logo

వసతి గృహాల్లో హెచ్‌డబ్ల్యూవోల బసకు ఆదేశం

జిల్లాలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు, పల్లపు ప్రాంతాల్లో ఉన్న సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులను సమీపంలోని సురక్షితమైన ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఏదైనా కల్యాణ మండపంలోకి తక్షణం తరలించాలని జిల్లా కలెక్టరు ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు.

Published : 05 Dec 2023 02:28 IST

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు, పల్లపు ప్రాంతాల్లో ఉన్న సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులను సమీపంలోని సురక్షితమైన ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఏదైనా కల్యాణ మండపంలోకి తక్షణం తరలించాలని జిల్లా కలెక్టరు ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. పాఠశాలలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించినందున వసతి గృహాల నుంచి విద్యార్థులు బయటకు రాకుండా చూసేందుకు హెచ్‌డబ్ల్యూవోలు వారు పని చేస్తున్న హాస్టళ్లలోనే బస చేయాలని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సహాయ సిబ్బంది కూడా విద్యార్థుల దగ్గరే పడుకోవాలన్నారు. సహాయ సంక్షేమాధికారులు కూడా వారు విధులు నిర్వహిస్తున్న ప్రధాన కేంద్రాల్లోనే నివాసం ఉండాలని స్పష్టం చేశారు. వర్షాలకు నీరు చేరి పాములు, తేళ్లు, విష కీటకాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నందున విద్యార్థులు వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాత్రి వేళల్లో విద్యుత్తు పోయే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయంగా రీఛార్జబుల్‌ లైట్లు, టార్చిలైట్లు, కొవ్వొత్తులు దగ్గర ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఆయా వసతి గృహాల్లో విద్యార్థులకు రేషన్‌, పాలు, కూరగాయలు, నిత్యావసరాలు సమకూర్చుకోవాలని ఆదేశించారు. కలెక్టరు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే హెచ్‌డబ్ల్యూవోలు, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల ఉప సంచాలకులు డి.మధుసూదనరావు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని