logo

బిక్కుబిక్కుమంటూ.. రాత్రంతా జాగరణ

చుట్టూ నీళ్లు.. రాత్రంతా చీకటి.. దోమల బెడద.. దిక్కుతోచనిస్థితిలో విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. కనీసం తాగేందుకు నీరు దొరక్క అల్లాడిపోయారు. ముప్పాళ్ల మండలం గోళ్లపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సుమారు 280 మంది విద్యార్థినులు చదువుతున్నారు.

Published : 07 Dec 2023 04:58 IST

కస్తూర్బా విద్యాలయాన్ని  చుట్టుముట్టిన వర్షపు నీరు
తాగునీరూ లేదని విద్యార్థినుల ఆవేదన

ముప్పాళ్ల, న్యూస్‌టుడే: చుట్టూ నీళ్లు.. రాత్రంతా చీకటి.. దోమల బెడద.. దిక్కుతోచనిస్థితిలో విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. కనీసం తాగేందుకు నీరు దొరక్క అల్లాడిపోయారు. ముప్పాళ్ల మండలం గోళ్లపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సుమారు 280 మంది విద్యార్థినులు చదువుతున్నారు. మిగ్‌జాం తుపాను కారణంగా రెండురోజులపాటు కురిసిన భారీ వర్షానికి విద్యాలయం చుట్టూ నీరు నిల్వ చేరింది. పక్కనే ఉన్న ఎస్టీ కాలనీ ముంపునకు గురైంది. దీంతో బాలికలు బయటకు వచ్చేందుకు వీలులేకుండా పోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం..భయంగా రాత్రంతా గడిపారు.

ఈ విషయాన్ని బుధవారం స్థానికులు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ కస్తూర్బాలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు. సాధారణ రోజుల్లోనే పాములు, దోమల బెడద ఉంటుందని వాపోయారు. వర్షం కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి అని ఆవేదన చెందారు. కనీసం తాగేందుకు నీరు లేదన్నారు. అనంతరం తహసీల్దారు భవానీ శంకర్‌ విద్యాలయాన్ని సందర్శించి బాలికలతో మాట్లాడారు. నాలుగు రోజులు భోజనం కూడా సక్రంగా వడ్డించలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బాలికల సమస్యలను కలెక్టరు నివేదించగా.. ఆయన వెంటనే డీఈవో శామ్యూల్‌తో మాట్లాడి విద్యాలయాన్ని సందర్శించాలని ఆదేశించారు. రాత్రి డీఈవో విద్యాలయాన్ని సందర్శించారు. అక్కడి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం విద్యాలయానికి రెండ్రోజులపాటు సెలవు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని