logo

‘అభ్యర్థులు దొరక్క జగన్‌ సతమతం’

వచ్చే ఎన్నికల్లో వైకాపాకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెదేపా జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ హెచ్చరించారు.

Published : 02 Mar 2024 05:24 IST

సమావేశంలో తెదేపా నాయకులు
పట్టాభిపురం, న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో వైకాపాకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెదేపా జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ హెచ్చరించారు. గుంటూరులోని తెదేపా జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైకాపాకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు దొరక్క దిక్కుతోచని స్థితిలో జగన్‌ రాజకీయ క్రీడ ప్రారంభించారు. ఇందులో భాగమే ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ అక్రమ అరెస్టు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ విజయవంతం కావడంలో పుల్లారావు భాగస్వామ్యం ఉండటంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. చిలకలూరిపేటలో పుల్లారావును రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ కాపు సామాజిక వర్గానికి దశ, దిశ స్పష్టంగా నిర్దేశించిన సందర్భంగా ప్రజల దృష్టిని మళ్లించేందుకు దీనికి ఒడిగట్టారు. తెదేపా నాయకుల్ని, కుటుంబ సభ్యుల్ని అక్రమంగా అరెస్టు చేస్తే భయపడి వెనక్కి తగ్గుతారనుకుంటున్నారు. జగన్‌ ఇకనైనా ఈ తరహా రాజకీయాలకు స్వస్తి పలక్కపోతే వచ్చే ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కవు’.. అని హెచ్చరించారు. సమావేశంలో తెదేపా నాయకులు దాసరి రాజామాస్టారు, కంచర్ల శివరామయ్య, దామచర్ల శ్రీనివాసరావు, నూతలపాటి రామారావు, నాయుడు ఓంకార్‌, పుట్టి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని