logo

నవ చరితకు నవోదయం

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో తెదేపా-జనసేన తొలి జాబితాలో 9 శాసనసభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. తెనాలి నుంచి జనసేన తరఫున ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ బరిలోకి దిగుతున్నారు. మిగిలిన 8 స్థానాల్లో తెదేపా అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Updated : 25 Feb 2024 06:43 IST

గుంటూరు, పల్నాడులో 9 సీట్లకు అభ్యర్థుల ఖరారు
న్యూస్‌టుడే, మంగళగిరి, తెనాలి, తాడికొండ, పొన్నూరు, ప్రత్తిపాడు

మంగళగిరి : నారా లోకేశ్‌ అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో పట్టణంలోని  అంబేడ్కర్‌ విగ్రహం కూడలిలో బాణసంచా కాలుస్తున్న తెదేపా శ్రేణులు

ఈనాడు-అమరావతి: గుంటూరు, పల్నాడు జిల్లాల్లో తెదేపా-జనసేన తొలి జాబితాలో 9 శాసనసభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. తెనాలి నుంచి జనసేన తరఫున ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ బరిలోకి దిగుతున్నారు. మిగిలిన 8 స్థానాల్లో తెదేపా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సత్తెనపల్లి నుంచి సీనియర్‌ నేత కన్నా లక్ష్మీనారాయణ, మంగళగిరి నుంచి తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌, చిలకలూరిపేట నుంచి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పొన్నూరు నుంచి సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, తాడికొండ నుంచి తెనాలి శ్రావణ్‌కుమార్‌, ప్రత్తిపాడు నుంచి మాజీ ఐఏఎస్‌ అధికారి బూర్ల రామాంజనేయులు, వినుకొండ నుంచి పల్నాడు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాచర్ల నుంచి జూలకంటి బ్రహ్మారెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగానే అనుచరులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.  టికెట్‌ దక్కిన అభ్యర్థులు విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మంగళగిరిలో సత్తా చాటేలా.. తెదేపా యువనేత నారా లోకేశ్‌ మంగళగిరి నుంచి బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ ఓడిన లోకేశ్‌ మరోసారి మంగళగిరి గడ్డపైనే పోటీచేస్తూ వైకాపాకు బదులిచ్చేందుకు సిద్ధమయ్యారు. పాదయాత్రతో పెరిగిన గ్రాఫ్‌, యువతలో క్రేజ్‌, మంగళగిరిలో చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, తటస్థులను కలుస్తూ ప్రజల్లో తిరగడం లోకేశ్‌కు సానుకూల అంశాలు.
ఊహించినట్లే.. తెనాలి నుంచి జనసేన తరఫున నాదెండ్ల మనోహర్‌ పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు ఈ సీటు వెళ్తుందని ముందు నుంచి అందరూ భావించారు. ఈ మేరకు ఇక్కడ తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు కాకుండా జనసేనకు ఇవ్వాల్సి వచ్చింది.

పాదయాత్ర కలిసొచ్చిన అంశం.. కీలకమైన రాజధాని అమరావతి ప్రాంతం ఉన్న తాడికొండ నుంచి తెనాలి శ్రావణ్‌కుమార్‌ పోటీ చేస్తున్నారు. ఈసారి ఇక్కడి నుంచి గెలిచి రాజధాని అమరావతి వ్యతిరేకులకు గుణపాఠం చెప్పాలని శ్రావణ్‌కుమార్‌ ప్రతిన బూనారు. నియోజకవర్గంలో పాదయాత్ర చేయడంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశాలు.

గెలుపు ధీమాతో.. పొన్నూరు నుంచి సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ఏడోసారి బరిలోకి దిగుతున్నారు. 1994 నుంచి వరుసగా ఐదుసార్లు గెలుపొంది 2019లో ఓటమిపాలయ్యారు. ఈసారి గెలుపు తనదేనన్న ధీమాతో ఆయన ఉన్నారు. పార్టీ కార్యక్రమాలతోపాటు పాదయాత్ర చేయడం, ప్రజాసమస్యలపై గళమెత్తి పోరాడుతూ ప్రజల్లో ఉండడం ఆయనకు సానుకూల అంశాలు.

కలెక్టర్‌గా అనుభవం..  ప్రత్తిపాడు నుంచి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బూర్ల రామాంజనేయులు పోటీ చేస్తున్నారు. ఇదే జిల్లాలో గతంలో కలెక్టర్‌గా చేయడం, కొన్నాళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూ అందరిని కలుపుకుని వెళ్లడం ఆయనకు కలిసొచ్చాయి.

గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు స్థానాల్లో ఎవరిని ప్రకటిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. జనసేన, బీజేపీతో పొత్తుల కారణంగా ఈ సీట్ల విషయంలో స్పష్టత రాలేదని ఆపార్టీ వర్గాలు తెలిపాయి.


మంగళగిరి

 • అభ్యర్థి:  నారా లోకేశ్‌ (41) ఎంబీఏ
 • భార్య నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌
 • వ్యాపారం

ప్రస్తుతం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2014-19 వరకు తెదేపా ప్రభుత్వంలో ఐటీ, పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో మంగళగిరి నుంచి తెదేపా తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.


తెనాలి

 • నాదెండ్ల మనోహర్‌ (59), ఎంబీఏ
 • భార్య (డాక్టర్‌ మనోహరం), ఇద్దరు పిల్లలు
 • రాజకీయాలు

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. 2004, 2009 ఎన్నికలలో తెనాలి నుంచి కాంగ్రెస్‌ తరఫున రెండుసార్లు గెలిచారు. ఉమ్మడి తెలుగు రాష్ట్ర ఉప సభాపతిగా 2009 జూన్‌ 9న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత  2011జూన్‌ 4,న సభాపతిగా బాధ్యతలు సీˆ్వకరించారు. 2014 ఎన్నికల్లో మూడోసారి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.


తాడికొండ

 • తెనాలి శ్రావణ్‌కుమార్‌ (60) ఎంఏ, ఎంఎస్సీ
 • భార్య మాధవీలత (ప్రభుత్వ ఉద్యోగిని), ఇద్దరు పిల్లలు
 • రాజకీయాలు

2009లో తెదేపా తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2014లో తెదేపా తరఫున పోటీ చేసి గెలుపొందగా.. 2019లో ఓటమి పాలయ్యారు.


పొన్నూరు

 • ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ (58) బీటెక్‌
 • భార్య జ్యోతిర్మయి, ఇద్దరు పిల్లలు
 • వ్యాపారం.

1994లో సంగం డెయిరీ ఛైర్మన్‌గా ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ బాధ్యతలు చేపట్టారు. మొట్టమొదటిసారిగా 1994లో తెదేపా నుంచి శాసనసభకు పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి వరుసగా 1999, 2004, 2009, 2014లో వరుసగా అయిదుసార్లు విజయం సాధించారు. 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రెండుసార్లు, ఒకసారి రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ విప్‌గా పనిచేశారు.


ప్రత్తిపాడు

 • బూర్ల రామాంజనేయులు (65)రిటైర్డ్‌ ఐఏఎస్‌
 • భార్య జయమ్మ, పిల్లలు ముగ్గురు

2019లో ఫిబ్రవరిలో ఐఎఎస్‌గా పదవీ విరమణ పొందారు. 2019లో కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.  2023 సెప్టెంబరులో ప్రత్తిపాడు నియోజక వర్గ సమన్వయ కర్తగా నియమించారు.


పల్నాడు యుద్ధానికి సిద్ధం  

పల్నాడు జిల్లాలో నాలుగు సీట్లకు అభ్యర్థులను తొలిజాబితాలో ప్రకటించారు. సత్తెనపల్లి నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఆయన పెదకూరపాడు నుంచి నాలుగుసార్లు, గుంటూరు పశ్చిమ నుంచి ఒకసారి కలిపి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో గుంటూరు పశ్చిమ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం భాజపాలో చేరి 2019లో నరసరావుపేట పార్లమెంటు నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఏడాది కిందటే ఆయన తెదేపాలో చేరారు.  

 • చిలకలూరిపేట నుంచి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వరుసగా ఆరోసారి పోటీకి దిగుతున్నారు. చిలకలూరిపేట నుంచి 1999, 2009, 2014లో గెలుపొందగా 2004, 2019లో స్వల్పతేడాతో ఓడిపోయారు. ఈసారి గెలుపు ధీమాతో బరిలోకి దిగుతున్నారు.
 • ఫ్యాక్షన్‌ గొడవలకు కేంద్రమైన మాచర్ల నుంచి జూలకంటి బ్రహ్మారెడ్డికి టికెట్‌ దక్కింది. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ఈసారి గెలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి దీటైన అభ్యర్థిగా బ్రహ్మారెడ్డి ప్రజల్లోనే ఉంటున్నారు.
 • వినుకొండ నుంచి పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జీవీ ఆంజనేయులు పోటీచేస్తున్నారు.
 • పల్నాడు జిల్లాలో నరసరావుపేట, గురజాల, పెదకూరపాడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని