logo

జగనన్నా.. కాలనీకి దారేదన్నా!

Published : 07 Dec 2023 04:56 IST

వర్షం కురిస్తే పోటెత్తుతున్న వరద
న్యూస్‌టుడే, నరసరావుపేటసెంట్రల్‌

నరసరావుపేటలోని నిరుపేదలకు జగనన్న కాలనీ పేరుతో ఉప్పలపాడు గ్రామ సమీపంలో నివేశన స్థలాలు ఇచ్చారు. అన్ని సౌకర్యాలు కల్పించి ఇస్తున్నామని... ఇళ్లు నిర్మించుకొని అక్కడే నివాసం ఉండాలని సుమారు 5400 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. దీంతో చాలా మంది ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లలో ఉంటున్నారు. అయితే ఆ స్థలాలకు వెళ్లే దారి మాత్రం అధ్వానంగా ఉంది. వర్షం కురిస్తే చాలు కాలనీకి వెళ్లాలంటే నరకం కనిపిస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. జగనన్న కాలనీకి ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. మిగ్‌జాం తుపాను నేపథ్యంలో కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతంలోని వర్షపునీరు వచ్చి ప్రధాన రహదారిపై ప్రవహిస్తుండటంతో కాలనీకి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాలకు సైతం కాలనీలో నుంచి పట్టణానికి చేరుకోవాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆనుకొని నీరు ప్రవహిస్తుండటంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. కాలనీ వాసులు అవస్థలు పడుతున్నా బుధవారం అధికారులు, పాలకులు ఇటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని