logo

YSRCP: కుదురుకొనేలోగా.. కుదిపేస్తున్నారు!

గుంటూరు పార్లమెంటు వైకాపా సమన్వయకర్తగా ఉమ్మారెడ్డి వెంకటరమణ స్థానంలో కిలారు రోశయ్యను ఆ పార్టీ ప్రకటించింది. వైకాపా అధిష్ఠానం 26 రోజుల వ్యవధిలోనే మళ్లీ అభ్యర్థిని మార్చడం గమనార్హం

Updated : 29 Feb 2024 08:48 IST

గుంటూరు పార్లమెంటు సమన్వయకర్తగా రోశయ్య

26 రోజుల వ్యవధిలోనే ఎంపీ అభ్యర్థి మార్పు

 

ఈనాడు, అమరావతి: గుంటూరు పార్లమెంటు వైకాపా సమన్వయకర్తగా ఉమ్మారెడ్డి వెంకటరమణ స్థానంలో కిలారు రోశయ్యను ఆ పార్టీ ప్రకటించింది. వైకాపా అధిష్ఠానం 26 రోజుల వ్యవధిలోనే మళ్లీ అభ్యర్థిని మార్చడం గమనార్హం. పొన్నూరు అసెంబ్లీ స్థానానికి మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళిని సమన్వయకర్తగా నియమిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేశారు. గుంటూరు పార్లమెంటు సమన్వయకర్తగా నియమించిన కిలారు రోశయ్య ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అక్కడి నుంచే పోటీ చేయాలని భావించారు. అయితే గుంటూరు పార్లమెంటు స్థానానికి కిలారు రోశయ్య బావ అయిన ఉమ్మారెడ్డి వెంకటరమణను ప్రకటించడంతో ఒకే పార్లమెంటు పరిధిలో ఇద్దరికి సీట్లు ఇస్తారా? అన్న చర్చ తెరపైకి వచ్చింది. అప్పటి నుంచి పొన్నూరు అసెంబ్లీ స్థానానికి పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి.

ఉమ్మారెడ్డి వెంకటరమణ సమన్వయకర్తగా నియమితులైన వెంటనే హైదరాబాద్‌ నుంచి వచ్చి గుంటూరులో కార్యాలయం ఏర్పాటు, ఇతర అంశాలపై దృష్టి సారించారు. పార్టీ నేతలు, శ్రేయోభిలాషులతో ఎన్నికల విషయమై చర్చించారు. ఈనెల 15న ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం సభకు సీఎం హాజరుకాగా దానికి ఆయన హాజరయ్యారు. అప్పటి నుంచి ఆయన అంత క్రియాశీలకంగా లేరు. అయిదు రోజులుగా స్థానికంగా లేకపోగా ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో ఆయన పోటీకి విముఖంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన స్థానంలో కిలారు రోశయ్యను నియమించారన్న వాదన వినిపిస్తోంది. పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత సమన్వయకర్తలను ఎంపిక చేస్తున్నామని అధిష్ఠానం చెప్పడంతో నియమితులైన వారు ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో అభ్యర్థులను మారుస్తుండడంపై ఆ పార్టీలోనే చర్చనీయాంశమైంది. ఇ

లా అభ్యర్థులను మార్చడం వల్ల పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులపై కూడా ప్రభావం పడుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ ప్రాతిపదికన నియమిస్తున్నారో... ఎందుకు తప్పిస్తున్నారో తెలియడం లేదని కార్యకర్తల్లో గందరగోళం మొదలైంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు వైకాపాలో సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడైన ఉమ్మారెడ్డి వెంకటరమణను రాజకీయ వారసుడిగా తీసుకురావాలని రెండు దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈసారి అవకాశం వచ్చిందన్న ఆనందంలో ఉండగానే మళ్లీ ఆయన్ను తప్పించడంతో మరోసారి ఆయనకు నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఇది ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తోందన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

పొన్నూరుకు అంబటి మురళి  

భజరంగ కన్‌స్ట్రక్షన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అంబటి మురళిని పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఆయన జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబుకు సోదరుడు. ఆయన పొన్నూరు మండలంలోని మామిళ్లపల్లి గ్రామానికి చెందినవారు. భజరంగ ఫౌండేషన్‌ స్థాపించి గత కొన్నాళ్లుగా పొన్నూరు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పొన్నూరు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఇప్పటికే అంబటి రాంబాబు సత్తెనపల్లికి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఒకే కుటుంబంలో ఇద్దరికి సీటు కేటాయిస్తారా? అన్న చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పుడు అంబటి మురళికి పొన్నూరులో అవకాశం ఇవ్వడంతో సత్తెనపల్లి సీటు విషయమై మరోసారి చర్చనీయాంశమైంది. ఏదీ ఏమైనా వైకాపా సమన్వయకర్తల జాబితా వస్తుందంటే ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎప్పుడు ఎవరిని బదిలీ చేస్తారో... కొత్తవారు ఎవరు తెరపైకి వస్తారోనన్న ఆందోళన ఆ పార్టీ అభ్యర్థుల్లో నెలకొంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే నియమించిన సమన్వయకర్తలను మారుస్తుండడం బలం చేకూరుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని