logo

పరిశీలన.. తనిఖీల పేరుతో వసూళ్లు!

పాఠశాలల తనిఖీలు.. పరిశీలన పేరుతో వెళుతున్న విద్యాశాఖ అధికారి ఒకరు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల్ని ఇబ్బంది పెడుతున్నారు. పరిశీలన ముగిసిన అనంతరం కవర్‌ చేతిలో పెట్టాలని వసూళ్లకు పాల్పడుతున్నారు.

Published : 25 Feb 2024 05:17 IST

విద్యాశాఖ అధికారిపై కమిషనర్‌కు ఫిర్యాదులు

ఈనాడు-అమరావతి: పాఠశాలల తనిఖీలు.. పరిశీలన పేరుతో వెళుతున్న విద్యాశాఖ అధికారి ఒకరు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల్ని ఇబ్బంది పెడుతున్నారు. పరిశీలన ముగిసిన అనంతరం కవర్‌ చేతిలో పెట్టాలని వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ  విషయమై పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. స్పందించిన ఉన్నతాధికారులు గుంటూరు ఆర్జేడీ, డీఈఓలతో విచారణ చేయిస్తున్నారు. ఈ పరిణామం విద్యాశాఖ, ఉపాధ్యాయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

కవర్‌ ఇవ్వాలంటూ.. గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న విద్యాశాఖ అధికారి ఒకరు తనిఖీలు, పరిశీలన పేరుతో స్కూళ్లకు వెళుతూ అక్కడ ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలను మంచి భోజనం పెట్టాలని, వెళ్లేటప్పుడు కవర్‌ ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక పాఠశాలలో తనిఖీలకు వెళ్లినప్పుడు మంచి భోజనం పెట్టి కవర్‌ ఇవ్వలేదు. దీంతో ఆ పాఠశాలకు తనిఖీలు ముగిసిన తర్వాత వెంటనే మరోసారి పరిశీలనకు వెళ్లారు. దీంతో అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు కొంత ముట్టజెబితే తీసుకుని అక్కడి నుంచి వెనుదిరిగినట్లు తెలిసింది.స్కూళ్లకు వెళ్లి ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో ఉన్న బోధనాపరమైన లోపాలు, పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించి ఆ లోపాలను అధిగమించేలా రిమార్క్స్‌ ఇవ్వాలి. ఆ అధికారి పరిశీలనలో ఇవేం ఉండవని , నిబంధనల మేరకు ఇన్‌స్పెక్షన్లు జరగడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో వారు స్పందించి విచారణకు ఆదేశించడంతో ఈ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఆర్జేడీ లింగేశ్వరరెడ్డిని వివరణ కోరగా కమిషనర్‌ ఆదేశాల మేరకు రోజుకు కొందరు హెచ్‌ఎంలను పిలిచి మాట్లాడుతున్నాం.  ఇంకా కొందర్ని విచారించాల్సి ఉంది. పూర్తి వివరాలతో కమిషనర్‌కు విచారణ నివేదిక పంపుతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని