logo

అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి

మిగ్‌జాం తుపాను పట్ల అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండలాల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ప్రత్యేక అధికారులతో సోమవారం సమీక్షించారు.

Updated : 05 Dec 2023 05:59 IST

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, పక్కన ఎస్పీ ఆరిఫ్‌ హాఫీజ్‌, జేసీ రాజకుమారి

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: మిగ్‌జాం తుపాను పట్ల అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండలాల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ప్రత్యేక అధికారులతో సోమవారం సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో తీరప్రాంతం లేకపోయినా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బాపట్లలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని, గాలులు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వీయవచ్చన్నారు. ప్రజలతో పాటు జంతువులకూ ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఇళ్లలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు ప్రవహించే ప్రాంతాల్లో అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పట్టణాల్లో హోర్డింగ్‌లు, చెట్లు పడిపోయేలా ఉంటే.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. స్తంభాలు కూలినా.. వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టి విద్యుత్తు సరఫరా చేసేలా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్‌, రెవెన్యూ, విద్యుత్తు, ఆర్‌అండ్‌బీ అధికారులతో బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైవేల్లో ప్రయాణాలు సజావుగా సాగేలా సంచార బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వర్షాల నేపథ్యంలో రైతులు వరి కోతలు కోయకుండా వారికి అవగాహన కల్పించాలన్నారు. వరద వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే.. వారిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు చేర్చాలని, అవసరమైన తాగునీరు, ఆహారం, మందులు, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేయాలన్నారు. పట్టణాల్లో పార్కులు, రిక్రియేషన్‌ ప్రాంతాలను మూసివేయాలన్నారు. వరదల వల్ల ఎక్కడైనా ముంపు పరిస్థితులు ఎదురైతే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంను సంప్రదించవచ్చన్నారు. సమీక్షలో ఎస్పీ ఆరిఫ్‌ హాఫీజ్‌, జేసీ జి.రాజకుమారి, డిప్యూటీ కలెక్టర్‌ కె.స్వాతి, విపత్తు నిర్వహణ సంస్థ డీపీఎం లక్ష్మీకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని