాలిపోయిన ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. రోడ్డు విస్తరణలో భాగంగా నిర్మాణం కోసం వినియోగిస్తున్న మట్టి పాత మార్గంలోని బీటీ రోడ్డుపైకి వచ్చి చేరడంతో ఆ ప్రాంతంలో రోడ్డు ఇరుకైందని రాత్రివేళ ఎదురు వాహనాల వెలుతురులో కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. 
  • చీరాల పోలేరమ్మ గుడికి వెళ్తున్న మురికిపూడికి చెందిన రెండు కుటుంబాల వారు పర్చూరు-కారంచేడు బీటీ రోడ్డుపై కుంగిన ప్రాంతంలో ఆటో అదుపుతప్పడంతో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. పర్చూరు మండలానికి చెందిన ఓ పార్టీ నాయకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.
  • పర్చూరు-కారంచేడు మార్గంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈనెల 15న చిలకలూరిపేటకు చెందిన మాబు సుభాని కారులో చీరాల బీచ్‌కి కుటుంబ సభ్యులతో వెళ్తూ అదుపుతప్పి  కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చోదకుడు సుభాని మృతి చెందగా, మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు.
  • ఈ నెల 13న జరిగిన ప్రమాదంలో ద్విచక్రవాహన దారుడు తీవ్రంగా గాయపడ్డారు. అదేరోజు కారంచేడు సమీపంలోని ప్రార్థనామందిరం వద్ద దంపతులు బైక్‌పై నుంచి పడి క్షతగాత్రులయ్యారు. 
  • కొద్దిరోజుల క్రితం చీరాలకు చెందిన విశ్రాంత ఉద్యోగి స్వయానా కారంచేడు పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డారు. ఇందుకు అతివేగంగా వస్తున్న బొలోరో బైక్‌ని ఢీకొట్టడమే కారణమని వెల్లడించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని