logo

కమిటీ వేసి చేతులు దులిపేసుకుంటారా..?

దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్‌స్టోరేజి దగ్ధం విషయంలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే రైతులకు న్యాయం జరుగుతుందని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు అన్నారు. రైతులకు సత్వరం

Published : 02 Mar 2024 05:23 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు, పక్కన శివశంకర్‌

దుగ్గిరాల, న్యూస్‌టుడే: దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్‌స్టోరేజి దగ్ధం విషయంలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే రైతులకు న్యాయం జరుగుతుందని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు అన్నారు. రైతులకు సత్వరం న్యాయం జరగాలని కోరుతూ పసుపు రైతులు, బాధితులతో కలిసి రైతు సంఘం నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల్ని ఎమ్మెల్సీ శుక్రవారం ప్రారంభించారు. ఇంత ప్రమాదం జరిగినా అధికారులు, ప్రజాప్రతినిధులు, బీమా కంపెనీలు ఎవరూ సరిగా స్పందించలేదన్నారు. ప్రమాదం జరిగినప్పుడు సుమారు 80 వేల క్వింటాళ్ల సరకు ఉందని, వందలాది మంది రైతులు నష్టపోయారని లక్ష్మణరావు అన్నారు. విచారణ పేరుతో ఒక కమిటీ వేసి చేతులు దులుపుకున్నారన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకూ క్వింటాకు రూ.13 వేల చొప్పున  చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కోల్డ్‌స్టోరేజి యజమాని మీద చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ మంత్రి కానీ,  హోంమంత్రి కానీ, ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి కానీ స్పందించాలన్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు జరిగే అన్ని ఉద్యమాలకు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల మద్దతు ఉంటుందన్నారు. పసుపురైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ జొన్నా శివశంకర్‌ మాట్లాడుతూ కోల్డ్‌స్టోరేజి ఇచ్చిన లెక్కల ప్రకారం 381 మంది రైతులు 1,04,260 బస్తాలున్నాయని, యార్డు లెక్కలు బయటపెట్టాలన్నారు. కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్య మాట్లాడుతూ రైతులకు సంఘీభావంగా ఎమ్మెల్యే, మంత్రులు, ముఖ్యమంత్రి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రైతు సంఘ నాయకులు యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, నులకా శివసాంబిరెడ్డి, వేములపల్లి వెంకట్రామయ్య, జెట్టి బాలరాజు, అమ్మిరెడ్డి, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, కాట్రగడ్డ శివరామకృష్ణయ్య, కాజా వెంకటేశ్వరరావు, సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌ నాయకుడు లోకం భాస్కరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ఆళ్ల వెంకటప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని