logo

విద్యార్థులపై ఉపాధ్యాయుడి దాష్టీకం

వీపంతా ఎర్రగా వాతలు పడేలా కొట్టేంత తప్పు మా పిల్లలు ఏం చేశారంటూ సంజీయ్యనగర్‌ పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు శనివారం సాయంత్రం ఆందోళనకు దిగారు.

Published : 25 Feb 2024 05:20 IST

వాతలు తేలేలా దెబ్బలు.. తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన

సుకన్యరాజ్‌కు వీపుపై వాతలు

నగరపాలకసంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే:  వీపంతా ఎర్రగా వాతలు పడేలా కొట్టేంత తప్పు మా పిల్లలు ఏం చేశారంటూ సంజీయ్యనగర్‌ పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు శనివారం సాయంత్రం ఆందోళనకు దిగారు. ఒకటో తరగతి చదువుతున్న సుకన్యరాజ్‌, జోసఫ్‌రాజ్‌ అనే విద్యార్థులను ఉపాధ్యాయుడు పి.లక్ష్మీనారాయణ మధ్యాహ్నం వీపుపై వాతలు పొంగేలా కొట్టారు. విద్యార్థులిద్దరూ అన్నదమ్ముల పిల్లలు. ఇళ్లకు వెళ్లిన తర్వాత పిల్లలకు జ్వరం వచ్చింది.

పాఠశాల వద్ద ఉపాధ్యాయులను నిలదీస్తున్న విద్యార్థుల బంధువులు

వారి నాయనమ్మ పిల్లలను పిలిచి కారణం అడగడంతో ఉపాధ్యాయుడు కొట్టిన విషయం చెప్పారు. వెంటనే ఆమె పిల్లల వీపుపై పొంగిన వాతలు చూసి కంగారుపడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పాఠశాలకు వద్దకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడు ప్రభూజీని కలిసి వివరణ కోరారు. కొట్టిన ఉపాధ్యాయుడు అప్పటికే ఇంటికి వెళ్లి పోవడంతో పిలిపించాలంటూ ఆందోళనకు దిగారు. గంటన్నర తర్వాత వచ్చిన ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణపై విద్యార్థుల బంధువులు, స్థానికులు ఆగ్రహంతో దాడికి యత్నించడంతో ఇతర ఉపాధ్యాయులు పక్కకు లాక్కొని వెళ్లారు. తాను చేసింది తప్పేనని,  విద్యార్థులు తరగతి గదిలో బూతులు మాట్లాడుతుండడంతో కొట్టానని, ఇంతలా వాతలు పొంగుతాయని అనుకోలేదని ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ ఆందోళనదారులకు చెప్పినా వినిపించుకోలేదు. సాయంత్రం 5.50 గంటలకు ప్రారంభమైన ఆందోళన రాత్రి 7.30 గంటల వరకు సాగింది. విషయం తెలుసుకున్న ఎంఈవో వెంకటేశ్వర్లు ప్రధానోపాధ్యాయుడికి ఫోన్‌ చేసి తల్లిదండ్రులు ఆందోళన విరమించేలా నచ్చజెప్పాలని సూచించారు. ఘటనపై డీఈవో శైలజ దృష్టికి తీసుకెళతానని ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. కొట్టిన ఉపాధ్యాయుడిని పిలిచి విచారించిన తర్వాత చర్యలు తీసుకుంటామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని