logo

సమరోత్సాహం

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో దిగనున్న అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధిష్ఠానం శనివారం ప్రకటించింది. తెదేపా-జనసేన పొత్తులో భాగంగా తొలి విడతలో జిల్లాలో ఏడు స్థానాలకు నాలుగుచోట్ల పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం తొణికిసలాడుతోంది.

Published : 25 Feb 2024 05:33 IST

జిల్లాలో నాలుగు స్థానాలకు తెదేపా అభ్యర్థిత్వాలు ఖరారు
మిఠాయిలు పంచి సంబరాలు  చేసుకున్న తెలుగు తమ్ముళ్లు
పెండింగ్‌లో నరసరావుపేట, పెదకూరపాడు, గురజాల స్థానాలు
ఈనాడు, నరసరావుపేట

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో దిగనున్న అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధిష్ఠానం శనివారం ప్రకటించింది. తెదేపా-జనసేన పొత్తులో భాగంగా తొలి విడతలో జిల్లాలో ఏడు స్థానాలకు నాలుగుచోట్ల పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. నాలుగు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలోనే ప్రకటించడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బరిలో దిగనున్న అభ్యర్థులకు మద్దతుగా నియోజకవర్గాల్లో పెద్దఎత్తున తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రే తొలి జాబితాను శనివారం ఉదయం విడుదల చేస్తామని పార్టీ అధిష్ఠానం ప్రకటించంది. దీంతో ఆయా నియోజకవర్గాల నుంచి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు శనివారం ఉదయం కల్లా ఆశావహుల ఇళ్లు, కార్యాలయాలకు చేరుకోవడంతో నేతల ఇళ్లు, కార్యాలయాల్లో తెలుగు తమ్ముళ్లతో సందడి నెలకొంది. పార్టీ జాబితా  ప్రకటించగానే మొదటి విడతలోనే తమ నాయకుడికి టిక్కెట్‌ ఖరారు చేశారని పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలియజేసి అభ్యర్థులకు అభినందనలు, శుభాకాంక్షలు చెప్పడం కనిపించింది.

సత్తెనపల్లి: కన్నా సమక్షంలో తెదేపాలో చేరికలు

ల్నాడు జిల్లాలో నాలుగు సీట్లకు అభ్యర్థులను తొలిజాబితాలో ప్రకటించారు. సత్తెనపల్లి నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఆయన పెదకూరపాడు నుంచి నాలుగుసార్లు, గుంటూరు పశ్చిమ నుంచి ఒకసారి కలిపి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విజభన నేపథ్యంలో 2014లో గుంటూరు పశ్చిమ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం భాజపాలో చేరి 2019లో నరసరావుపేట పార్లమెంటు నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఏడాది కిందటే ఆయన తెదేపాలో చేరారు. ఇప్పుడు సత్తెనపల్లి నుంచి తెదేపా తరఫున బరిలోకి దిగారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న కొన్ని ప్రాంతాలు సత్తెనపల్లిలో కలవడం, పొరుగు నియోజకవర్గం కావడంతో పరిచయాలు ఉండటం, ఇప్పటికే నియోజకవర్గం కలియతిరగడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. దీంతో ఆయన విజయం సాధిస్తానన్న ధీమాతో ఉన్నారు.

మాచర్ల: బస్టాండ్‌ కూడలిలో బాణసంచా కాలుస్తున్న నేతలు

పల్నాడు జిల్లాలో నరసరావుపేట, గురజాల, పెదకూరపాడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇక్కడి నుంచి కొందరు నేతలు తెదేపాలో చేరే అవకాశం ఉన్నందున వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేయనున్నారని తెదేపా వర్గాలు తెలిపాయి. గురజాల నియోజకవర్గంలో సీనియర్‌ నేత యరపతినేని శ్రీనివాసరావు, పెదకూరపాడుకు కొమ్మాలపాటి శ్రీధర్‌, నరసరావుపేటకు చదలవాడ అరవిందబాబు ఇన్‌ఛార్జిలుగా ఉన్నారు.

సత్తెనపల్లి పట్టణంలో తెదేపా శ్రేణుల సందడి


వినుకొండ నుంచి పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జీవీ ఆంజనేయులు పోటీ చేస్తున్నారు. ఆయన 2009, 2014లో  గెలవగా 2019లో ఓడిపోయారు. నాలుగోసారి ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా పని చేస్తున్నారు.

వినుకొండ: తెదేపాలో చేరిన వారితో జీవీ ఆంజనేయులు


చిలకలూరిపేట నుంచి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వరుసగా ఆరోసారి పోటీకి దిగుతున్నారు. చిలకలూరిపేట నుంచి 1999, 2009, 2014లో గెలుపొందగా 2004, 2019లో స్వల్పతేడాతో ఓడిపోయారు. ఈసారి గెలుపు ధీమాతో బరిలోకి దిగుతున్నారు.


ఫ్యాక్షన్‌ గొడవలకు కేంద్రమైన మాచర్ల నుంచి జూలకంటి బ్రహ్మారెడ్డికి టికెట్‌ దక్కింది. 2004, 2009 ఎన్నికల్లో ఓడిన ఆయన ఈసారి గెలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి దీటైన అభ్యర్థిగా బ్రహ్మారెడ్డి ప్రజల్లోనే ఉంటున్నారు.

మాచర్లలో మాట్లాడుతున్న జూలకంటి బ్రహ్మారెడ్డి


కలిసి ముందుకు సాగుతాం

తెదేపా-జనసేన కూటమి తొలి జాబితా జిల్లాలోని ఇరుపార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఏ సీటు ఏ పార్టీకి వస్తుంది... అభ్యర్థులు ఎవరని ఇన్నాళ్లూ సందిగ్ధంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు ఇప్పుడు స్పష్టత వచ్చింది. సామాజిక సమీకరణలు, సీనియారిటీ, ప్రజాదరణ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక జరగడంతో నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైకాపాను మట్టి కరిపించేందుకు సమరోత్సాహంతో ఇరుపార్టీలు కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రెండు పార్టీలు సఖ్యతతో మెలగటం, ఒకరికొకరు సహకారం అందించుకోవడం ద్వారా పొత్తును గెలుపుతీరాలకు చేర్చాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయా అభ్యర్థులను కలిసి తామంతా కలిసికట్టుగా పని చేసి విజయం సాధించడంలో వెన్నంటి ఉంటామని చెబుతున్నారు. అభ్యర్థులకు అభినందనలు చెబుతూ వారి విజయానికి శక్తివంచన లేకుండా పని చేస్తామని ప్రకటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని