logo

బాధితులు తెదేపా వారని.. ఇంత పక్షపాతమా?

జిల్లాలోనూ సార్వత్రిక పోలింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రాల్లోనే తెదేపా ఏజెంట్లను చితకబాదిన ఉదంతాలు ఆలస్యంగా వెలుగుజూస్తున్నాయి. పోలింగ్‌ కేంద్రంలో ఏ కొద్దిపాటి గొడవ జరిగినా అక్కడ ఉండే పీవో తన డైరీలో నమోదు చేయాలి.

Updated : 21 May 2024 05:54 IST

పోలింగ్‌ రోజు పీవో డైరీకి ఎక్కని కొన్ని ఘటనలు
కేసులు నమోదు చేయని పోలీసుల తీరుపై విమర్శలు
జిల్లాలోనూ అరాచకం సృష్టించిన వైకాపా ఏజెంట్లు, నాయకులు
ఈనాడు, బాపట్ల

జిల్లాలోనూ సార్వత్రిక పోలింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రాల్లోనే తెదేపా ఏజెంట్లను చితకబాదిన ఉదంతాలు ఆలస్యంగా వెలుగుజూస్తున్నాయి. పోలింగ్‌ కేంద్రంలో ఏ కొద్దిపాటి గొడవ జరిగినా అక్కడ ఉండే పీవో తన డైరీలో నమోదు చేయాలి. ఆ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి నివేదించాలి. కానీ కనీసం కొన్ని గొడవలు పీవో డైరీల్లోకి ఎక్కలేదు. అటు పీవోలు ఇటు పోలీసులు ఈ గొడవలను కప్పిపుచ్చేశారు. ఆయా ఘర్షణల్లో బాధితులు తెదేపాకు చెందినవారు కావడంతో పోలీసులు వాటిని తీవ్రంగా పరిగణించలేదు. కారంచేడు మండలంలో రెండు గ్రామాల్లో చాలా భయానకంగా పోలింగ్‌ వేళ గొడవలు జరిగాయి. ఆయా గొడవల్లో కుర్చీలు గాల్లోకి ఎగిరాయి. ఏజెంట్లను నిర్బంధించారు. సురక్షితంగా బయటకు తీసుకెళ్లాలని పోలీసులను వేడుకున్నా స్పందించకపోవడంతో చివరకు తెదేపా నాయకులే రక్షణగా ఉండి వారిని ఇళ్లకు చేర్చాల్సిన పరిస్థితి జిల్లాలో పలుచోట్ల చోటుచేసుకుంది. దీన్నిబట్టి పోలీసులు ఎంత ఉదాసీనంగా వ్యవహరించారో అర్థమవుతోంది. ఎన్నికల వేళ పోలీసులు అడుగడుగునా వైకాపా నేతలకు దన్నుగా నిలవడంతో పోలింగ్‌ రోజున పలు కేంద్రంల్లో వైకాపా వాళ్లు ఇష్టానుసారం వ్యవహరించినా మిన్నకుండిపోవాల్సి వచ్చిందని తెదేపా వర్గాలు అంటున్నాయి. పక్షపాత ధోరణితో వ్యవహరించి తెదేపా నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసకున్నారు. చీరాలలో అయితే సాక్షాత్తు తెదేపా అభ్యర్థి, ఆయన తనయుడి వాహనాలపై గవినివారిపాలెంలో రౌడీషీటరైన వైకాపా గ్రామ నాయకుడు దాడి చేసి ధ్వంసం చేస్తే ఇప్పటి వరకు అతన్ని అరెస్టు చేయలేదు. పోలింగ్‌ రోజున హింసాత్మక ఘటనలకు పాల్పడేవారిపై ఈసీ మార్గదర్శకాలను అనుసరించి కఠినమైన సెక్షన్లు బనాయించి వారికి బెయిల్‌ రాకుండా చేసే అవకాశం ఉన్నా బాపట్ల జిల్లా పోలీసులు మాత్రం ఆ పని చేయలేదు. అధికార నేతల అడుగుకు మడుగులొత్తుతూ కేసులను నీరుగార్చేశారనే విమర్శలను మూటగట్టుకున్నారు.


ర్రంవారిపాలెంలో తెదేపా తరఫున ఇద్దరు ఏజెంట్లు కూర్చొన్నారు. ఇంతకు ముందు ఆ ఊళ్లో పార్టీకి ఏజెంట్లు ఉండేవారు కాదు. అలాంటిది ఈసారి ఏజెంట్లుగా కూర్చొన్నారనే అక్కసుతో వారు భోజనానికి బయటకు రాగా పోలింగ్‌ రోజున వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఆ తర్వాత కూడా ఏజెంట్‌గా కూర్చొన్నారు. మీకు ఎంత ధైర్యం. కొట్టినా మళ్లీ వచ్చావా.. అంటూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో సదరు ఏజంట్‌ బెంబేలెత్తి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల రక్షణతో తనను బయటకు తీసుకెళ్లాలని వేడుకున్నా పట్టించుకోలేదు. చివరకు తెదేపా నాయకులకు చెప్పడంతో వారు మార్టూరు నుంచి కారులో రాగా కారు టైర్లలో నుంచి గాలితీసి వైకాపా వాళ్లు బీభత్సం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదు.
స్వర్ణలో ఒకే కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ముల మధ్య అనాదిగా పాత గొడవలు ఉన్నాయి. వారిలో ఒకరు వైకాపాను వీడి తెదేపాలో చేరగా ఎన్నికల ముందు పార్టీని వీడతావా అంటూ ఉదయగిరి శ్రీనివాస్‌పై నాగరాజు, వెంకట్రావు తదితరులు దాడికి పాల్పడ్డారు. తొలుత శ్రీనివాస్‌ను ట్రాక్టర్‌తో గుద్దించి హత్యాయత్నం చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. కానీ ఆయన ఆ బెదిరింపులకు తలొగ్గలేదు. దీంతో శ్రీనివాస్‌పై మరో సోదరుడు ఉదయగిరి నాగరాజు, వెంకట్రావు, అమ్మిశెట్టి నవీన్‌ దాడి చేసి కర్రలతో తల పగలగొట్టారని కారంచేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం చీరాల ప్రాంతీయ వైద్యశాలలో చేరగా తమపైనే దాడికి పాల్పడినట్లు నాగరాజు, వెంకట్రావు కూడా ఆసుపత్రిలో చేరారు. ఆపై కౌంటర్‌ ఫిర్యాదు ఇచ్చారు. ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి రానివి ఇంకెన్ని ఉన్నాయో, అవి ఎప్పుడు ఏ రూపేణా బయటకు వస్తాయో వేచి చూడాలి. 


కారంచేడు మండలం రంగప్పనాయుడివారిపాలెంలో ఈనెల 13న పోలింగ్‌ జరిగే సమయంలో పోలింగ్‌ కేంద్రంలో తెదేపా ఏజెంటు సాయిపై వైకాపా ఏజెంట్లు, ఇతర పార్టీ నాయకులు దాడికి తెగబడ్డారు. కేవలం కళ్లు కనిపించనివారు, వృద్ధులకు మాత్రమే ఎవరైనా సహాయకులుగా వచ్చి వారు చెప్పిన గుర్తుకు ఓటేయాలని ఈసీ ఆదేశాలు ఉన్నాయి. అయితే ఆ కేంద్రంలో వైకాపా కార్యకర్త ఒకరు తన భార్య పార్టీకి ఓటేయదన్న అనుమానంతో ఆమె వెంట కేంద్రంలోకి రాగా తెదేపా ఏజెంట్‌ సాయి అభ్యంతరం తెలిపారు. ఆమె వెంట ఎలా వస్తారని ప్రశ్నించారు. దీంతో తమకే అభ్యంతరం చెబుతావా.. అంటూ ఆయనపై ఒక్కసారిగా వైకాపా ఏజెంట్లు, ఆ పార్టీకి చెందిన పలువురు క్యూ లైన్లలో నుంచి వచ్చి చితకబాదారు. చెప్పులతోనే సరిపుచ్చలేదు. కొట్టారు. ఆ తర్వాత పోలింగ్‌ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన కుర్చీలను సైతం తీసుకెళ్లి కుర్చీలతో దాడి చేయటంతో సాయికి గాయాలయ్యాయి. కానీ ఆ విషయం పీవో డైరీలో నమోదు చేసినట్లు లేదు. అయితే ఈ ఘటన మాత్రం పోలింగ్‌ రోజునే కాదు ఆ మరుసటి రోజు వెలుగులోకి రాలేదు. అక్కడ కేంద్రాల్లో ఉండే పోలీసులు, పోలింగ్‌ ప్రిసైడింగ్‌ అధికారి ఈ విషయాన్ని ఎలా దాచిపెట్టారో ఊహించుకోవచ్చు. తెదేపా ఏజెంట్‌ సాయిపై దాడి జరిగిన విషయాన్ని తెదేపా నాయకులు ఆలస్యంగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. అయినా కేసులు నమోదు కాలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని