logo

నిర్వహణ గాలికొదిలేసి.. నిలువునా ముంచేసి

మిగ్‌జాం తుపాను రైతును తీవ్రంగా నష్టపరిచింది. అయితే ప్రకృతి వల్ల ఎదురైన విపత్తు కొంచెమైతే.. ప్రభుత్వ తప్పిదాలు, నిర్వాకం వల్ల అన్నదాతకు అపార నష్టం ఎదురైంది. జిల్లా పరిధిలో కాల్వలు, డ్రైనేజీలు వాగులు, వంకల నిర్వహణను ప్రభుత్వం విస్మరించింది.

Updated : 07 Dec 2023 06:12 IST

పొలాల్లో నీళ్లు.. డ్రెయిన్లలోకి వెళ్లే మార్గం లేక పైర్లు మునక
వాగు కట్టల మరమ్మతులు చేపట్టని ప్రభుత్వం
రైతులే స్వచ్ఛందంగా చేపట్టిన పూడిక తీత పనులు
ఈనాడు, బాపట్ల

మిగ్‌జాం తుపాను రైతును తీవ్రంగా నష్టపరిచింది. అయితే ప్రకృతి వల్ల ఎదురైన విపత్తు కొంచెమైతే.. ప్రభుత్వ తప్పిదాలు, నిర్వాకం వల్ల అన్నదాతకు అపార నష్టం ఎదురైంది. జిల్లా పరిధిలో కాల్వలు, డ్రైనేజీలు వాగులు, వంకల నిర్వహణను ప్రభుత్వం విస్మరించింది. ఏమాత్రం వాటి నిర్వహణ బాగున్నా పొలాల్లో పడిన వర్షపు నీళ్లు వెంటనే డ్రెయిన్లు, కాల్వల్లోకి చేరుకుని నీళ్లు నిలబడటానికి ఆస్కారం ఉండేది కాదు. కానీ యంత్రాంగం ఆ పని చేయలేదు. ఈసారి పొలాలు బాగా నీట మునిగి రైతులకు అపారనష్టం సంభవించడానికి కారణామైందని చెప్పొచ్చు. కాల్వలు పటిష్ఠపరచటం, వాగులు, వంకలను ఆధునికీకరించటం, వాటిల్లో దట్టంగా పెరిగిన చెట్లు, పొదలు నరికించి తూటుకాడ తీయించి కాల్వలు, డ్రెయిన్లు సవ్యంగా పారుదలయ్యేలా కనీసం రెండేళ్లకు ఒకసారైనా చర్యలు చేపడితే కాల్వలు, డ్రెయిన్లలో ఇంతగా తూటికాడ తిష్ఠ వేసేది కాదు. చివరకు డ్రెయిన్లలో పడిన నీళ్లే ప్రవహించకుండా అవి అడ్డుపడటంతో చాలా చోట్ల డ్రెయిన్లలో నీళ్లు వెనక్కుతన్నటంతో పొలాల మీద పడి ముంపు ప్రభావం తీవ్రమైందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇది ముమ్మాటికీ సర్కార్‌ వైఫల్యమేనని అంటున్నారు. రైతులు స్వచ్ఛందంగా పూడిక తీత తొలగించే పనులు చేపట్టారు. ప్రభుత్వం ఇకనైనా కాల్వలు, డ్రెయిన్లు, వాగులు, వంకల నిర్వహణ, మరమ్మతులపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఈ ఉదంతం చెబుతోంది.

  • పర్చూరు ప్రాంతంలో పర్చూరు, మొండివాగులు చెట్లు, పొదలుతో నిండిపోయాయి.  అదేవిధంగా కారంచేడు-స్వర్ణ మధ్య కొమ్మమూరు కాల్వ బలహీనంగా ఉండటంతో కాల్వ తెగి పొలాల్లోకి నీళ్లు చేరాయి. దీంతో ఆ ప్రాంతంలో వేల ఎకరాలు మునకకు గురయ్యాయి. నిర్వహణ లేని కాల్వలో నీళ్లు ఉద్ధృతంగా ప్రవహించటంతో స్వర్ణకు సమీపంలో నీళ్ల ఉద్ధృతికి బలహీనంగా ఉన్న కట్టలు తెగిపోయి కాల్వలో నీళ్లు పొలాలపై పడ్డాయి. దీంతో  పంట చేతికిరాదని నష్టపోయినట్లేనని రైతు నాగేశ్వరావు ఆవేదన వ్యకం చేశారు.
  • ఏడేనిమిదేళ్ల తర్వాత పర్చూరు ప్రాంతంలో మొండివాగు ఉద్ధృతంగా ప్రవహించి పొలాలపైకి నీళ్లు మళ్లడం ఇదే ప్రథమమని రైతాంగం అంటోంది. గడిచిన కొన్నేళ్లుగా దీని నిర్వహణ లేకపోవటంతో వాగుల్లో నీళ్లు ప్రవహించటానికి వీల్లేకుండా చెట్లు అడ్డుపడుతున్నాయి. దీని వల్ల వాగులో పారుదల సవ్యంగా లేకుండాపోయింది.
  • చినగంజాం మండలంలో గొనసపూడి డ్రెయినేజీ కాల్వకు గండి పడింది. వరద నీరు డ్రెయిన్‌లోకి ఉద్ధృతంగా వచ్చి చేరుతోంది. తుమ్మమొద్దులు, చెట్లు అడ్డుపడ్డాయి. వాటిని తొలగించకుండా నిర్లక్ష్యం వహించారు. ప్రస్తుతం తుపాను తీవ్రతతో డ్రెయినేజీ కాల్వలోకి నీళ్లు చేరడం అవి పొలాల మీదకు మళ్లడంతో ఆ ప్రాంతంలో సుమారు 500 ఎకరాల్లో వరి వందలాది ఎకరాల్లో సాగవుతున్న వేరుసెనగకు నష్టం వాటిల్లింది. తిరిగి వర్షం కురిస్తే డ్రెయినేజీ కాల్వ పొంగకుండా ఉండటానికి రైతులు డ్రైనేజీ లాకులు ఎత్తేశారు. దీంతో నీళ్లు మురుగుకాల్వలో నుంచి మెల్లగా సముద్రంలోకి చేరేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకున్నారు.  
  • రేపల్లె మండలంలో మురుగు కాల్వలు చాలా ఎక్కువ ఎత్తులో ఉండటంతో పొలాల్లో పడిన వర్షపు నీళ్లు గంటల తరబడి నిల్వ ఉండిపోతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలోని నల్లూరిపాలెం, తుమ్మల, పోటుమెరక, కైతేపల్లి, విశ్వేశ్వరం, సింగుపాలెం పరిధిలో పంటలు నీట మునిగిపోయాయి. ఇక్కడ మురుగుకాల్వలను సరిచేయాలని లేకుంటే అధికవర్షం కురిసినా, తుపాన్లు వచ్చినా తమకు నష్టమే మిగులుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్టిప్రోలు మెయిన్‌ డ్రెయిన్‌ నిర్వహణ సరిగా లేదు. రెండు, మూడేళ్ల నుంచి చెట్లు, కలుపుజాతి మొక్కలు తొలగించలేదు. కాల్వలు బాగు చేయకపోవడంతో పొలాల్లో నుంచి నీళ్లు డ్రెయిన్‌లోకి చేరడం లేదు. తాడిగిరిపాడు, భట్టిప్రోలు, అద్దేపల్లి బాడవ పొలాలు పలుచోట్ల మునకకు గురయ్యాయి. రేపల్లె డ్రెయిన్‌ కింద పెరవలిపాలెం వద్ద పొలాల్లోకి నీళ్లు చేరాయి. ఈ ప్రాంతంలో చిన్న, మధ్యతరహా డ్రెయినేజీ కాల్వలు బాగు చేయకపోవడం వల్లే పొలాల్లోకి నీళ్లు చేరాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


చెరుకుపల్లి పరిధిలో గూడవల్లి పరిసరాల్లో రేపల్లె మెయిన్‌ డ్రెయిన్‌ కట్టలు బలహీనంగా ఉన్నాయి. ఇక్కడ వరదనీటి ఉద్ధృతికి గూడవల్లి రెగ్యులేటర్‌ దిగువన కోత పడి పొలాల్లోకి నీళ్లు వెళుతున్నాయి. గతంలో తిత్లీ, నీలం తుపాన్‌ సమయంలో ఇక్కడ కట్టలు పలుచోట్ల తెగాయి. అప్పట్లో రాజోలు ఊళ్లోకి నీళ్లు వెళ్లాయి. పాంచాలవరం, చావలి, పెరవలి గ్రామాల వాసులు నీళ్లు రాకుండా మురుగునీరు షట్టర్లు దించగా నీళ్లు వెనక్కుతన్ని గూడవల్లి వద్ద తాజాగా జాతీయ రహదారిలోకి ప్రవేశించాయి. గూడవల్లి వద్ద కోతలు పడకుండా కట్ట పటిష్ఠం చేసే చర్యలు తీసుకోకపోవటం వల్ల తాజాగా ఆ ప్రాంతంలో నీళ్లు పొలాల్లోకి చొచ్చుకెళ్లి నీట మునిగాయి. డ్రెయిన్‌లో తూటికాడ, గుర్రపుడెక్క పేరుకుపోయి కూడా ఈ డ్రెయిన్‌ పరిధిలో నీళ్లు వెనక్కితన్ని పొలాల్లోనే నిలబడ్డాయి.


రొంపేరు డ్రెయిన్‌లో పడిన నీళ్లు కారంచేడు గేటు నుంచి వేటపాలెం మీదుగా స్ట్రయిట్‌కట్టలో సముద్రంలోకి వెళతాయి. అయితే దీని పొడవునా జమ్ము, తూటికాడ బాగా విపరీతంగా పెరిగింది. దీని పరిధిలో వేల ఎకరాల్లో పంట నీట మునిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని