logo

సీఆర్డీఏ నుంచి రాజధాని రైతులకు మళ్లీ నోటీసులు

రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇస్తామని సీఆర్డీఏ నుంచి మళ్లీ రైతులకు నోటీసులు అందుతున్నాయి. నాలుగున్నరేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోని సీఆర్డీఏ అధికారులు ఉన్నట్టుండి వేరే చోట ప్లాట్లు కేటాయిస్తామని,

Published : 07 Dec 2023 05:12 IST

సమస్యాత్మక ప్లాట్లు రద్దు చేసుకోవాలని అధికారుల ఫోన్లు

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇస్తామని సీఆర్డీఏ నుంచి మళ్లీ రైతులకు నోటీసులు అందుతున్నాయి. నాలుగున్నరేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోని సీఆర్డీఏ అధికారులు ఉన్నట్టుండి వేరే చోట ప్లాట్లు కేటాయిస్తామని, సమస్యాత్మకంగా అనిపించిన ప్లాట్లు రద్దు చేసుకోవాలని కోరుతూ నోటీసులు పంపడంపై అమరావతి రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై అధికారులు ఇప్పటికే ఒకసారి నోటీసులు ఇచ్చారు. రైతుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో మళ్లీ నోటీసులు ఇస్తున్నట్లు సమాచారం.

ఏం జరిగిందంటే...

రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు లాటరీ విధానంలో గత ప్రభుత్వం నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో కొంత మంది రైతులు భూ సేకరణకు విముఖత చూపారు. దీంతో అమరావతి బృహత్‌ ప్రణాళికకు ఆటంకాలు ఏర్పడకుండా అప్పట్లో ప్రభుత్వం వారి భూములను భూ సేకరణ(లాండ్‌ పూలింగ్‌) ద్వారా సమకూర్చే ప్రక్రియ చేపట్టింది. ఆ తరువాత వైకాపా అధికారంలోకి వచ్చింది. అమరావతి నిర్మాణం నిలిచిపోవడంతో రైతులు తమ పేరు మీద ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి సాధ్యం కాలేదు. దీంతో తమకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించాలని సీఆర్డీఏ అధికారులను రైతులు సంప్రదించారు. నాలుగున్నరేళ్లుగా వారి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోని సీఆర్డీఏ అధికారులు ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో సమస్యాత్మక ప్లాట్లు రద్దు చేసుకోవాలని కోరుతూ నోటీసులు పంపడంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు రైతులకు ఫోన్లు చేసి మరీ నోటీసుల గురించి అడగడం, ఆఖరి సారిగా పంపుతున్నామని, 15 రోజులోగా వివరణ ఇవ్వాలని పేర్కొనడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రిటర్నబుల్‌ ప్లాట్లు ఎక్కడ కేటాయిస్తారు... ఎప్పటిలోగా ఇస్తారు... తదితర అంశాలపై తమతో చర్చించకుండా అత్యవసరంగా ప్లాట్లు రద్దు చేసుకోవాలని నోటీసులు ఇవ్వడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాలపై రాతపూర్వకంగా సీఆర్డీఏ అధికారులు హామీ ఇచ్చిన తరువాతనే రైతులు అధికారులకు సమాధానాలు ఇవ్వాలని అమరావతి ఐకాస నాయకులు సూచిస్తున్నారు. దీనిపై సందేహాలు ఉన్న రైతులు అమరావతి ఐకాస కార్యాలయంలో సహకారం తీసుకోవాలని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని