logo

మిర్చి రైతు దిగాలు..!

మిర్చికి మంచి ధర ఉండటంతో రైతులు గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. ఆరుగాలం శ్రమించినా కష్టాలు తప్పడం లేదు. ప్రధానంగా మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది.

Updated : 02 Mar 2024 05:51 IST

దిగుబడుల వేళ తగ్గిన ధర

కూలి ధర పెంపుతో భారం

 

కల్లంలో ఆరబోసిన ఎర్ర బంగారం

నరసరావుపేట వ్యవసాయం, న్యూస్‌టుడే: మిర్చికి మంచి ధర ఉండటంతో రైతులు గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. ఆరుగాలం శ్రమించినా కష్టాలు తప్పడం లేదు. ప్రధానంగా మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఒడుదొడుకులను ఎదుర్కొని పంట సాగు చేశారు. సాగు వేళ క్వింటా మిర్చి ధర రూ.22 వేలు పలకడంతో రైతులు సంబరపడ్డారు. కానీ పంట దిగుబడి ప్రారంభమైనప్పటి నుంచి ధర తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం క్వింటా తేజ రకం రూ.19 వేల నుంచి రూ.20 వేలు ఉంది. వేరే రకాలు అయితే రూ.14 వేల నుంచి రూ.15 వేల వరకు ఉన్నాయి. ఇలా ఆందోళనలో ఉన్న రైతులకు కూలీల కొరత వేధిస్తోంది. కోత కూలి గతంలో రూ.240 ఉండగా ఇప్పుడు రూ.450కి చేరింది. కొన్ని ప్రాంతాల్లో రూ.460 వరకు ఉంది. దీంతో మిర్చి రైతులు బెంబేలెత్తుతున్నారు. అలాగని దిగుబడులూ ఆశాజనకంగా లేవు.
జిల్లాలో 55,969 హెక్టార్లలో మిర్చి సాగు చేశారు. తొలినాళ్లలో తోటలు బాగానే ఉన్నాయి. పూత, పిందె దశలో వచ్చిన తుపాను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దీనికి తోడు నల్ల తామర పురుగు ఆశించటంతో దాని నివారణకు రోజు మార్చి రోజు పురుగు మందుల పిచికారీ చేయటం, సకాలంలో వర్షాలు లేక ట్యాంకర్ల ద్వారా తడులు అందించటం వల్ల పెట్టుబడి పెరిగింది.  అయినా అశించిన దిగుబడులు రావటం లేదు. ఎకరాకు 18 క్వింటాళ్ల నుంచి 20 వరకు వస్తాయని ఆశించగా తుపాను, నల్లతామర పురుగు ప్రభావంతో ఆశలకు గండి పడింది.
ప్రస్తుతం మిర్చికోత కూలి రేట్లు భగ్గుమంటున్నాయి. జనవరి రెండో వారంలో మిర్చి కోత కూలి ఒక్కో మనిషికి రూ.350 ఉండగా నేడు రూ.450కి చేరింది. మరి కొన్ని గ్రామాల్లో రూ.460 వరకు చెల్లిస్తున్నారు. కూలి ఇవ్వడంతో పాటు వారిని పొలం వరకు ఆటో లేదా ట్రాక్టర్‌లో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా రైతులదే. 13 మంది కూలీలు కలిసి క్వింటా కాయలు కోస్తారు. రూ.450 చొప్పున లెక్క వేసినా క్వింటాకు రూ.6 వేలు అవుతుంది. తాలుకాయలు వేరు చేసేందుకు మరో రూ.2 వేలు అవుతుందని రైతులు తెలిపారు. ప్రస్తుత కూలి ధరను పరిశీలిస్తే ఇంటిల్లిపాది కష్టపడినా కూలి కూడా దక్కే పరిస్థితి లేదని రైతులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని