logo

Amaravati: బాబోయ్‌.. సీఎం వస్తున్నారు!

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సభలు నిర్వహిస్తున్నారంటే ప్రజలకు కష్టాలు తప్పడం లేదు.

Updated : 23 Feb 2024 11:01 IST

జనం తరలింపునకు  ఆర్టీసీ బస్సులు
తామెలా ప్రయాణించాలని జనం గగ్గోలు

ఈనాడు- అమరావతి, పట్నంబజార్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సభలు నిర్వహిస్తున్నారంటే ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. సీఎం ఎక్కడ సభలు నిర్వహించినా జనాన్ని తరలించడానికి పరిసర జిల్లాల్లోని ఆర్టీసీ బస్సులు కేటాయిస్తుండటంతో ఆయా మార్గాల్లో తగినన్ని బస్సులు లేక ప్రయాణికులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు సీఎం సభకు ఆర్టీసీ యంత్రాంగం కేటాయించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 800 బస్సులు ఉండగా 239 బస్సులు సీఎం సభకు వెళుతున్నాయి. ఒంగోలు శివారులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ సభకు జనాన్ని తరలించడానికి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి గురువారం రాత్రి నుంచి బస్సులు ప్రకాశం జిల్లాలో డీఆర్‌డీఏ, మెప్మా కేటాయించిన గ్రామాలకు వెళ్లాయి. దీంతో శుక్రవారం 239 బస్సులు ఆయా మార్గాల్లో నడపలేని పరిస్థితి. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ఎంపిక చేసుకున్న మార్గాల్లో బస్సు సర్వీసులు తగ్గించి నడపడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే తక్కువ బస్సులతో నెట్టుకొస్తున్న ఆర్టీసీ తరచూ సీఎం సభలకు బస్సులు కేటాయించాల్సి రావడంతో ప్రయాణికులకు పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నారు.

బస్సులు లేక అవస్థలు

ఆర్టీసీ బస్సుల్లో రోజువారీగా వివిధ ప్రాంతాల నుంచి నగరాలు, సమీప పట్టణాలకు వచ్చి పనులు చేసుకునేవారు ఎక్కువగా ప్రయాణిస్తారు. పల్లెవాసులకు ఆర్టీసీ బస్సులే గ్రామాల నుంచి పట్టణాలకు రాకపోకలకు రవాణా సౌకర్యం. సొంత వాహనాలు లేని వారికి ఆర్టీసీ బస్సులే ఆధారం. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఎక్కువగా జిల్లా కేంద్రం నుంచి మండలాలు, గ్రామాలకు రాకపోకలు సాగిస్తాయి. ఆయా మార్గాల్లో ఈ సర్వీసులను తగ్గించడం వల్ల సకాలంలో బస్సులు లేక ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. గుంటూరు నగరంతోపాటు నరసరావుపేట, తెనాలి, బాపట్ల వంటి పట్టణాలకు కళాశాలలు, పాఠశాలలకు ఆర్టీసీ బస్సుల్లో వచ్చే విద్యార్థులకు బస్సుల సంఖ్య తగ్గించడంతో ఇరుక్కుని రద్దీగా ప్రయాణించాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని