logo

ఎయిమ్స్‌లో ఏర్పాట్ల పరిశీలన

మంగళగిరి ఎయిమ్స్‌ ఆసుపత్రిని ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ రాజ్‌కోట్‌ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేయనున్న సందర్భంగా ఏర్పాట్లు పక్కాగా చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అన్నారు.

Published : 25 Feb 2024 05:08 IST

ఈనాడు-అమరావతి: మంగళగిరి ఎయిమ్స్‌ ఆసుపత్రిని ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ రాజ్‌కోట్‌ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేయనున్న సందర్భంగా ఏర్పాట్లు పక్కాగా చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అన్నారు.  ఈ మేరకు ఆయన శనివారం  వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, గుంటూరు జిల్లా యంత్రాంగం, పోలీసులతో కలిసి ఎయిమ్స్‌ను సందర్శించారు. తొలుత స్థానికంగా ఉన్న పరిపాలనా భవనంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు కృషి చేయాలని అది ముగిసేవరకు ఉన్నతాధికారులు అందరూ అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం సభావేదికను ఆయన పరిశీలించారు. గుంటూరు, విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలల నుంచి విద్యార్థులను పిలిపించటానికి బస్సులు సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులు, ఆహ్వానితులు నిర్దేశిత సమయం కన్నా చాలా ముందుగా సభా ప్రాంగణానికి చేరుకునేలా చూడాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.  ఇద్దరు కేంద్రమంత్రులు, రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానుండడంతో వారికి ప్రత్యేక కాన్వాయ్‌ సిద్ధం చేశారు.  బందోబస్తు నిర్వహణకు పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, డాక్టర్‌ భారతీ ప్రవీణ్‌ పవార్‌, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తదితరులు పాల్గొంటారని తెలిపారు. సమీక్షలో ఏపీఎంఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, కమిషనర్‌ జె.నివాస్‌, కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ డైరెక్టర్‌ నిధి కేసర్వాని, ఎయిమ్స్‌ మంగళగిరి డైరెక్టర్‌ డాక్టర్‌ మధబానందకర్‌, డాక్టర్‌ దుంపల వెంకట రవికిరణ్‌, కల్నల్‌ శశికాంత్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వినీత్‌ థామస్‌, ఇతర వైద్య, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని