logo

Crime News: గ్రాము బంగారం రూ.100.. నామమాత్రపు రుసుంకే అందిస్తామంటూ మోసం

గ్రాము బంగారం రూ.100లు. రూ.10లకే కిలో కందిపప్పు, వంటనూనె. ఇలా అనేక వస్తువులు నామమాత్రపు రుసుంకే అందిస్తామంటూ ఓ సంస్థ తమను మోసం చేసిందంటూ బాధితులు వాపోయారు.

Updated : 27 Feb 2024 07:58 IST

రూ.10కే కిలో కందిపప్పు, వంటనూనె
మోసంపై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు

నమ్మించడానికి ముందు ఇచ్చిన గ్రాము బంగారం

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: గ్రాము బంగారం రూ.100లు. రూ.10లకే కిలో కందిపప్పు, వంటనూనె. ఇలా అనేక వస్తువులు నామమాత్రపు రుసుంకే అందిస్తామంటూ ఓ సంస్థ తమను మోసం చేసిందంటూ బాధితులు వాపోయారు. సుమారు 300మంది వద్ద దాదాపుగా రూ.3 కోట్లు వసూలు చేసుకున్నారంటూ గుంటూరు, తెనాలి, ప్రత్తిపాడు తదితర ప్రాంతాలకు చెందిన బాధితులు విజయలక్ష్మి, పద్మ, నాగలక్ష్మి, గుల్హాన్‌, షమీ, గోపి, మోహన్‌ సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ తుషార్‌ దూడి ప్రత్యేక విచారణకు ఆదేశించారు. అనంతరం బాధితులు విలేకరులతో వివరాలు తెలిపారు. అవి వారి మాటల్లోనే...

ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు

ప్రజా సేవా ఛారిటబుల్‌ ట్రస్టు పేరుతో టోకరా

శ్రీనివాసరావు, అనంతలక్ష్మి, నిర్మల్‌ అనే వ్యక్తులు ప్రజా సేవా ఛారిటబుల్‌ ట్రస్టు పేరుతో హోమ్‌నీడ్స్‌, బంగారం, ఎలక్ట్రానిక్‌ తదితర వస్తువులు నామమాత్రపు రుసుంకే అందిస్తామన్నారు. మంగళదాస్‌నగర్‌లో దుకాణం పెట్టి రూ.10లకే కిలో కందిపప్పు, వంటనూనె ఇస్తామంటూ ఆమేరకు ముగ్గురు, నలుగురికి ఇచ్చారు. తమ సంస్థలో రూ.300 కట్టి సభ్యత్వం తీసుకుంటే నిత్యావసర వస్తువులు మూడుసార్లు, రూ.1000 కడితే ఎన్ని పెట్టెలైనా తీసుకోవచ్చని డబ్బులు కట్టించుకొని ఒకరిద్దరికి ఇచ్చారు. తర్వాత రూ.100కు గ్రాము బంగారం అని ఒకరిద్దరికి ఇచ్చారు. రూ.1500 కడితే 10 గ్రాముల బంగారం అనగానే, ఒక్కసారిగా వందలాది మంది రావడంతో రూ.15 వేలకు నాలుగు గ్రాములు, రూ.24 వేలకు 10 గ్రాముల బంగారం అని డబ్బులు కట్టించుకున్నారు. ఇంకా టీవీ రూ.5 వేలు, ఫ్రిజ్‌ రూ.3,500లు, వాషింగ్‌మిషన్‌ రూ.5 వేలు, డబుల్‌కాట్‌ మంచం రూ.7 వేలు, ఏసీ రూ.20 వేలు అంటూ మాయచేసి కట్టించుకున్నారు. తమ ట్రస్టు వెనక ప్రజాప్రతినిధులు, వారి భార్యలు ఉన్నారని, ట్రస్టుకు వచ్చే వస్తువులు పేదలకు నామమాత్రపు రుసుంకే ఇస్తున్నామని నమ్మబలికారు. కందిపప్పు, బంగారం, ఫ్రిజ్‌, టీవీ తదితర వస్తువులకు ధర ఒకరోజు చెప్పిననట్టు, రెండోరోజు ఉండదు. అదేమంటే ఆ రోజు ధర అంతే, ఇష్టముంటే డబ్బులు కట్టండి అనేవారు. వందలాది మంది నుంచి ఫోన్‌పే రూపంలోనూ. కొంతమంది వద్ద నేరుగా నగదు తీసుకున్నారు. తర్వాత వస్తువులు వస్తాయంటూ నెలలు గడిపారు. బంగారానికి చాలామంది రూ.వేలు, రూ.లక్షలు చొప్పున కట్టారు. నాలుగు నెలలుగా శ్రీనివాసరావు అజ్ఞాతంలోకి వెళ్లాడు. అదేమని అడిగితే విదేశాల నుంచి బంగారం తెస్తుంటే విమానాశ్రయంలో పట్టుకున్నారని, కేంద్ర మంత్రులతో మాట్లాడి విడిపించుకు వస్తానంటూ ఫోన్‌ తీయడం లేదని చెబుతున్నారు. సుమారు 300 మంది వద్ద దాదాపుగా రూ.3 కోట్లు వసూలు చేసుకొని మోసగించారు. న్యాయం చేయాలని ఎస్పీని ఆశ్రయించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని