logo

కాలువ ఈ తీరు.. పారేది కన్నీరు

మిగ్‌జాం తుపానుతో గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా పంట కాల్వల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో లక్షల ఎకరాల్లో చేతికి అంది వచ్చిన పంట నీటిపాలైంది.

Updated : 21 May 2024 04:43 IST

ఖరీఫ్‌ సమీపిస్తున్నా మరమ్మతులు లేవు
భారీ వర్షాలు పడేలోపు పనులు చేస్తే మేలు
ఆందోళనలో ఆయకట్టు రైతులు
న్యూస్‌టుడే, మంగళగిరి, తెనాలి టౌన్, మేడికొండూరు, పొన్నూరు, దుగ్గిరాల

మిగ్‌జాం తుపానుతో గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా పంట కాల్వల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో లక్షల ఎకరాల్లో చేతికి అంది వచ్చిన పంట నీటిపాలైంది. మూడు రోజుల పాటు వర్షంలోనే పైరు నీట మునగడంతో నష్ట తీవ్రత పెరిగింది. ఐదేళ్లుగా కాలువలకు మరమ్మతులు చేయకపోవడంతో సమస్య ఎదురైంది. ఈసారి అయినా మోక్షం లభిస్తుందని అనుకుంటే, ప్రస్తుత మే నెలలో పనులు మొదలయ్యేటట్లు కనిపించడం లేదు. భారీ వర్షాలు కురవక ముందే పనులు మొదలుపెట్టేలా అధికారులు చూడాలని రైతులు కోరుతున్నారు.

జిల్లాలో సాగు, మురుగు నీటి కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో పాటు కట్టలు కోతకు గురై బలహీనమయ్యాయి. గుర్రపుడెక్క, తూటుకాడతో నిండిపోయింది. మరమ్మతులు చేపట్టడానికి జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి రెండున్నర నెలల కిందట ప్రభుత్వానికి పంపించారు. గత ఐదేళ్లుగా కాలువల్లో మరమ్మతులు సరిగా చేపట్టడం లేదు. సకాలంలో పనులు చేయడం లేదు. వేసవిలో కాకుండా వర్షాలు కురిసే జూన్, జులైలో తూతూమంత్రంగా చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. చివరి ఆయకట్టుకు నీరందక పంటలు పండిపోతున్నాయి. భారీ వర్షాలు కురిసిన సమయంలో పొలాల నుంచి నీరు త్వరగా బయటకు వెళ్లకుండా వారం, పది రోజులు నిలిచి ఉండడంతో పంటలు ముంపు బారినపడి దెబ్బతిని అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నికల హడావుడి తగ్గడంతో ఇక కీలకమైన సాగునీటి కాలువలపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చి జూన్‌ మొదటి వారంలోనే తొలకరి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మే నాలుగో వారం వచ్చినా కాలువల్లో ఇంకా పనులు ప్రారంభించలేదు. తక్షణమే అనుమతులు, నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 

ఆధునికీకరణకు నోచుకోని గుంటూరు ఛానల్‌

సీజన్‌ సమీపిస్తున్నా గుంటూరు ఛానల్‌ మరమ్మతుల సంగతే మరిచారు. మరో రెండు నెలల్లో సాగునీటిని విడుదల చేయాల్సి ఉంది. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవు. దీంతో అన్నదాతల్లో ఆందోళనకు మెదలైంది. ఇంత వరకు ఛానల్‌కు చేపట్టాల్సిన మరమ్మతుల సంగతే మరిచారు. వర్షాలు ప్రారంభమైతే పనులు చేపట్టే అవకాశం ఉండదు. ముందుగానే మేల్కొంటే ఛానల్‌ కింద సాగు చేసే రైతుల కష్టాలు గట్టెక్కుతాయి. తాడేపల్లి పరిధిలోని పోలకంపాడు నుంచి వట్టిచెరుకూరు మండలం గారపాడు వరకు 47 కి.మీ మేర కాలువ విస్తరించి ఉంది. సుమారు 65వేల మంది రైతులు దీనిపై ఆధారపడి 38వేల ఎకరాలు సాగు చేస్తున్నారు. ఈ కాలువ సుమారు లక్ష మందికి తాగునీటిని అందిస్తుంది. మూడేళ్లకు ఒకసారి పూడిక తీయాల్సి ఉంది. కానీ ఐదేళ్లుగా ఆ ఊసేలేదు.గుంటూరు ఛానల్‌ హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్వహణ లోపం కారణంగా పూర్తిగా శిథిలావస్థకు చేరింది.


చూద్దాంలే... చేద్దాంలే...

సాగు నీటి కాలువలపై ఆధారపడి పొన్నూరులో 13,500, చేబ్రోలులో 5,600, పెదకాకానిలో 4,576 హెక్టార్లలో వరి పంటను  రైతులు సాగు చేస్తారు. గతేడాది సాగు నీటి కాలువల మరమ్మతుల కోసం సాగు నీటి శాఖాధికారులు పైసా నిధులు కేటాయించలేదు. కాలువలో గుర్రపుడెక్క తొలగించలేదు. కొన్ని కాలువల్లో మట్టి దిబ్బెలు పేరుకుపోయాయి. కాలువలో సాగు నీరు పారుదల లేక నీటి కోసం అన్నదాతలు అనేక ఇబ్బందులు పడ్డారు. పంటను కాపాడుకోవడం కోసం ఆయిల్‌ ఇంజిన్లపై ఆధారపడి ఎకరాకు రూ.5వేలకు పైగా ఖర్చు చేశారు. ఈ ఏడాది ఖరీప్‌ సీజన్‌ త్వరలో ప్రారంభం కానున్నా కాలువల మరమ్మతులు చేపట్టలేదు. 

పొన్నూరు మండల పరిధిలోని ఆరెమండ, అలవల సాగు నీటి కాలువల వద్ద రెండు ప్రాంతాల్లో లాకులు నిర్మించారు. ఆ లాకుల గోడలు పగుళ్లిచ్చి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. అలవల లాకులపై పెద్ద రంధ్రం ఏర్పడింది. 


కాల్వలు మూసుకుపోయి.. షట్టర్లు ఊడిపోయి..

శ్చిమ డెల్టాలో సుదీర్ఘమైన కొమ్మమూరు కాల్వకు మొదట్లోనే దుగ్గిరాల వద్ద కట్ట కోతకు గురైంది. దీని వల్ల ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోననే భయం ప్రజల్లో ఏర్పడింది.

  • తూర్పు, పశ్చిమ కాల్వల ప్రధాన స్లూయిస్‌ గోడలు పగిలిపోయాయి.
  • ఎప్పుడూ నీరు అందక అల్లాడిపోయే పెదవడ్లపూడి ఉన్నతవాహినిలో కంఠంరాజుకొండూరు, చిలువూరు వద్ద కాల్వ వెడల్పు తగ్గిపోయి, క్రమంగా మూసుకుపోతోంది.
  • మోరంపూడి ప్రధాన బ్రాంచి కాల్వతో పాటు దానికి అనుబంధంగా ఉన్న మూడు బ్రాంచి కాల్వలు గోడలు విరిగిపోయాయి.
  • ఈమని బ్రాంచి కాల్వ నుంచి కొల్లిపర మండలం అత్తోట, శివలూరు, దంతలూరు, కుంచవరం తదితర గ్రామాలకు వెళ్లే రెండు బ్రాంచి కాల్వలు ఉన్నాయి. అవి ఈమని వద్ద విడిపోతాయి. ఈ రెండు బ్రాంచి కాల్వలకు మూడేళ్ల కిందట రెండు షట్టర్లూ పూర్తిగా ఊడిపోయాయి. అత్తోట కాల్వ ద్వారా 2200 ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతుంది. దంతలూరు కాల్వ ద్వారా దాదాపు 1500 ఎకరాలు సాగవుతుంది. షట్టర్లు లేని కారణంగా వీటిలో నీటి నియంత్రణ కుదరడం లేదు.
  • చింతలపూడి వద్ద పంట కాల్వల్లో పిచ్చిమొక్కలు పెరిగిపోయి నీరు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.

ఏటా తూతూమంత్రమే..

తెనాలి నీటి పారుదల విభాగం పరిధిలో కృష్ణా పశ్చిమ డెల్టా కింద మొత్తం 5.71లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి.తూర్పు, నిజాంపట్నం, పడమర, కొమ్మమూరు, కేడబ్ల్యూడీ బ్యాంక్‌ కెనాల్‌ ప్రధానమైనవి. ఇవికాక 40కి పైగా ఉపకాలువలు ఉన్నాయి.ఏటా తూతూమంత్రంగా చేసి వదిలేస్తారు. 


కట్టలు బలహీనం.. సాగు నీరు ప్రశ్నార్థకం

మేడికొండూరు మండలంలోని బండారుపల్లి, నరకుళ్లపాడు, పాలడుగు మేజర్‌ కాలువలను గత ఐదేళ్లుగా బాగు చేయకపోవడంతో పాడైపోయాయి. ముఖ్యంగా నరకుళ్లపాడు, పాలడుగు మేజర్‌ కాలువల్లో పూడిక తీత పనులు చేయకపోవడంతో పిచ్చిచెట్లు ఏపుగా పెరిగాయి. తూటుకాడ, జమ్మి పెరిగింది. దీనికి తోడు అక్కడక్కడా రక్షణ గోడలు పడిపోతున్నాయి. పలుచోట్ల కట్ట కోతకు గురైంది. ఈ కారణంతో ఏటా సాగు నీరందక ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాది కూడా కాలువలు బాగు చేయలేదు. చివరి ఆయకట్టు పొలాలకు నీరందే పరిస్థితి కనిపించడం లేదు. ఒక్కోసారి అధిక వర్షాలు కురిసినప్పుడు నీళ్లు ముందుకు పోవడం లేదు. కాలువలు పొంగి వరద పంట పొలాలను ముంచెత్తుతోంది. దీంతో రైతులు నష్టపోతున్నారు. 


సత్వరం బాగు చేయాలి

-ఈదర పూర్ణచంద్, రైతు సంఘ నాయకుడు, తెనాలి

పంట కాలువలు, మురుగు కాలువల విషయంలో గత నాలుగేళ్లుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ప్రస్తుతం అటు ప్రధాన కాలువలు, ఇటు ఉప కాలువలు, మురుగు కాలువలు తూటుకాడ, చెత్తతో నిండి ఉన్నాయి. సత్వరం పూడిక తొలగించాలి.లేకుంటే మొదట్లో ఉన్న పొలాలకు అధిక నీరు, చివరన ఉన్న వాటికి అసలు నీరు రాదు. ఈ రెండూ నష్టమే. సాగు మొదటి దశలో ఆకస్మిక వానలు కురిస్తే నీటిని బయటకు పంపడం కష్టమవుతుంది. అప్పుడు మొత్తం సాగుకు నష్టం జరుగుతుంది. సత్వరం నీటి పారుదల, డ్రైనేజీ విభాగాల అధికారులు మరమ్మతులు చేపట్టాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని