logo

కలుషిత నీరే అస్వస్థతకు కారణం

కలుషిత తాగునీరు జిల్లాను వణికిస్తోంది. ఇటీవల గుంటూరు నగరంలో అపరిశుభ్ర నీరు తాగి అతిసారం లక్షణాలతో ముగ్గురు చనిపోయిన సంఘటన కలకలం రేపింది. తాజాగా తెనాలి పట్టణం గురవయ్య కాలనీలోని పలు వీధులలోని కుళాయిల ద్వారా సరఫరా...

Published : 25 Feb 2024 05:15 IST

గురవయ్య కాలనీ వాసుల ఆవేదన

స్థానిక మహిళతో మాట్లాడుతున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో అన్నపూర్ణ, వైద్యసిబ్బంది

తెనాలి(కొత్తపేట): కలుషిత తాగునీరు జిల్లాను వణికిస్తోంది. ఇటీవల గుంటూరు నగరంలో అపరిశుభ్ర నీరు తాగి అతిసారం లక్షణాలతో ముగ్గురు చనిపోయిన సంఘటన కలకలం రేపింది. తాజాగా తెనాలి పట్టణం గురవయ్య కాలనీలోని పలు వీధులలోని కుళాయిల ద్వారా సరఫరా అయిన కలుషిత నీరు తాగి ఒకరు మృత్యువాత పడ్డారని, కొందరు చికిత్స పొందుతున్నారని కాలనీ వాసులు వాపోతున్నారు. ఈ నెల 15 నుంచి 23వ తేదీల మధ్య కుళాయి నీరు రంగుమారి ఉండడం, మురుగు వాసన వస్తుండడంతో కాచి తాగుతున్నామన్నారు. వాటినే తాగిన 50 ఏళ్లు దాటిన వారు, 15 ఏళ్ల లోపు పిల్లలకు వాంతులు, విరేచనాలు కావడంతో తెనాలి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్తే మెరుగైన వైద్యం కోసం గుంటూరు సర్వజనాసుపత్రికి తీసుకెళ్లమన్నారని, అక్కడ ఓ మహిళ మృతి చెందారని, మరి కొందరు చికిత్స పొందుతుండగా, ఇంకొందరిని డిశ్ఛార్జి చేశారని బాధితుల బంధువులు తెలిపారు. పాలకులు, మున్సిపల్‌ అధికారులు కలుషితం కాని నీటిని సరఫరా చేసి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు. కలుషిత నీరు తాగి ఇబ్బంది పడిన బాధితులు మొత్తం 15 మంది పైనే ఉన్నారు. ఈ కాలనీలో ఎక్కువ మంది పేదలే నివాసం ఉంటున్నారు. పట్టణంలో రెండుపూటలా కుళాయిలకు నీరిస్తున్నా ఇక్కడ ఒక పూటలో గంట మాత్రమే పంపిణీ చేస్తున్నారు. మృతి చెందిన వృద్ధురాలు బండి లక్ష్మి అనే మహిళ విరేచనాలవుతున్నాయని ఆసుపత్రిలో చేరగా చికిత్స అందించామని, ఆమెకు రక్తపోటు నియంత్రణ కాకపోవడంతో గుంటూరు సర్వజనాసుపత్రికి రిఫర్‌ చేశామని  తెనాలి ప్రభుత్వాసుపత్రి డాక్టర్‌ శ్రీకాంత్‌ తెలిపారు. కాగా, మున్సిపల్‌ కమిషనర్‌ బి.శేషన్న పలువురు అధికారులు, వార్డు కౌన్సిలర్‌ తదితరులు శనివారం కాలనీలో పర్యటించారు. బాధితుల ఇళ్ల వద్ద కుళాయిల ద్వారా పంపిణీ చేసిన నీటిని పరిశీలించారు.


డిప్యూటీ డీఎంహెచ్‌వో పర్యటన..

పట్టణంలో డయేరియా బాధితులు ఎవరైనా ఉంటే గుర్తించి వైద్య సేవలందించటానికి వైద్య బృందం సర్వే చేపట్టిందని తెనాలి డివిజన్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో ఈ.అన్నపూర్ణ తెలిపారు. ఆమె శనివారం గురవయ్య కాలనీలో ఆమె పర్యటించి బాధిత కుటుంబాల సభ్యులు, స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రంగుమారిన నీటిని అందించారని పలువురు ఆమె వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఇప్పటికీ విరేచనాలతో బాధపడేవారుంటే కల్చర్‌ తదితర పరీక్షలు చేయాలని సిబ్బందికి సూచించామన్నారు. మున్సిపాలిటీ వారు పరీక్షల కోసం తాగునీటి నమూనాలు సేకరించారన్నారు.


కలుషితనీరే కాటేసింది..
- బండి శివ, స్థానికురాలు

మా అత్త బండి లక్ష్మి సామాజిక పింఛన్‌దారు. ఇటీవల మురుగు వాసన వచ్చిన నీటిని తాగి అస్వస్థతకు గురైంది. విరేచనాలతో ఇబ్బంది పడుతుండడంతో జిల్లా ఆసుపత్రిలో చేర్చాం. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమెను కలుషిత నీరే కాటేసింది.


బోరు నీరు తాగుతున్నాం..
- అరుంధతి

ఇటీవల కుళాయిలలో వచ్చిన రంగుమారిన నీటిని తీసుకోవడంతో మా వారికి, నాకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే ప్రైవేటు వైద్యుడిని సంప్రదించాం. పరీక్షలు చేసి కలుషిత నీరు, ఆహారాలే కారణమని చెప్పారు. అప్పటి నుంచి బోరు వాటర్‌ తీసుకుంటున్నాం.


అక్క, అమ్మమ్మకు అస్వస్థత
- బాలకృష్ణ

అక్క అంజన, అమ్మమ్మ అనసూయమ్మలు కలుషిత కుళాయి నీరు తాగి వాంతులు, విరేచనాలతో బాధపడుతుంటే తెనాలి దవాఖానాకు తీసుకెళ్లాం. వారి సూచన మేరకు జీజీహెచ్‌లో చేర్చాం. అక్క కోలుకోగా.. అమ్మమ్మ చికిత్స పొందుతోంది. పాలకులు రక్షిత మంచి నీటిని కూడా పంపిణీ చేయలేకపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని