logo

పిన్నెల్లి అంటే.. వల్లమాలిన ప్రేమ

పోలింగ్‌ రోజున పల్నాడు జిల్లా పాల్వాయి గేటు గ్రామంలో ఈవీఎం ధ్వంసం చేస్తూ అడ్డంగా దొరికిపోయినా.. అక్కడి నుంచి బయటకొస్తూ మహిళల్ని దూషించినా.. అనుచరులతో కలిసి కర్రలు, రాడ్లతో విరుచుకుపడినా.. అడ్డుకోబోయిన తెదేపా ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావును తీవ్రంగా గాయపరిచినా..

Published : 23 May 2024 03:36 IST

ఈవీఎం ధ్వంసం చేసినా, మహిళల్ని దూషించినా మౌనమే
అంటకాగిన యంత్రాంగమే అరాచకానికి కొమ్ము కాసింది
బిందుమాధవ్‌ ఎస్పీగా ఉంటే అరెస్టు చేస్తారనే భయం
అందుకే ఇంటి నుంచి పరారీ.. తర్వాత బిందుమాధవ్‌ సస్పెన్షన్‌
ఆ తర్వాత తానెక్కడికీ పారిపోలేదంటూ బయటకొచ్చిన పిన్నెల్లి
ఈసీ జోక్యంతో సిట్‌ ఏర్పాటు.. అనంతరమే వెలుగులోకొచ్చిన అరాచకం
తప్పనిసరి పరిస్థితుల్లో కేసు.. అప్పటికీ అరెస్టు ఆలోచన లేని అధికారగణం
తక్షణమే అరెస్టు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌

కిందపడిన వీవీప్యాట్‌ను పైకి తీసి మళ్లీ నేలకేసి కొడుతున్న పిన్నెల్లి

ఈనాడు-అమరావతి: పోలింగ్‌ రోజున పల్నాడు జిల్లా పాల్వాయి గేటు గ్రామంలో ఈవీఎం ధ్వంసం చేస్తూ అడ్డంగా దొరికిపోయినా.. అక్కడి నుంచి బయటకొస్తూ మహిళల్ని దూషించినా.. అనుచరులతో కలిసి కర్రలు, రాడ్లతో విరుచుకుపడినా.. అడ్డుకోబోయిన తెదేపా ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావును తీవ్రంగా గాయపరిచినా.. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరులంటే పల్నాడు జిల్లా పోలీసులు, ఎన్నికల అధికారులకు, రాష్ట్రస్థాయిలోని కొందరికి వల్లమాలిన ప్రేమే. సాధ్యమైనంత వరకు ఆయన పేరు బయటకు రాకుండా ఎవరికి వారు తమ శక్తిమేరకు కృషి చేశారు. సిట్‌ ఏర్పాటు చేశాక.. తప్పనిసరి పరిస్థితుల్లో.. అదీ 13న ఘటన జరిగితే.. 20వ తేదీన కేసులో ఆయన పేరు చేర్చారు. వైకాపాతో అంటకాగుతున్న అధికారగణానికి.. అప్పటికీ ఆయన్ను అరెస్టు చేయాలనే ఆలోచనే లేదు. అందుకే మంగళవారం సాక్షి మీడియాలో పిన్నెల్లి రెచ్చిపోయారు. ఈవీఎం ధ్వంసం చేస్తున్న వీడియో అదేరోజు వెలుగులోకి రావడంతో బుధవారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం కల్పించుకుని.. అందులో ఉన్నది ఎమ్మెల్యే అయితే ఆయన్ను తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించే వరకు రాష్ట్ర యంత్రాంగం ప్రేక్షకపాత్రకే పరిమితమైంది. పోలీసులు, ఎన్నికల అధికారులపై వైకాపా ప్రభావం ఏ స్థాయిలో పనిచేస్తుందో చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?

  • మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ నెల 13వ తేదీన రెంటచింతల మండలం పాల్వాయి గేట్‌ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం, వీవీపాట్‌ను ధ్వంసం చేసి.. అడ్డుకోబోయిన తెదేపా ఏజెంట్లను బెదిరించి, మహిళలను దుర్భాషలాడి, దాడులు చేశారు. అయినా ప్రిసైడింగ్‌ అధికారి ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
  • వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుస్తుంది. ఆర్వో శ్యాంప్రసాద్, జిల్లా ఎన్నికల అధికారి, పోలీసులు ఏం చేశారు? అంటే వీరందరికీ కూడా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాగించిన విధ్వంసకాండ తెలుసు.. అయినా ఎవరికి వారే ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది అధికార పార్టీతో అంటకాగడం కాదా?
  • ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన సమాచారమంతా ఎన్నికల సంఘం వద్ద ఉందని సీఈఓ మీనా బుధవారం సెలవిచ్చారు. ఈవీఎం ధ్వంసం చేసిందెవరు అనేది ఎందుకు పరిశీలించలేదు?  
  • ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించి ఈవీఎం ధ్వంసం చేశారని పత్రికలన్నింట్లోనూ వచ్చింది. తర్వాత ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోలేదు? చర్యలకు ఎందుకు ఆదేశించలేదు?
  • పోలింగ్‌ అనంతర హింసపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించే వరకు రాష్ట్ర అధికారులు పట్టించుకోలేదు. 16న సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తాను దిల్లీకి పిలిపించి వివరణ కోరింది. సంబంధిత అధికారులపై చర్యలతోపాటు సిట్‌ ఏర్పాటు చేసి కేసులన్నింటినీ సమీక్షించాలని ఆదేశించింది. ఆ తర్వాతే కేసుల్లో కదలిక మొదలైంది. అంతా తెలిసినా అప్పటి వరకు అధికార యంత్రాంగమంతా మౌనంగా ఉండటానికి కారణం ఎవరి ఒత్తిడి?
  • సిట్‌ ఏర్పాటు, రెంటచింతలకు కొత్త ఎస్సై వచ్చాక.. పాల్వాయి గేటు ఈవీఎం ధ్వంసం ఘటనపై 20న కోర్టులో మెమో దాఖలు చేశారు.  అందులో మొదటి నిందితునిగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చేర్చారు. అంటే 13 నుంచి 20వ తేదీల మధ్యలో పోలీసులు, ఎన్నికల అధికారులు ఏం చేశారు? ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యవహారాల్ని వెలుగులోకి రాకుండా చూడాలనుకున్నారా? డీజీపీ ఏం చేస్తున్నారు?  
  • ఎమ్మెల్యే పిన్నెల్లిని నిందితునిగా చేరుస్తూ 20న రెంటచింతల ఎస్సై కోర్టులో మెమో దాఖలు చేశారు.. అంటే 8 రోజులు ఆలస్యంగా కేసు పెట్టారు. అప్పటికీ అరెస్టుకు చర్యలు తీసుకోలేదు. అందుకే 21న పిన్నెల్లి సాక్షి మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ పోలీసులకు తెలియవా? తెలిసీ ఆయన్ను అరెస్టు చేయలేదా? ఎమ్మెల్యేను కాపాడుతోంది ఎవరు?
  • ఎన్నికల సంఘం మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్‌ రోజున ఏడు ఈవీఎం ధ్వంసం కేసులు నమోదయ్యాయని పేర్కొంటూ ప్రకటన ఇచ్చింది. అంటే వాటిలో ఇదొకటి అని తేలిక చేసి చూపే ప్రయత్నం చేసింది.
  • ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడైన వ్యక్తి, అందునా ఎమ్మెల్యే.. గతంలో ఎస్పీగా పనిచేసిన బిందుమాధవ్‌ లక్ష్యంగా విమర్శలు చేస్తుంటే జిల్లా అధికారుల నుంచి సీఎస్, డీజీపీ వరకు ఎందుకు మౌనంగా ఉంటున్నారు?
  • బిందుమాధవ్‌ను ఎస్పీగా కొనసాగిస్తే.. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అరెస్టు చేస్తారనే ఉద్దేశంతోనే ఆయనపై సస్పెన్షన్‌కు సిఫారసు చేసి, అక్కడి నుంచి తప్పించారనే ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎస్, డీజీపీకి లేదా? ఈ కుట్రకు బాధ్యులెవరు?
  • ఎమ్మెల్యే పరారవుతున్నా ఆయన ఇంటి వద్ద కాపలాగా ఉన్న పోలీసులు పట్టించుకోలేదు. వారిపై ఏం చర్యలు తీసుకున్నారు?
  • పోలింగ్‌ రోజున పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడమే కాకుండా.. ఆయనతోపాటు అనుచరులు కర్రలు, రాడ్లతో విరుచుకుపడి గ్రామస్థులపై దాడి చేశారు. నంబూరి శేషగిరిరావును తీవ్రంగా గాయపరిచారు. అడ్డొచ్చిన మహిళలను ఎమ్మెల్యే పిన్నెల్లి దుర్భాషలాడారు. అక్కడ పెద్ద వీరంగమే సృష్టించారు. ఆయనతోపాటు అనుచరులపై కేసులు పెట్టారా లేదా? ఒక ఎమ్మెల్యే మహిళల్ని నోటికొచ్చినట్లు దూషిస్తుంటే అధికార యంత్రాంగం పట్టించుకోదా?
  • పాల్వాయి గేటు ఘటనలో అడుగడుగునా అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ఎమ్మెల్యే దుశ్చర్యలను ఏ దశలోనూ అడ్డుకోలేదు. వీరిని నియంత్రించిన పెద్దలెవరు? వీటన్నింటికి సమాధానాలివ్వాల్సిన బాధ్యత సీఎస్‌ జవహర్‌రెడ్డితోపాటు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాపై ఉంది.   
  • ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేస్తున్న వీడియో మంగళవారం బయటకొచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అందులో ఉన్నది ఎమ్మెల్యే అవునా? కాదా? అయితే వెంటనే అరెస్టు చేయమని ఆదేశించింది. అప్పటి వరకు రాష్ట్ర యంత్రాంగం పట్టీపట్టనట్లు వ్యవహరించడంలో ఎవరి ఒత్తిళ్లున్నాయి?
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని