logo

తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుల దాడి

పార్టీ మారాడనే కోపంతో తెదేపా కార్యకర్తపై క్రికెట్‌ బ్యాట్‌తో వైకాపా వర్గీయులు దాడి చేశారు. శావల్యాపురం మండలం కిష్ణాపురంలో సోమవారం రాత్రి ఇది జరిగింది.

Published : 21 May 2024 04:16 IST

కిష్ణాపురం (శావల్యాపురం), న్యూస్‌టుడే : పార్టీ మారాడనే కోపంతో తెదేపా కార్యకర్తపై క్రికెట్‌ బ్యాట్‌తో వైకాపా వర్గీయులు దాడి చేశారు. శావల్యాపురం మండలం కిష్ణాపురంలో సోమవారం రాత్రి ఇది జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మండల రామకృష్ణ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపాడు. గతంలో అతను వైకాపాకు అనుకూలంగా ఉన్నాడు. ఇది వైకాపా వర్గీయులకు సహించలేదు. దీంతో సోమవారం రాత్రి ప్రధాన రహదారి వద్ద నుంచి రామకృష్ణ ఇంటికి వెళ్తుండగా వైకాపాకు చెందిన హుస్సేన్, బికారి, గంధం పెద అయ్యన్న, గంధం వినయ్, నాసరమ్మ, హజరత్, నాగూర్‌ మరి కొందరు రామకృష్ణపై క్రికెట్‌ బ్యాట్‌తో బలంగా కొట్టారు. దీంతో అతను రోడ్డుమీద పడిపోయాడు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడకు చేరుకున్నారు. అయినా వైకాపా వర్గీయులు తగ్గలేదు. దీంతో రామకృష్ణ బంధువులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి విషయం తెలిపారు. అప్పటి వరకు కూడా అతను రక్తమడుగులో సంఘటన స్థలంలో పడి ఉన్నాడు. పోలీస్‌ సిబ్బంది గ్రామానికి చేరుకుని ఇరువర్గాల వారిని వారించి, బాధితున్ని చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుప్రతికి తరలించారు. స్థానిక ఎస్సై చల్లా సురేష్‌ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్థులను ఇళ్లకు పంపించారు. 


అధిక మొత్తంలో బాణసంచా విక్రయాలపై నిషేధం

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే : జూన్‌ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం గెలుపొందిన అభ్యర్థులతో ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేనందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అధిక మొత్తంలో బాణసంచా విక్రయాలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఎం.వేణుగోపాల్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హోల్‌సేల్‌ డీలర్లను ఆదేశించామన్నారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని