logo

అంధకారంలో పల్లెలు.. అందని విద్యుత్తు వెలుగులు

తుపాను ప్రభావంతో జిల్లాలో అనేక చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలుల ధాటికి విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. అనేక చోట్ల చెట్లకొమ్మలు విద్యుత్తు తీగలపై పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Published : 07 Dec 2023 05:28 IST

బాపట్ల (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో జిల్లాలో అనేక చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలుల ధాటికి విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. అనేక చోట్ల చెట్లకొమ్మలు విద్యుత్తు తీగలపై పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. బుధవారం కూడా అనేక ప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు 48 గంటల పాటు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు నిర్వహించామని విద్యుత్తు శాఖాధికారులు అంటున్నారు. జిల్లా కేంద్రం బాపట్ల పట్టణంలో బుధవారం మధ్యాహ్నానికి 20శాతం ప్రాంతానికి సరఫరా లేదు. పల్లెల్లో 30శాతం వరకు విద్యుత్తు సరఫరా అందాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 596 గ్రామాల్లో విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగింది. వీటిలో దాదాపు 180 గ్రామాలకు పైగా విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాల్సి ఉంది. విద్యుత్తు శాఖ లెక్కల ప్రకారం తుపాను వల్ల జిల్లా వ్యాప్తంగా 500 విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. 30కి.మీ మేర విద్యుత్తు తీగలు తెగిపోయాయి. మొత్తంగా 80 ట్రాన్స్‌ఫార్మర్లు పనికి రాకుండా పోయాయి. వీటి స్థానంలో బుధవారం రాత్రికి పూర్తిగా కొత్తవాటిని ఏర్పాటు చేసి గురువారం నాటికి జిల్లా వ్యాప్తంగా ఒక్క గ్రామం కూడా చీకట్లో లేకుండా విద్యుత్తు సరఫరా చేస్తామని విద్యుత్తు శాఖ ఈఈ ఆంజనేయులు తెలిపారు. చెరుకుపల్లి మండలలో గుళ్లపల్లి, పొన్నపల్లి, ఆరేపల్లి ప్రాంతాల్లో సరఫరా పునరుద్ధరించినా హెచ్చుతగ్గుల వల్ల తరచూ అంతరాయం కలిగింది. బలుసులపాలెం, తుమ్మలపాలెం, మోరవాగుపాలెంలో పూర్తిగా అంధకారం నెలకొంది. శివారు గ్రామాలు, కాలనీలు మొత్తం జిల్లా వ్యాప్తంగా 95చోట్ల విద్యుత్తు సరఫరా లేక చీకట్లోనే ఉన్నాయి. ప్రజలు దోమలు, పాములతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని