logo

కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ శాఖలు సమన్వయంతో సాగాలి

కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ శాఖలు పరస్పరం సమన్వయంతో ముందుకు సాగాలని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) చీఫ్‌ కమిషనర్‌ సంజయ్‌ పంథ్‌ సూచించారు.

Published : 07 Dec 2023 05:06 IST

ఈనాడు - అమరావతి: కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ శాఖలు పరస్పరం సమన్వయంతో ముందుకు సాగాలని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) చీఫ్‌ కమిషనర్‌ సంజయ్‌ పంథ్‌ సూచించారు. విజయవాడ ఆటోనగర్‌లోని కస్టమ్స్‌ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర, కేంద్ర జీఎస్టీ శాఖల కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీజీఎస్టీ కమిషనర్‌ సాధు నరసింహారెడ్డి అధ్యక్షత వహించారు. సంజయ్‌ పంథ్‌ మాట్లాడుతూ.. రెండు శాఖల మధ్య సమాచార మార్పిడి చాలా అవసరమన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలన, ఉద్యోగులు తమ వృత్తిగత బాధ్యతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పన్ను చెల్లింపుదారుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలనీ.. వారికి నాణ్యమైన సేవలను అందించాలని కోరారు. రాష్ట్ర జీఎస్టీ కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్‌ మాట్లాడుతూ.. నకిలీ రిజిస్ట్రేషన్లు, ఇన్‌వాయిస్‌లను వినియోగించే వారిపై ఇకనుంచి తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జీఎస్టీ ఇంటిలిజెన్స్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎం.రామిరెడ్డి మాట్లాడుతూ.. పన్నుల చెల్లింపులకు సంబంధించిన నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠ పరిచామని వెల్లడించారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర జీఎస్టీ ప్రత్యేక కమిషనర్‌ ఎం.అభిషేక్‌ కిషోర్‌ పేర్కొన్నారు. సీజీఎస్టీ కమిషనర్‌ సాధు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. సీబీఐసీ సూచనల మేరకు ప్రతి మూడు నెలలకోసారి రెండు శాఖల మధ్య సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో రెండు శాఖల అదనపు కమిషనర్లు, జేసీ, ఏసీలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని