logo

న్యాక్‌ గ్రేడ్‌కు నిరీక్షణ!

వర్సిటీలో బోధన, పరిశోధన ఎలా జరుగుతుందో పరిశీలించి ఐదేళ్లకు ఒకసారి న్యాక్‌ సంస్థ విశ్వవిద్యాలయాలకు గ్రేడ్‌ కేటాయిస్తుంది.

Published : 21 May 2024 04:24 IST

పరిశీలన పూర్తయి 20 రోజులైనా గోప్యమే 
నాగార్జున వర్సిటీ అధ్యాపకుల్లో ఉత్కంఠ
ఈనాడు, అమరావతి

ర్సిటీలో బోధన, పరిశోధన ఎలా జరుగుతుందో పరిశీలించి ఐదేళ్లకు ఒకసారి న్యాక్‌ సంస్థ విశ్వవిద్యాలయాలకు గ్రేడ్‌ కేటాయిస్తుంది. ఆ గ్రేడ్‌ ఆధారంగానే యూజీసీ, డిపార్టుమెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డిపార్టుమెంట్‌ ఆఫ్‌ బయోటెకాల్నజీ, ఐకార్‌ వంటి అత్యున్నత సంస్థలు వర్సిటీలకు ప్రాజెక్టులు మంజూరు చేస్తాయి. వాటి నిర్వహణకు రూ.కోట్లలో నిధులు కేటాయిస్తాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని చివరిగా 2016లో న్యాక్‌ బృందం సందర్శించి న్యాక్‌-ఎ గ్రేడ్‌ కేటాయించింది. దాని కాల పరిమితి 2021తో ముగిసింది. అప్పటి నుంచి పాత గ్రేడ్‌తోనే కొనసాగుతోంది. 

గతంలో వారంలో తెలిసిపోయేది..

వరుసగా రెండేళ్లు పాటు కరోనా ఉద్ధృతి కొనసాగడం, ఆపై రెగ్యులర్‌ వీసీ లేరని తిరిగి గ్రేడ్‌ కోసం మూడేళ్ల పాటు దరఖాస్తు చేసుకోలేదు. రెగ్యులర్‌ వీసీగా ఆచార్య రాజశేఖర్‌ నియామకమైన తర్వాత తిరిగి న్యాక్‌ గ్రేడ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా గత నెల 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు న్యాక్‌ బృందం వర్సిటీలో పర్యటించి ఇక్కడ జరుగుతున్న బోధన, పరిశోధనల గురించి వర్సిటీ పంపిన సెల్ఫ్‌ స్టడీ రిపోర్టు (ఎస్‌ఎస్‌ఆర్‌)ను ఆధారంగా చేసుకుని భౌతికంగా పరిశీలించింది. ఆయా విభాగాల్లో అతిథి, ఒప్పంద అధ్యాపకులే ఎక్కువగా ఉన్నారని వారి పరిశీలనలో తేలింది. విద్యా ప్రమాణాలు తీసికట్టుగా ఉన్నాయని ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. న్యాక్‌ బృందం తన పర్యటన ముగించుకుని వెళ్లేటప్పుడు వర్సిటీ అధికారులతో నిర్వహించిన ఎగ్జిట్‌ మీటింగ్‌లో మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. వర్సిటీ పంపిన ఎస్‌ఎస్‌ఆర్‌ రిపోర్టుకు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందని లోపాలను ప్రస్తావించినట్లు అధ్యాపకవర్గాల సమాచారం. పర్యటన ముగిసి 20 రోజులు గడిచిపోయినా ఇప్పటి వరకు గ్రేడ్‌ ప్రకటించకుండా గోప్యత పాటించడం ప్రశ్నార్థకమవుతోంది. గతంలో పరిశీలన పూర్తయిన తర్వాత వారం రోజుల్లోపు వర్సిటీకి ఏ గ్రేడ్‌ కేటాయించారో సీల్డు కవర్‌లో రాసి వర్సిటీకి పంపేవారు. దాన్ని వర్సిటీ వీసీ అధ్యాపకులకు తెలియజేసేవారు. ఆపై న్యాక్‌ వెబ్‌సైట్‌లోనూ ప్రదర్శించేవారు. ఈసారి ఆ రెండూ చేయలేదు. దీంతో వర్సిటీ, అధ్యాపక వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ గోప్యత వెనుక మర్మమేమిటో అంతుపట్టడం లేదని అధ్యాపకవర్గాలు అంటున్నాయి.


బోధన, పరిశోధనలకు ప్రాధాన్యమేదీ 

ఏ విశ్వవిద్యాలయానికైనా బోధన, పరిశోధనలే ముఖ్యం. ఆ రెండే వర్సిటీకి కళ్లు, చెవులు లాంటివి. వర్సిటీ పరంగా పరిశోధనలు లేవు. ఆపై కొత్తగా వచ్చిన ఫండింగ్‌ ప్రాజెక్టులు లేవని, అందుకే గ్రేడ్‌ కేటాయింపుపై తర్జనభర్జనలు సాగుతున్నాయని తెలుస్తోంది. వర్సిటీలో బోధన, పరిశోధనలకు అంతగా ప్రాధాన్యమివ్వకుండా భవనాలు, రహదారులు నిర్మించడానికి బాగా ప్రాధాన్యమిచ్చారనే విమర్శలు ఉన్నాయి. పేటెంట్‌ హక్కులు సాధించిన ప్రాజెక్టులు అంతంతమాత్రమేనని గుర్తించారు. ఆచార్య రాజేష్‌ సింగ్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందం వర్సిటీలో మూడు రోజులు పర్యటించి బోధన, పరిశోధనలపై లోతైన పరిశీలన జరపగా అనేక లోపాలు వెల్లడయ్యాయి. ఇంతకుముందు న్యాక్‌-ఎ గ్రేడ్‌లో ఉండగా తాజాగా న్యాక్‌ ఏ ప్లస్‌ కూడా కాకుండా ఏకంగా న్యాక్‌ డబుల్‌ ఎ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధ్యాపకవర్గాలు అంటున్నాయి. కానీ ఆ స్థాయిలో గ్రేడ్‌ కేటాయించడానికి వర్సిటీలో అంతగా అభివృద్ధి కార్యక్రమాల్లేవని, ఆ గ్రేడ్‌ దక్కకపోవచ్చని అంటున్నారు. ఒకవేళ గ్రేడ్‌ తగ్గే పరిస్థితి ఉంటే వర్సిటీ తిరిగి మరోసారి పరిశీలనకు రావాలని న్యాక్‌ బృందాన్ని కోరే అవకాశం ఉంది. ఆ ప్రతిపాదన ఇప్పటివరకు వర్సిటీ నుంచి వెళ్లలేదని తెలిసింది. 


వీటి ఆధారంగా..

ర్సిటీలో ఎంతమంది రెగ్యులర్‌ అధ్యాపకులు పనిచేస్తున్నారు వారి పరిశోధనల ద్వారా సమాజానికి కలిగే ప్రయోజనం, విద్యార్థుల సంఖ్య, ఎన్ని విభాగాలు ఉన్నాయి, పకడ్బందీ పరీక్షల నిర్వహణకు అనుసరిస్తున్న విధానం, ప్రాంగణ నియామకాలు, బోధనలో అనుసరిస్తున్న వినూత్న విధానాలు, బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ వంటివి పరిగణనలోకి తీసుకుని న్యాక్‌ బృందం గ్రేడ్‌ కేటాయిస్తుంది. అదేవిధంగా అధ్యాపకులు రాసినవి జాతీయ, అంతర్జాతీయ జర్నళ్లలో ఏమైనా ప్రచురితమయ్యాయా అనేవి కూడా చూస్తారు.


సరిగ్గా వివరించలేకపోయారా..!

ఆరుగురు సభ్యుల న్యాక్‌ బృందంలో ఐదుగురికి సైన్స్‌ నేపథ్యం ఉండగా ఒకరు సోషల్‌ సైన్స్‌ విభాగం నుంచి వచ్చారు. వారికి వర్సిటీలో జరుగుతున్న బోధన, పరిశోధనల గురించి చెప్పడానికి వీసీ, రిజిస్ట్రార్, రెక్టార్‌ ఉన్నా ఆ ముగ్గురు లాంగ్వేజెస్‌ విభాగాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కీలకమైన పరిపాలనా పదవుల్లో ఉన్నవారంతా ఒకే విభాగానికి చెందిన వారు కావడంతో న్యాక్‌ బృందం దాన్ని తప్పుబట్టినట్లు సమాచారం. న్యాక్‌ సన్నద్ధత, పర్యటనల కోసం వర్సిటీ రూ.కోట్లలో వెచ్చించింది. ప్రతి విభాగానికి మంచి రంగులు వేయించి సర్వాంగ సుందరంగా తయారు చేసింది. ఇన్ని నిధులు ధారపోసినా ఇప్పటికీ వర్సిటీకి న్యాక్‌ కేటాయించిన గ్రేడ్‌ ఏమిటనేది తెలియకుండా ఉంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని