logo

కిరాయి దోపిడీ

మిర్చి సీజన్‌ ఊపందుకోవడంతో కొందరు అధికారాన్ని అడ్డుపెట్టుకొని లారీ కిరాయి వసూళ్లు ఒకేసారి పెంచేశారు. ఇప్పటి వరకూ పెంచిన కిరాయే ఎక్కువగా ఉందని మిర్చి ఎగుమతి వ్యాపారులు లబోదిబోమంటుంటే మళ్లీ రూ.7,000 వరకు పెంచి దోచుకుంటున్నారు

Published : 02 Mar 2024 05:20 IST

లారీకి రూ.7,000 పెంచి వసూళ్లు..!

యూనియన్‌ పేరుతో వైకాపా నేతల దందా

లారీ యానియన్‌ నాయకులు వేసిన టెంట్
న్యూస్‌టుడే-మిర్చియార్డు: మిర్చి సీజన్‌ ఊపందుకోవడంతో కొందరు అధికారాన్ని అడ్డుపెట్టుకొని లారీ కిరాయి వసూళ్లు ఒకేసారి పెంచేశారు. ఇప్పటి వరకూ పెంచిన కిరాయే ఎక్కువగా ఉందని మిర్చి ఎగుమతి వ్యాపారులు లబోదిబోమంటుంటే మళ్లీ రూ.7,000 వరకు పెంచి దోచుకుంటున్నారు. సాధారణంగా గుంటూరు నుంచి లారీలో 20 టన్నుల మిర్చి లోడ్‌ చేసి బంగ్లాదేశ్‌ సరిహద్దు వరకు రవాణా చేస్తే గతంలో రూ.1.58 లక్షల కిరాయి వసూలు చేసేవారు. ఇప్పుడదీ రూ.1,65,000 చేసేశారు. దాచేపల్లి, పిడుగురాళ్ల నుంచి బంగ్లాదేశ్‌ సరిహద్దుకు మిర్చి తీసుకెళితే కిరాయి ఇంత కంటే తక్కువగా ఉంది. ఏంటీ.. దాచేపల్లితో పోల్చితే 80 కిలోమీటర్లు దూరం తక్కువగా ఉన్న గుంటూరు నుంచి అద్దె ఎక్కువనుకుంటున్నారా.. ఇది గుంటూరులోని ఓ లారీ యూనియన్‌ వసూలు చేస్తున్న తీరు. అదనంగా వసూలు చేసి సొమ్ములో కొంత సంఘానికి, ఇంకొంత వైకాపా నేతల జేబుల్లోకి వెళ్తోందని ఎగుమతి వ్యాపారులు విమర్శిస్తున్నారు. అధికార పార్టీ నేతలు వెనుక ఉండి నడిపిస్తుండటంతో అదనపు వసూళ్లను అడిగేవారు, అడ్డుకునే వారెవ్వరూ లేరు. వారిని కాదని ఎగుమతి వ్యాపారులు ఇతరుల లారీలు పెట్టుకుంటే అక్కడికెళ్లి అడ్డుకుని దౌర్జన్యాలకు దిగుతున్నారు. ప్రస్తుతం మిర్చి సీజన్‌ కావడంతో వారు చెప్పిన ధర చెల్లించి మిర్చి ఎగుమతి చేస్తున్నారు. తక్కువ కిరాయికి లారీలు పెట్టేందుకు ఎవరొచ్చినా ఊరుకునేది లేదని లారీ యజమానులు.. వ్యాపారులను బెదిరిస్తున్నారు.

వేచిచూసే ధోరణిలో వ్యాపారులు..

మిర్చియార్డు నుంచి బంగ్లాదేశ్‌ సరిహద్దు, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, అసోం రాష్ట్రాల వైపు వెళ్లే లారీల యజమానులందరూ ఒక సంఘంగా ఏర్పాటయ్యారు. దిల్లీ, ఉత్తరప్రదేశ్‌ వైపు వెళ్లే లారీలకు ఒక సంఘం, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లకు మరొకటి, గుజరాత్‌ వైపు ఒకటి, చెన్నైకు ఇంకో యూనియన్‌ చొప్పున ఏర్పాటయ్యాయి. ఇందులో సభ్యులుగా ఉన్న లారీ యజమానులేఆయా ప్రాంతాలకు లారీలను పెట్టాలి. వీరు కాకుండా ఇతరులెవరూ లారీలు తెచ్చి మిర్చి లోడింగ్‌ చేయడానికి వీల్లేదు. ఇందుకు అధికార పార్టీ నేతలు అండదండలు అందించి ప్రతిఫలంగా సొమ్ము పొందుతున్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో నగరాలకు గుంటూరులోని సంఘాల నుంచి లారీ పెట్టుకుంటే ఆయా నగరాలను అనుసరించి సాధారణంగా చెల్లించే అద్దె కంటే రూ.10 వేల నుంచి రూ.35 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. యార్డు పరిధిలో మాత్రమే ఈ సంఘాల ప్రభావం ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో ఈ పరిస్థితి లేదు. సంఘాల వెనుక ఉన్న అధికార పార్టీ నేతలు నిర్ణయించిందే అద్దెగా వసూలు చేయడంతో వ్యాపారులు ప్రశ్నించలేని పరిస్థితి. యూనియన్‌ని కాదని లారీ తెచ్చుకుంటే అక్కడికి పదుల సంఖ్యలో వ్యక్తులు వెళ్లి లారీ నుంచి బస్తాలు దించే వరకు వదలడం లేదు. దీంతో వారు చెప్పినంత ధర చెల్లించి వ్యాపారాలు చేస్తున్నారు. ఇందులో కొందరు వైకాపా నేతలు సంఘాలపై ఆధిపత్యం చలాయిస్తున్నారు.

అధికార బలంతో అడ్డుకుంటూ...

ఇక్కడి నుంచి ఎగుమతి సరకు తీసుకెళ్లే లారీలు బంగ్లాదేశ్‌ సరిహద్దుతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్తుంటాయి. గుంటూరు నుంచి వెళ్లే ప్రతి లారీపై రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు అదనంగా కిరాయి వసూలు చేస్తుండటంతో రోజువారీగా రూ.లక్షల్లో సమకూరుతోంది. తక్కువ కిరాయికి లారీలు పెట్టేందుకు ముందుకొచ్చే లారీ ఆపరేటర్లను అధికార, అంగబలంతో అడ్డుకుంటున్నారు. మిర్చియార్డు సమీపంలో యూనియన్‌ పేరుతో టెంట్ వేసుకొని మరీ తక్కువ కిరాయికి లారీ పెట్టకుండా కాపలా కాస్తున్నారు. గతంలో మిర్చియార్డు పాలకవర్గం  కిరాయి తగ్గించేలా చర్యలు తీసుకొంది. ప్రస్తుతం మిర్చి సీజన్‌ కావడం వల్ల తెగే వరకూ లాగితే ఇబ్బంది అవుతుందని ఎగుమతి వ్యాపారులు అడిగినంత కిరాయి ఇచ్చేస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని