logo

నిరుడు మాండౌస్‌.. నేడు మిగ్‌జాం

ఉమ్మడి గుంటూరు జిల్లాలో డిసెంబరు నెలలో వస్తున్న తుపాన్లు కర్షకులకు కోలుకోలేని నష్టాలు మిగులుస్తున్నాయి. గతేడాది డిసెంబరు రెండోవారంలో వచ్చిన మాండౌస్‌ తుపాను వరి రైతులకు తీవ్ర నష్టం కలగజేసింది. ఇప్పుడు కూడా డిసెంబరు నెల తొలివారంలో మొదలైన మిగ్‌ జాం తుపాను రైతులకు తీవ్ర ఆందోళన కలగజేస్తోంది. డెల్టాలో చాప చుట్టేసిన వరి పొలాలు..

Published : 05 Dec 2023 02:28 IST

ఈనాడు, అమరావతి : ఉమ్మడి గుంటూరు జిల్లాలో డిసెంబరు నెలలో వస్తున్న తుపాన్లు కర్షకులకు కోలుకోలేని నష్టాలు మిగులుస్తున్నాయి. గతేడాది డిసెంబరు రెండోవారంలో వచ్చిన మాండౌస్‌ తుపాను వరి రైతులకు తీవ్ర నష్టం కలగజేసింది. ఇప్పుడు కూడా డిసెంబరు నెల తొలివారంలో మొదలైన మిగ్‌ జాం తుపాను రైతులకు తీవ్ర ఆందోళన కలగజేస్తోంది. డెల్టాలో చాప చుట్టేసిన వరి పొలాలు... పొలంలోనే తడిసిన ఓదెలు... ఇప్పుడు గుంటూరు, బాపట్ల జిల్లా పరిధిలో ఎటుచూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. డిసెంబరు వచ్చిందంటే తుపానుల భయం రైతులను వెంటాడుతోంది. ఈఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి సాగునీటి కొరతతో ఇబ్బంది పడిన రైతులకు పంట కోత దశలో వచ్చిన తుపాను వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వరి పంట కోతకు సిద్ధంగా ఉన్న తరుణంలో నేలవాలితే నష్టం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎకరా కోత కోయడానికి యంత్రంతో గంటన్నర సమయం పడితే నేలవాలితే రెండు గంటలకుపైగా సమయం పడుతుంది. ఎక్కువగా నేలవాలితే మూడు గంటల సమయం కూడా యంత్రం పనిచేయాల్సి వస్తుంది. గంటకు రూ.2600 చొప్పున రైతు చెల్లించాలి. ఈలెక్కన నేలవాలితే అదనంగా పట్టే సమయం మొత్తం రైతుకు భారమే. దీనికితోడు నేలవాలిన తర్వాత నీరు నిలిస్తే ధాన్యం రంగు మారడంతో పాటు మొలక వచ్చే అవకాశం ఉంది. దీంతో ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేస్తారు. ఇలా అన్నివిధాలా రైతులకు కష్టాలే వెంటాడుతాయి. తుపాను కొనసాగడంతోపాటు బాపట్ల, నిజాంపట్నం మధ్య తీరం దాటుతుందన్న అంచనాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని