logo

పంట నష్టం అంచనా వేస్తున్నాం

మిగ్‌జాం తుపాను వల్ల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయని కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు తుపాను నష్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి నిర్వహించిన వీక్షణ సమావేశానికి ఎస్పీ వకుల్‌ జిందాల్‌, సంయుక్త కలెక్టర్‌ సీహెచ్‌ శ్రీధర్‌తో కలసి ఆయన పాల్గొన్నారు.

Published : 07 Dec 2023 05:01 IST

ముందస్తు చర్యలతో తప్పిన ప్రాణనష్టం
ముఖ్యమంత్రికి వివరించిన కలెక్టర్‌ రంజిత్‌బాషా

బాపట్ల (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: మిగ్‌జాం తుపాను వల్ల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయని కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు తుపాను నష్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి నిర్వహించిన వీక్షణ సమావేశానికి ఎస్పీ వకుల్‌ జిందాల్‌, సంయుక్త కలెక్టర్‌ సీహెచ్‌ శ్రీధర్‌తో కలసి ఆయన పాల్గొన్నారు. జిల్లాలో భారీ నష్టం జరగకుండా సమగ్ర ప్రణాళికతో ప్రాణనష్టం నివారించామన్నారు. జిల్లాలో 25 మండలాల్లో వర్షం కురిసిందని, 20 సెం.మీ వర్షపాతం నమోదైందన్నారు. రెండు చోట్ల గోడలు కూలి నాలుగు గొర్రెలు మృత్యువాత పడ్డాయని, 32 ఇళ్లు దెబ్బతిన్నాయని, 37 గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. 350 విద్యుత్తు స్తంభాలు నేలవాలాయని, ప్రస్తుతం 90శాతం విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించామన్నారు. పర్చూరు సబ్‌స్టేషన్‌ దెబ్బతినడంతో సరఫరా నిలిచిపోయిందన్నారు. యుద్ధప్రాతిపదికన అక్కడ పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

దెబ్బతిన్న పంటలు: జిల్లాలో 70వేల హెక్టార్లలో ధాన్యం నీట మునిగింది. పొలాల్లో నీరు నిల్వ లేకుండా దిగువకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందు కోసం ఉపాధి కూలీలను వినియోగిస్తామన్నారు. ప్రతి మండలానికి పొక్లెయిన్‌, జేసీబీ యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించామన్నారు. ఇందుకు రూ.25లక్షలు నిధులు ఇచ్చామన్నారు. జిల్లాలో అత్యధికంగా పండే వరి, శనగ, అరటి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయన్నారు. పంటనష్టం అంచనాల సర్వే మొదలైనట్లు ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. కారంచేడు, మార్టూరు, పర్చూరు మండలాల్లో పంట కాలువల ద్వారా రహదారులకు అంతరాయం ఏర్పడగా వాటిని పునరుద్ధరించామన్నారు.


గ్రామాల్లో వైద్యశిబిరాలు

తీర ప్రాంతంలో వలలు, బోట్లు దెబ్బతిన్నాయన్నారు. ఇప్పటికే జిల్లాలో 93 వైద్యశిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. గేదెలకు అంటువ్యాధులు రాకుండా టీకాల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామన్నారు. తుపాను నష్టంపై మూడ్రోజుల్లో అంచనాల సర్వే పూర్తి చేసి నివేదిక పంపుతామన్నారు.


1319 మందికి ఆశ్రయం  

జిల్లాలో 74 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1,319 మందికి ఆశ్రయం కల్పించామన్నారు. అత్యధికంగా బాపట్ల మండలంలో సూర్యలంక, వాడరేవు ప్రాంతాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళుతున్న వారికి ప్రభుత్వం నిర్దేశించిన వస్తువుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని