logo

ఆన్‌లైన్‌ లావాదేవీలతో అవస్థలు

పంచాయతీల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌, యూపీఐ విధానంలో పేమెంట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అయితే క్షేత్ర స్థాయిలో బ్యాంకుల నుంచి క్యూఆర్‌, యూపీఐ గుర్తింపు సంఖ్యలు రాకపోవడంతో అక్టోబర్‌ నెలలో నెమ్మదిగా సేవలు మొదలయ్యాయి. ఇంత వరకు బాగానే ఉన్నా..

Updated : 05 Dec 2023 05:51 IST

ఖాతాలో జమైన నగదు కట్‌ అవుతుందంటున్న కార్యదర్శులు

పంచాయతీ కార్యాలయం వద్ద ఆన్‌లైన్‌ పేమెంట్లు చేయాలని పెట్టిన ప్రచార పత్రాలు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే : పంచాయతీల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌, యూపీఐ విధానంలో పేమెంట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అయితే క్షేత్ర స్థాయిలో బ్యాంకుల నుంచి క్యూఆర్‌, యూపీఐ గుర్తింపు సంఖ్యలు రాకపోవడంతో అక్టోబర్‌ నెలలో నెమ్మదిగా సేవలు మొదలయ్యాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు యూపీఐ విధానంలో ప్రజల నుంచి పేమెంట్‌ చేస్తుంటే పంచాయతీ/సచివాలయ కార్యదర్శులు ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జిల్లాలో 236 గ్రామాన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో జిల్లాలో అన్ని గ్రామాల్లోనూ యూనియన్‌ బ్యాంకులో పంచాయతీ తరఫున ప్రభుత్వ ఖాతాను తెరచారు. యూపీఐ పేమెంట్స్‌కు అనుకూలంగా ఉండేలా ఈపోస్‌ యంత్రం, క్యూఆర్‌ కోడ్‌లు ఆలస్యంగా అయినా పంచాయతీలకు చేరాయి. తీరా యూపీఐ పేమెంట్స్‌ మొదలుపెట్టిన తర్వాత ఖాతాలో జమైన నగదులో కొంత సొమ్ము ఖాతాలో నుంచి కట్‌ అవుతుంది. కనిష్ఠంగా రూ.50 నుంచి గరిష్ఠంగా ఇప్పటి వరకు రూ.350 వరకు కట్‌ అయిన సందర్భాలున్నాయి. రూ.5 వేలకు పైబడి పేమెంట్స్‌ చేసిన చోట్ల ఒక్కొసారి రూ.300 వరకు కట్‌ అవుతున్నాయని, మరికొన్ని చోట్ల రూ.40, రూ.50 తగ్గిపోతున్నాయి. దీంతో యూపీఐ ద్వారా పన్నులు కట్టించుకోవాలంటే పంచాయతీ అధికారులు, ఉద్యోగులు జంకుతున్నారు. దీనికితోడు ప్రజలు చెల్లించిన డబ్బులను ఖజానా శాఖ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శి బ్యాంకుకు వెళ్లి పంచాయతీ ఖాతాలోని నగదును ఖజానా శాఖ ఖాతాకు జమ చేయాలని విత్‌డ్రా చేద్దామన్నా.. అందుకు ఖాతాలో నుంచి డబ్బులు తీసుకుందామన్నా డబ్బులు రావడం లేదని కొందరు కార్యదర్శులు వాపోతున్నారు.

ఈపోస్‌, క్యూఆర్‌ కోడ్‌లతో చెల్లింపులు

డిజిటల్‌ చెల్లింపుల నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు క్యూఆర్‌ కోడ్‌లను బ్యాంకుల ద్వారా అందించారు. అయితే మూడు వేల మంది జనాభా పైబడిన గ్రామాలకు క్యూఆర్‌ కోడ్‌తో పాటుగా ఈపోస్‌ యంత్రాలను సైతం అందుబాటులో ఉంచారు. తద్వారా ఏటీఎం కార్డులను వినియోగించి కూడా పంచాయతీకి చెల్లింపులు చేసే వెసులుబాటుంది.

సాంకేతిక సమస్యలు పరిష్కరించుకుంటున్నాం

జిల్లాలోని అన్ని గ్రామాలకు క్యూఆర్‌ కోడ్స్‌ అందాయి. ఇప్పుడిప్పుడే పంచాయతీ కార్యదర్శులు కొన్ని సాంకేతిక సమస్యలను తమ దృస్టికి తీసుకొస్తున్నారు. వాటిని క్రమంగా పరిష్కరిస్తున్నాం. మొదట్లో క్యూఆర్‌ కోడ్స్‌ వినియోగించుకున్నందుకు కొన్నిచోట్ల కమిషన్‌ కింద నగదును ఖాతా నుంచి కట్‌ చేశారు. తర్వాత వాటిని బ్యాంకర్లతో మాట్లాడి వెనక్కి తెప్పించుకున్నాం. సాంకేతిక సమస్యలను ఒక్కొక్క దానిని పరిష్కరిస్తున్నాం. మున్ముందు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్‌ పేమెంట్స్‌ జరిగేలా చర్యలు తీసుకుంటాం.

కె.శ్రీదేవి, జిల్లా పంచాయతీ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని