logo

దంత వైద్య విద్యార్థిని హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

వివాహానికి నిరాకరించిందనే కక్షతో దంత వైద్య విద్యార్థినిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.6,000 జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సోమవారం తీర్పు చెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం..

Updated : 05 Dec 2023 05:50 IST

రూ.6 వేల జరిమానా

నిందితుడు జ్ఞానేశ్వర్‌

పెదకాకాని, న్యూస్‌టుడే : వివాహానికి నిరాకరించిందనే కక్షతో దంత వైద్య విద్యార్థినిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.6,000 జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సోమవారం తీర్పు చెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ గ్రామానికి చెందిన మన్నే జ్ఞానేశ్వర్‌ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి నవంబర్‌ 2020లో సామాజిక మాధ్యమం ద్వారా చిన అవుటపల్లి సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో బీడీఎస్‌ చదువుతూ హాస్టల్లో ఉంటున్న తపస్వి పరిచయం అయ్యారు. ఆమె తల్లిదండ్రులు ముంబయిలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ అక్కడే ఉండేవారు. వారి పరిచయం ప్రేమగా మారడంతో మార్చి 2021లో జ్ఞానేశ్వర్‌ హైదరాబాద్‌ నుంచి వచ్చి విజయవాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.

తరువాత ఇద్దరూ గన్నవరంలో ఓ గది అద్దెకు తీసుకొని కొంతకాలం ఉన్నారు. కొన్నాళ్లకు తపస్విని అనుమానించడం ప్రారంభించడంతో గది ఖాళీ చేసి తక్కెళ్లపాడులో నివాసం ఉంటున్న బాల్య స్నేహితురాలు, దంత వైద్య విద్యార్థిని వద్దకు వెళ్లింది. అక్కడ నుంచి తరచూ కళాశాలకు వెళ్లి వస్తుండేది. నవంబర్‌, 2022లో జ్ఞానేశ్వర్‌ తపస్వి వద్దకు వెళ్లి తనను పెళ్లి చేసుకోకపోతే చంపుతానని బెదిరించాడు. దీనిపై నూజివీడు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిని మందలించి తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు సైతం యువతికి ఇప్పించారు. ఈ క్రమంలో డిసెంబర్‌ 5న కత్తి, సర్జికల్‌ బ్లేడులు కొని తన ద్విచక్ర వాహనంపై తపస్వి నివాసం ఉంటున్న తక్కెళ్లపాడులోని ఇంటి వద్దకు వెళ్లాడు.

పెళ్లి చేసుకోవాలని కోరగా, ఆమె నిరాకరించింది. దీంతో కత్తి, సర్జికల్‌ బ్లేడులతో ఆమె శరీరంపై ఇష్టానుసారం పొడిచాడు. అనంతరం తానూ కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. పక్క గదిలో ఉన్న స్నేహితురాలు బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్థలికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడు ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించారు. హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష పడేలా చేసిన సీఐ బండారు సురేష్‌బాబుతో పాటు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఉన్న సుల్తాన్‌ సిరాజుద్దీన్‌ నిందితుడి నేరం రుజువు చేసి శిక్ష పడేలా వాదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు