logo

పిల్లలకిచ్చే మందుల్లో... ఎందుకీ కోత?

చిన్నారులకు పాఠశాల వాతావరణాన్ని అలవాటు చేస్తూ.. పేద కుటుంబాల పిల్లలు, తల్లులు, గర్భిణులకు పోషకాహారం, ప్రాథమిక వైద్య సహాయం అందించేందుకు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో మందుల కొరత ఏర్పడింది. ఐసీడీఎస్‌ విభాగం సమకూరుస్తున్న కిట్‌లలో సాధారణంగా ఇస్తున్న మందులను తగ్గించి పంపిణీ చేశారు.

Updated : 05 Dec 2023 05:49 IST

అంగన్‌వాడీ కేంద్రాల్లో కనిపించని ఆల్‌ బెండజోల్‌, మరికొన్ని మందులు

పాత, కొత్త కిట్లలో స్పష్టంగా కనిపిస్తున్న మందుల వ్యత్యాసం

చల్లావారిపాలెం(వట్టిచెరుకూరు) : చిన్నారులకు పాఠశాల వాతావరణాన్ని అలవాటు చేస్తూ.. పేద కుటుంబాల పిల్లలు, తల్లులు, గర్భిణులకు పోషకాహారం, ప్రాథమిక వైద్య సహాయం అందించేందుకు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో మందుల కొరత ఏర్పడింది. ఐసీడీఎస్‌ విభాగం సమకూరుస్తున్న కిట్‌లలో సాధారణంగా ఇస్తున్న మందులను తగ్గించి పంపిణీ చేశారు. దీంతో పిల్లల ఆరోగ్య సంరక్షణ ఎలా అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

12 రకాలకు ఏడే సరఫరా...

జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలకు ఇచ్చే ఐసీడీఎస్‌ మందుల కిట్‌లలో మందుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. గతంలో పెద్ద సైజు కిట్‌లలో పిల్లలు, తల్లులు, బాలింతలకు ఉపయోగకరంగా ఉండే 12 రకాల మందులను ప్రభుత్వం సరఫరా చేసింది. తాజాగా ఇచ్చిన కిట్‌లలో కేవలం ఏడు రకాల మందులే ఉంటున్నాయి. వీటిలోనూ అత్యంత కీలకమైన ఆల్‌బెండాజోల్‌, నియోమైసిన్‌ మందులు అసలు లేవు. కొత్తగా ఇస్తున్న ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్ల సంఖ్య గణనీయంగా పెంచారు. గజ్జి, తామర, విరేచనాలు తగ్గించే మందులు లేవు. వాతావరణ మార్పుల కారణంగా రోగాలు ప్రబలే ప్రస్తుత సమయంలో మందులు అందుబాటులో ఉండకపోతే తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఇవ్వాలి..

జిల్లా వ్యాప్తంగా ప్రత్తిపాడు, ఫిరంగిపురం, తెనాలి, మంగళగిరి, పొన్నూరు ఐసీడీఎస్‌ సెక్టార్లు, గుంటూరు నగరం కలిపి మొత్తం 1,480 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. గుంటూరు, పొన్నూరు, మంగళగిరి, తెనాలి వంటి పట్టణ ప్రాంతాల్లోని కేంద్రాల్లో 50 నుంచి 90 వరకు చిన్నారులు ఉంటుండగా, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, కాకుమాను, తాడికొండ, ఫిరంగిపురం తదితర మండలాల్లోని కొన్ని గ్రామాల్లో పది మంది కన్నా తక్కువ పిల్లలున్న పరిస్థితులూ ఉన్నాయి. అయితే అన్ని కేంద్రాలకూ సమాన సంఖ్యలో కిట్లు పంపిణీ చేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మందులు సరఫరా చేయాలని పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు కోరుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇవే కిట్లు ఇస్తున్నారు...

- సుజాతాదేవి, ప్రత్తిపాడు సీడీపీవో ఐసీడీఎస్‌

రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఇదే విధంగా కిట్లు పంపిణీ చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటినే అందుబాటులో ఉంచాం. మందుల సంఖ్యను ఎందుకు తగ్గించారో తెలియదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని