logo

నాలుక మడతపెట్టి.. ముడుపులు మూటకట్టి.. వైకాపాలో కీలక నేత నిర్వాకం

‘మద్యం పచ్చని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గొలుసు దుకాణాలు లేకుండా చేస్తామని’ ఆర్భాటంగా ప్రకటించారు. అదంతా మాటల్లోనే.. చేతలకు వచ్చేసరికి నాలుక మడత పెట్టారు.

Updated : 27 Feb 2024 08:13 IST

యథేచ్ఛగా గొలుసు దుకాణాలు

న్యూస్‌టుడే, పొన్నూరు: ‘మద్యం పచ్చని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గొలుసు దుకాణాలు లేకుండా చేస్తామని’ ఆర్భాటంగా ప్రకటించారు. అదంతా మాటల్లోనే.. చేతలకు వచ్చేసరికి నాలుక మడత పెట్టారు. ప్రతి పల్లె, పట్టణ పరిధిలో పేదలు నివసించే ప్రాంతాల్లో గొలుసు దుకాణాలు ఏర్పాటు చేసి అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నారు. పేద కుటుంబాల అర్థిక అభివృద్ధికి బాటలు వేస్తున్నామని ఒకవైపు వైకాపా నేతలు గొప్పలు చెబుతూ.. మరోవైపు ప్రతి నెలా రూ.లక్షల్లో ముడుపులు అందుకుని వారి పొట్ట కొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎక్కడెక్కడ ఎలా

పొన్నూరు పట్టణ పరిధిలోని నిడుబ్రోలు, డీఆర్‌కే కాలనీ, వీవర్స్‌కాలనీ, క్యాబిన్‌పేట, డీవీసీ కాలనీ, ప్రభుత్వ వైద్యశాల రోడ్డు, పొన్నూరు మండల పరిధిలో నండూరు, ములుకుదురు, బ్రాహ్మణకోడూరు, పచ్చలతాడిపర్రు, దొప్పలపూడి అడ్డరోడ్డు, మన్నవ తదితర గ్రామాల్లో వైకాపా నేతల సానుభూతిపరులు గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నారు. వైకాపా నేతలు పొన్నూరు పట్టణంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలు నుంచి కొనుగోలు చేసి మద్యాన్ని గొలుసు దుకాణాలకు పంపిస్తున్నారు. ఒక్కొక్క కేసుకు సూమారు రూ.500 నుంచి రూ.700 వరకు ప్రభుత్వ మద్యం దుకాణం సిబ్బందికి వైకాపా నేతలు ముట్ట చెబుతున్నారని సమాచారం.

సీసాకు రూ.20 కప్పం..

బార్‌ కంటే ప్రభుత్వ మద్యం దుకాణంలో 180 ఎం.ఎల్‌. సీసా రూ.50 తక్కువకు లబిస్తోంది. వైకాపా నేతలు గొలుసు దుకాణదారుడి నుంచి ఒక్కొక్క సీసాకు రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారు. గొలుసు దుకాణదారుడి నుంచి వసూలు చేసిన దానిలో ఇద్దరు వైకాపా నేతలకు ఒక్కొక్క సీసాకు రూ.10, వైకాపాలోని కీలక నేతకు మరో రూ.10 ముట్ట చెబుతున్నారు. గొలుసు దుకాణాల ద్వారా ప్రతి నెలా రూ.10లక్షల నుంచి రూ.12లక్షలు ఆదాయం సమకూరుతోందని సమాచారం.

ప్రతి నెలా రూ.5లక్షల వసూళ్లు..

ప్రతి నెలా వైకాపాలోని కీలక నేతకు సుమారు రూ.5లక్షలు ముడుపులు అందిస్తున్నారు. కీలక నేత ఆదేశాలతోనే సెబ్‌ అధికారులు తనిఖీలు చేయడం లేదనే విమర్శలు వెలువడుతున్నాయి. మన్నవ, నిడుబ్రోలులో అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు సెబ్‌ ఉన్నతాధికారులు తనిఖీలు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పొన్నూరు అర్బన్‌ పోలీసులు నిడుబ్రోలులో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వైకాపాలోని కీలక నేత ఆదేశాలతోనే స్థానిక సెబ్‌ అధికారులు దాడులు చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గొలుసు దుకాణాల నిర్వహణపై స్థానికులు ఫిర్యాదు చేస్తే తనిఖీలకు వెళ్లకమందే దుకాణదారుడికి సమాచారం చేరుతోందనే విమర్శలు ఉన్నాయి.


తెల్లవారుజామున రవాణా..

పొన్నూరులో మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న అర్బన్‌ పోలీసులు

ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి కొనుగోలు చేసిన మద్యన్ని వైకాపా నేత పచ్చని పల్లెలు, ప్రశాంతతకు నిలయమైన వివిధ వార్డుల్లో ఏర్పాటు చేసిన గొలుసు దుకాణాలకు రోజూ తెల్లవారుజూమున 4 గంటల నుంచి ఉదయం 8గంటల లోపు వాహనాల ద్వారా తరలిస్తున్నారు. ఆ సమయంలో ఏ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించడం లేదు. పొన్నూరు పట్ణణ, మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో గొలుసు దుకాణాలకు ప్రతి నెలా సుమారు 50వేల నుంచి 60వేల వరకు 180 ఎం.ఎల్‌ మద్యం సీసాల విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం.


ఎక్కడా దుకాణాల్లేవు: సుకన్య, సెబ్‌ సీఐ

పొన్నూరు ప్రాంతంలో గొలుసు దుకాణాలు ఎక్కడా నిర్వహించడం లేదు. వాటి వివరాలు చెబితే తనిఖీలు నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని