logo

క్షణ క్షణం ఉత్కంఠ!

తుపానుహెచ్చరికల నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. నిజాంపట్నం వద్ద పదో నంబరు సూచిక జారీ చేయటంతో ప్రజలు మరింత అప్రమత్తమయ్యారు.  

Updated : 05 Dec 2023 05:49 IST

నిజాంపట్నంలో 10వ నంబరు ప్రమాద హెచ్చరిక  
పునరావాసం, సహాయక చర్యలపై యంత్రాంగం దృష్టి

నిజాంపట్నం హార్బర్‌లో ఎగరేసిన పదో నంబరు ప్రమాద సూచిక

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే, నిజాంపట్నం, చినగంజాం : తుపానుహెచ్చరికల నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. నిజాంపట్నం వద్ద పదో నంబరు సూచిక జారీ చేయటంతో ప్రజలు మరింత అప్రమత్తమయ్యారు.  తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారటంతో ఉమ్మడి జిల్లాల పరిధిలో సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సహాయక చర్యలు ముమ్మరం చేయటానికి ఆయా శాఖలను రంగంలోకి దించారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీసు, విద్యుత్తు, అగ్నిమాపక, పౌరసరఫరాలశాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. తీరం దాటే సమయంలో మూడు జిల్లాల పరిధిలో విస్తారంగా వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉందని యంత్రాంగం భావిస్తోంది. అధిక వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కావటం.. గాలులకు స్తంభాలు, హోర్డింగ్‌లు పడిపోవటం, విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించటానికి, సహాయక, పునరావాస కేంద్రాల ఏర్పాటుకు మూడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆదేశించారు. సోమవారం ఉదయం నుంచి ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తూ కిందిస్ధాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తుపాను సహాయక చర్యలు.. ఏర్పాట్లను పర్యవేక్షించటానికి, యంత్రాంగాన్ని సమన్వయం చేయటానికి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కాటంనేని భాస్కర్‌ను ప్రభుత్వం బాపట్లకు ప్రత్యేకాధికారిగా పంపింది. బాపట్ల సూర్యలంక కేంద్రం వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో ఆప్రదేశాన్ని అక్కడి కలెక్టర్‌ రంజిత్‌బాషా, ఎస్పీ వకుల్‌జిందాల్‌లు పర్యటించి పరిశీలించారు.

పునరావాస కేంద్రాలివీ

దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, వేమూరు, భట్టిప్రోలు, అమృతలూరు, చెరుకుపల్లి, రేపల్లె, నిజాంపట్నం, పిట్టలవానిపాలెం, కర్లపాలెం, బాపట్ల, చీరాల, చినగంజాం మండలాల్లో తుపాను ప్రభావం బాగా ఉంటుందని అంచనా. దీంతో ఆయా ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి పల్లపు ప్రాంత ప్రజల్ని ఇప్పటికే ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. నిజాంపట్నం మండలం కొత్తపాలెం. నక్షత్రనగర్‌, సంజీవనగర్‌, దిండి, అడవులదీవి, పెనుమూడి, చెన్నుపల్లివారిపాలెం, అడవీదిపాలెం, చినగంజాం, పెదగంజాం, పాతూరు, చీరాల మండలం  కటారిపాలెంలో పునరావాస కేంద్రాలకు ఇప్పటికే 800 మందికి పైగా జనాల్ని చేర్చామని రెవెన్యూవర్గాలు పేర్కొన్నాయి. తుపాను బలహీనపడే వరకు వారికి ఈ కేంద్రాల్లోనే ఆహారం, తాగునీటి, విశ్రాంతి సౌకర్యం కల్పిస్తామని అధికారులు పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని