logo

Narasaraopeta: తలాడిస్తేనే సీటు.. లేకుంటే బదిలీ..

జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరిగే వ్యవహారాలు రాజకీయాలతో ముడిపడి ఉంటున్నాయి. చివరకు అధికారుల బదిలీల విషయంలో కూడా రాజకీయమే ప్రధాన అస్త్రంగా ఉంటోంది. తాజాగా నరసరావుపేట పురపాలక కమిషనర్‌ బదిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది

Updated : 29 Feb 2024 09:53 IST

జిల్లా కేంద్రంలో అధికారులకు తప్పని కష్టాలు

 ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట: జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరిగే వ్యవహారాలు రాజకీయాలతో ముడిపడి ఉంటున్నాయి. చివరకు అధికారుల బదిలీల విషయంలో కూడా రాజకీయమే ప్రధాన అస్త్రంగా ఉంటోంది. తాజాగా నరసరావుపేట పురపాలక కమిషనర్‌ బదిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కోటప్పకొండ ఈవో శ్రీనివాస్‌రెడ్డిని బదిలీ చేస్తే వెళ్లనీయకుండా అడ్డుకోవడం.. పురపాలక సంఘంలో పనుల విషయంలో తమకు నచ్చిన అధికారిని తెచ్చుకోవడంలో స్థానిక ప్రజాప్రతినిధి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. దీనిబట్టి తాము చెప్పినట్టు తలాడిస్తూ ఉండేవాళ్లకే పెద్దపీట వేస్తారని మరోసారి రుజువైందని పుర ప్రజలు విమర్శిస్తున్నారు.

 కోటప్పకొండ ఆలయానికి అసిస్టెంట్‌ కమిషనర్‌(ఏసీ) స్థాయి అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన నల్లకాల్వ శ్రీనివాస్‌రెడ్డిని ఏసీగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆయన ఈనెల 10న విధుల్లో చేరడానికి కోటప్పకొండ వచ్చారు. కానీ అధికార పార్టీ నేతలు తిరునాళ్ల తర్వాత రావాలని, ఇప్పుడు విధుల్లో చేరడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. చేసేది లేక వెళ్లిపోయారు. మరోసారి విధుల్లో చేరడానికి ప్రయత్నించినా వైకాపా నాయకులు అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. ఇక చేసేది లేక ఏసీ సెలవు పెట్టి వెళ్లిపోయారు. కోటప్పకొండ తిరునాళ్ల మొదటి సమీక్షా సమావేశంలో కూడా కలెక్టర్‌, జేసీలు కూడా ఈవో ఎవరు? మీరేనా? పూర్తిస్థాయి ఈవోనా? లేక ఇన్‌ఛార్జినా? మీ పేరేమిటి? అని అడగడం అక్కడ ఉన్న మిగతా అధికారులు ఆశ్చర్యపోయారు. వెంటనే ఎమ్మెల్యే కలుగజేసుకుని ఆయన పేరు శ్రీనివాస్‌రెడ్డి అని, తిరునాళ్ల వరకూ ఉంటారని, తర్వాత కొత్త అధికారి వస్తారని చెప్పడం విశేషం. అంటే అధికారి రావాలన్నా.. వెళ్లాలన్నా.. వైకాపా పెద్దల నిర్ణయం ఉండాలా.. అని ఇతర అధికారులు గుసగుసలాడుకున్నారు. తిరునాళ్ల వరకూ తాము చెప్పిట్లు నడుచుకునే అధికారి అయితే బాగుంటుందని, అంతేకాకుండా ఇప్పటివరకూ జరిగినవాటికి లెక్కలు చెప్పాల్సి వస్తుందనే ఏసీ అధికారిని రాకుండా అడ్డుకున్నారనే ఆరోపణలున్నాయి.
అడ్డుగా ఉన్నారని పంపేశారా? : నరసరావుపేట పురపాలక కమిషనర్‌ అయిన రామ్మోహన్‌ను ఉన్నఫళంగా బదిలీ చేయడం.. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆరుగురు కమిషనర్లు పురపాలక సంఘానికి రావడం ఓ తంతులా మారింది. సొంతంగా ఆలోచించకూడదు.. చెప్పినచోటల్లా సంతకాలు చేయాలి అనేవిధంగా ఉండటం వల్లే స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి తట్టుకోలేక కమిషనర్లు మారిపోతున్నారని బహిరంగంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల బదిలీల్లో భాగంగా గత నెలలో కమిషనర్‌ రామ్మోహన్‌ను నందిగామ బదిలీ చేశారు. అంతలోనే తర్వాతి రోజున యథాస్థితిలో ఆయన్నే కొనసాగించారు. బదిలీపై వెళ్లిన కమిషనర్‌ కోటప్పకొండ తిరునాళ్ల పనులను కూడా పరిశీలిస్తున్నారు. ఇంతలోనే బదిలీ చేశారు. గడప గడపకు బిల్లులు, చెక్కులపై నిబంధనలకు విరుద్ధంగా సంతకాలు చేయాలని ఒత్తిళ్లు ఉండటం, వీటిని తిరస్కరించడం వల్లే బదిలీ చేసినట్టు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు