logo

తీరంలో.. భయం.. భయం

మిగ్‌జాం తుపానుతో రైతు వెన్నులో వణుకు పుడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందన్న అంచనాలతో బాపట్ల, గుంటూరు, పల్నాడు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

Updated : 05 Dec 2023 05:56 IST

సముద్రంలో ఉవ్వెత్తున్న   కెరటాలు
అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
ఎనిమిది తీర మండలాలపై తీవ్ర ప్రభావం

పిట్టలవానిపాలెం మండలం సంగుపాలెం కోడూరులో ఓదెల మధ్యలో నీరు

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, బాపట్ల : మిగ్‌జాం తుపానుతో రైతు వెన్నులో వణుకు పుడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందన్న అంచనాలతో బాపట్ల, గుంటూరు, పల్నాడు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బాపట్ల, నిజాంపట్నం తదితర ప్రాంతాల్లో తీరం దాటితే తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. దిగుబడులు ఇంటికి వచ్చే సమయంలో తుపానుతో పంట తుడిచిపెట్టుకుపోతుందని వాపోతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి, కాయలతో కళకళలాడుతున్న మిర్చి, తీతలకు సిద్ధమైన పత్తి పంటపై ఉండడంతో అపారనష్టం వాటిల్లనుంది. భారీ వర్షాలు కొనసాగితే పంటలు నీట మునిగి కర్షకులకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. గాలులతో కూడిన వర్షం వస్తే ఉద్యాన పంటలకు నష్టం జరుగుతుంది.

తుపాను మంగళవారం మధ్యాహ్నానికి తీవ్ర తుపానుగా మారి బాపట్ల సమీపంలో తీరం దాటుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చేసిన హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎనిమిది తీర మండలాల్లో రెడ్‌అలర్ట్‌ ప్రకటించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా తక్షణమే సహాయక చర్యలు చేపట్టటానికి తీర ప్రాంతానికి ఐదు బృందాల జాతీయ, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు చేరుకున్నాయి. కలెక్టర్‌ రంజిత్‌బాషా, ఎస్పీ వకుల్‌ జిందాల్‌, జేసీ శ్రీధర్‌ సూర్యలంక, వాడరేవు తీరంలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. సముద్రం కల్లోలంగా మారి ఒకటిన్నర మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. నిజాంపట్నం హార్బరులో పదో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుపాను ప్రభావంతో సోమవారనం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ఈదురుగాలులతో ఓ మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం తీరంలో భారీ వర్షం పడింది. వేల ఎకరాల్లో వరి పైరు నేలవాలింది. కోతలు కోసిన వరి పైరు వర్షపు నీటిలో నానుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  

జిల్లాకు రూ. 2 కోట్లు

భీకర గాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడితే తక్షణమే తొలగించటానికి ఆర్‌అండ్‌బీ, విద్యుత్తు శాఖ సిబ్బంది 50మందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వీరికి అవసరమైన పరికరాలు సమకూర్చారు. తుపాను సహాయ చర్యలు చేపట్టడానికి జిల్లాకు రూ.రెండు కోట్లు కేటాయించారు.  తీవ్ర తుపాను జిల్లాలో తీరం దాటితే ఇవి ఏ మాత్రం సరిపోవు. కలెక్టర్‌ రంజిత్‌బాషా, ఎస్పీ వకుల్‌ జిందాల్‌, ఎమ్మెల్యే కోన రఘుపతి సూర్యలంక తీరంలో పర్యటించారు. ఆర్డీవో రవీందర్‌, డీఎస్పీ వెంకటేశులుతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. తుపాను రక్షిత భవనం పునరావాస కేంద్రంలో ఉన్న స్థానిక ఎస్టీలతో మాట్లాడి కల్పించిన వసతులు, ఆహారం, తాగునీటి సౌకర్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఎన్టీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో మాట్లాడారు.

అధికారుల సన్నద్ధత

సూర్యలంక, అడవిపల్లెపాలెం తీర గ్రామాలకు 40 మంది సభ్యులతో కూడిన రెండు బృందాల ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సామగ్రితో చేరుకున్నారు. చీరాల మండలం ఓడరేవు, రేపల్లె, నిజాంపట్నం తీరాలకు మరో మూడు బృందాల ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వచ్చారు. తుపాను ప్రభావంతో సోమవారరం అర్ధరాత్రి నుంచి 60 నుంచి 70 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచి భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాతో సహాయక చర్యలు చేపట్టేందుకు రెవెన్యూ, పంచాయతీరాజ్‌, పోలీసు సిబ్బందిని వీరితో పాటు సిద్ధం చేశారు. విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసిన విధంగా బాపట్ల నుంచి నిజాంపట్నం తీరాల మధ్య తుపాను తీరం దాటితే ప్రభావం ఎక్కువగా ఉండే 64 తీర గ్రామాల నుంచి ప్రజలను తరలించటానికి 43 తుపాను రక్షిత భవనాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రం బాపట్లలోనూ రెండు పునరావాస కేంద్రాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

చొచ్చుకు వస్తున్న అలలు

జిల్లాలో 74 కి.మీ. తీర ప్రాంతంలో మిగ్‌జాం తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అడవిపల్లెపాలెం, సూర్యలంక తీరంలో అలలు ఎగిసిపడుతూ 20 అడుగుల దూరం ముందుకు చొచ్చుకు వచ్చాయి. జిల్లాలో తీర ప్రాంత మండలాలైన రేపల్లె, నిజాంపట్నం, పిట్టలవానిపాలెం, కర్లపాలెం, బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజాంలో 64 గ్రామాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. తొలి దశలో తీరానికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న అడవిపల్లెపాలెం, సూర్యలంక, దిండి, కొత్తపాలెం, లంకెవానిదిబ్బ, రాజుకాల్వ, మోళ్లగుంట గ్రామాల్లో నిరుపేద ఎస్టీలు, మత్స్యకారులను గుర్తించి సమీపంలోని తుపాను రక్షిత భవనాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. వారికి అల్పాహారం, భోజనం, తాగునీటి వసతి    కల్పించారు.

తీర గ్రామాల్లో మకాం

తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర శాఖల అధికారులంతా తీర గ్రామాల్లో మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తీర గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటానికి బస్సులు, వాహనాలు సిద్ధం చేశారు. కలెక్టరేట్లో ప్రధాన శాఖల అధికారులతో కలెక్టర్‌, ఎస్పీ, జేసీ సమావేశమై బుధవారం సాయంత్రం వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షానికి వేల ఎకరాల్లో కోతకు వచ్చిన వరి పైరు నేలవాలింది. 2 వేల ఎకరాల్లో వరి ఓదెలు తడిశాయి. భారీ వర్షాలు కురిస్తే 76 వేల హెక్టార్లలో వరి పంటపై ఆశలు పూర్తి వదిలేసుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం  చేస్తున్నారు.

బాపట్ల:  అలల ఉద్ధృతికి దెబ్బతినకుండా పడవను దూరంగా లాక్కొస్తున్న మత్స్యకార యువకులు


తుపాను ముప్పు పోయే వరకు ప్రజలు బయటకు రావద్దు: కలెక్టర్‌

ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి సూచనలిస్తున్న కలెక్టర్‌ రంజిత్‌బాషా, ఎస్పీ వకుల్‌ జిందాల్‌

బాపట్ల: మిగ్‌జాం తుపాను ముప్పు తొలగిపోయే వరకు ప్రజలకు బయటకు రావద్దని కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా సూచించారు. తుపాను సహాయక చర్యలపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఎస్పీ వకుల్‌ జిందాల్‌, జేసీ శ్రీధర్‌తో కలిసి ఆయన మంగళవారం నిర్వహించారు. సూర్యలంక తీరాన్ని సందర్శించి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తుపాను ప్రభావం జిల్లాలో ఎక్కువగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించిందన్నారు. జిల్లాలో విద్యా సంస్థలకు రెండ్రోజులు సెలవులు ప్రకటించామన్నారు. అత్యవసర సమాచారం కోసం కలెక్టరేట్లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సాయం కోసం ప్రజలు 24 గంటలు పని చేసే కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబరు 8712655881ను సంప్రదించాలన్నారు. అధికారులు సత్వరమే స్పందించి సహాయక చర్యలు చేపడతారన్నారు. తీర ప్రాంతంలో గుడిసెల్లో ఉంటున్న వారిని తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలుగా గుర్తించిన 111 గ్రామాల్లో అధికారులు పర్యటించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 18 మంది గర్భిణులను ముందుగానే  వైద్యశాలలకు తరలించామన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల వారిని యుద్ధప్రాతిపదికన పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.  ప్రత్యేకాధికారులు ఆయా మండల కేంద్రాల్లో బుధవారం వరకు ఉండాలని చెప్పారు. రాబోయే 48 గంటలు అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పునరావాస కేంద్రాల కోసం 43 తుపాను రక్షిత భవనాలను సిద్ధం చేసినట్లు తెలిపారు.   వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు తక్షణమే సేకరించాలన్నారు. సూర్యలంక పునరావాస కేంద్రంలో ఉన్న ఎస్టీలతో మాట్లాడి భోజనం, అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు.   అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం డయల్‌ 100, 112 లేదా పోలీసు కంట్రోల్‌ రూమ్‌ నంబరు 83338 13228కు ఫోన్‌ చేయాలని ఎస్పీ జిందాల్‌ తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని